శివాలెత్తిన బెన్‌ స్టోక్స్‌.. 15 ఫోర్లు, 9 సిక్సర్లు.. డబుల్‌ సెంచరీ మిస్‌ | ENG Vs NZ 3rd ODI Highlights: Ben Stokes Blasts With 182 Runs As Highest ODI Score By An England Player - Sakshi
Sakshi News home page

ENG VS NZ 3rd ODI: శివాలెత్తిన బెన్‌ స్టోక్స్‌.. 15 ఫోర్లు, 9 సిక్సర్లు.. డబుల్‌ సెంచరీ మిస్‌

Published Wed, Sep 13 2023 9:07 PM

ENG VS NZ 3rd ODI: Ben Stokes Blasts With 182 Runs, As England Scores Huge Score - Sakshi

వరల్డ్‌కప్‌ కోసం రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని జట్టులో చేరిన ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ వన్డేల్లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. 2022 జులైలో వన్డేలకు గుడ్‌బై చెప్పిన స్టోక్సీ.. ప్రస్తుతం స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుతున్న సిరీస్‌తోనే వన్డే క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రాగానే తొలి మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో చెలరేగిన స్టోక్స్‌.. రెండో వన్డేలో ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. 

లండన్‌లోని కెన్నింగ్‌స్టన్‌ ఓవల్‌ వేదికగా ఇవాళ (సెప్టెంబర్‌ 14) జరుగుతున్న మూడో వన్డేలో తొలి బంతి నుంచి పూనకం వచ్చినట్లు ఊగిపోయిన స్టోక్స్‌ పట్టపగ్గాల్లేకుండా పేట్రేగిపోయాడు. కేవలం 124 బంతుల్లోనే 15 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 182 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్‌లో ఇంగ్లండ్‌ తరఫున ఇదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్‌ కావడం విశేషం.

తొలుత డేవిడ్‌ మలాన్‌ (95 బంతుల్లో 96; 12 ఫోర్లు, సిక్స్‌) రెచ్చిపోతున్న సమయంలో ఆచితూచి ఆడిన స్టోక్స్‌.. అర్ధసెంచరీ పూర్తి చేశాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మలాన్‌ 4 పరుగుల తేడాతో సెంచరీ మిస్‌ చేసుకున్నప్పటికీ ఏమాత్రం తగ్గని స్టోక్స్‌, రెట్టింపు ఉత్సాహంతో బౌండరీలు, సిక్సర్లు బాది సెంచరీ, ఆతర్వాత 150 పరుగులు పూర్తి చేశాడు. మధ్యలో కాసేపు కెప్టెన్‌ బట్లర్‌ (38; 6 ఫోర్లు, సిక్స్‌) అతనికి జత కలిశాడు.

182 పరుగుల వద్ద మరో భారీ సిక్సర్‌కు ప్రయత్నించి స్టోక్స్‌ ఔటయ్యాడు. స్టోక్స్‌ ఔటయ్యాక ఆఖర్లో వికెట్లు వెనువెంటనే పడిపోవడంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 368 పరుగుల వద్ద ముగిసింది. 11 బంతులు వేస్ట్‌ అయ్యాయి. ఒకవేళ స్టోక్స్‌ ఔట్‌ కాకుండా ఉండివుంటే, అతను డబుల్‌ సెంచరీ, ఇంగ్లండ్‌ 450కిపైగా పరుగులు తప్పక చేసుండేది. స్టోక్స్‌, మలాన్‌, బట్లర్‌ మినహా ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో అందరూ తేలిపోయారు.

ఓ పక్క స్టోక్స్‌ తాండవం చేస్తున్నా కివీస్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ ఏమాత్రం తగ్గకుండా 5 వికెట్లతో చెలరేగాడు. స్టోక్స్‌ అందరు బౌలర్లకు చుక్కలు చూపించినప్పటికీ బౌల్ట్‌ తప్పించుకున్నాడు. స్టోక్స్‌ను ఔట్‌ చేసిన బెన్‌ లిస్టర్‌ ఆఖర్లో 3 వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ తలో వికెట్‌ దక్కించుకన్నారు. కాగా, 4 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి వన్డేలో న్యూజిలాండ్‌, రెండో వన్డేలో ఇంగ్లండ్‌ గెలుపొందాయి. అంతకుముందు జరిగిన 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ 2-2తో సమంగా ముగిసింది.

Advertisement
Advertisement