సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డు మూకుమ్మడి రాజీనామా

27 Oct, 2020 16:06 IST|Sakshi

జొహన్నెస్‌బర్గ్‌: గత కొన్ని రోజులుగా దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు(సీఎస్‌ఏ)లో చోటు చేసుకున్న వివాదాల కారణంగా 10 మంది క్రికెట్‌ బోర్డు డైరెక్టర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు. తాత్కాలిక పరిపాలన విభాగానికి ఎటువంటి ఎటువంటి అవాంతరాలు లేకుండా ఉండటం కోసమే బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు రాజీనామాకు పూనుకున్నారు. ఇటీవల సీఎస్‌ఏపై  ఆ దేశపు స్పోర్ట్స్‌ కాన్ఫెడరేషన్, ఒలింపిక్‌ కమిటీ (ఎస్‌ఏఎస్‌సీఓసీ) విచారణకు రంగం సిద్ధం చేసింది. బోర్డు అవకతవకలు, అనుచిత కార్యకలాపాలకు పాల్పడినట్లు వచ్చిన అరోపణలపై ఎస్‌ఏఎస్‌సీఓసీ  విచారణ చేపట్టింది. నల్లజాతీయులపై వివక్ష, అవినీతి ఆరోపణలతో ప్రభుత్వం.. సఫారీ బోర్డును రద్దు చేసింది.  (వారిదే టైటిల్‌.. ఆర్చర్‌ జోస్యం నిజమయ్యేనా?)

దాంతో సీఎస్‌ఏ అధికారులెవరూ రోజువారీ కార్యకలాపాల్లో తలదూర్చడానికి వీలులేదు. సీఎస్‌ఏ మాజీ సీఈఓ తబంగ్‌ మోన్రో గత నెల క్రికెట్‌ బోర్డు అక్రమాలు, అవకతవకలకు పాల్పడుతుందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఫొరెన్సిక్‌ నివేదికలు కూడా ఇవే ధ్రువీకరిస్తున్నాయని మండిపడ్డారు. తదనంతర పరిణామాలతో బోర్డు తాత్కాలిక సీఈఓ జాక్వెస్‌ ఫాల్, అధ్యక్షుడు క్రిస్‌ నెంజానిలు రాజీనామా చేశారు.

తాజాగా మొత్తం బోర్డులోని అధికారులంతా తమతమ పదవులకు రాజీనామా చేశారు. ఆదివారం సమావేశం అనంతరం తాత్కాలిక బోర్డు అధ్యక్షుడు బెరెస్‌ఫోర్డ్‌ విలియమ్స్‌తో పాటు ఆరుగురు రాజీనామాలు సమర్పించారు. అంతకుముందు నలుగురు సభ్యులు రాజీనామాలు చేశారు. దక్షిణాఫ్రికా క్రికెట్‌ ప్రయోజనాల లక్ష్యంగా తాము రాజీనామాల నిర్ణయం తీసుకుంటున్నట్లు సీఎస్‌ఏ ఒక ట్వీట్‌లో పేర్కొంది.  బోర్డు సభ్యుల రాజీనామాలను తమకు అందిన విషయాన్ని సభ్యుల కౌన్సిల్‌ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ఆకస్మిక పరిణామాల కారణంగా రద్దైన బోర్డు స్థానంలో తాత్కాలిక బోర్డును ఏర్పాటు చేయనున్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు