Ganemat, Darshna Claim Historic Silver, Bronze At ISSF World Cup - Sakshi
Sakshi News home page

Shooting World Cup: చరిత్ర సృష్టించిన భారత షూటర్లు

Published Wed, May 24 2023 9:20 AM

Ganemat, Darshna Claim Historic Silver, Bronze At ISSF World Cup - Sakshi

అల్మాటీ (కజకిస్తాన్‌): ప్రపంచకప్‌ షాట్‌గన్‌ షూటింగ్‌ టోర్నీలో భారత షూటర్లు చరిత్ర సృష్టించారు. మహిళల స్కీట్‌ ఈవెంట్‌లో భారత్‌కు తొలిసారి రజత, కాంస్య పతకాలు లభించాయి. ఆరుగురు షూటర్ల మధ్య మంగళవారం జరిగిన స్కీట్‌ ఈవెంట్‌ ఫైనల్లో గనీమత్‌ ‘షూట్‌ ఆఫ్‌’లో గురితప్పి రజత పతకం సాధించగా... దర్శన    కాంస్య పతకాన్ని సంపాదించింది. 60 షాట్‌ల ఫైనల్లో అసెమ్‌ ఒరిన్‌బే (కజకిస్తాన్‌), గనీమత్‌ 50 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. స్వర్ణ, రజత పతకాల కోసం రెండు షాట్‌ల ‘షూట్‌ ఆఫ్‌’ను నిర్వహించారు.

ఒరిన్‌బే రెండు పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతకాన్ని ఖరారు చేసుకోగా... గనీమత్‌ ఒక పాయింట్‌ సాధించి రజతం దక్కించుకుంది. దర్శన 39 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. అంతకుముందు క్వాలిఫయింగ్‌లో దర్శన 120 పాయింట్లు సాధించి రెండో ర్యాంక్‌లో, గనీమత్‌ 117 పాయింట్లు స్కోరు చేసి నాలుగో ర్యాంక్‌లో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందారు. పురుషుల స్కీట్‌ ఈవెంట్‌లో భారత్‌ నుంచి ముగ్గురు షూటర్లు మేరాజ్‌ అహ్మద్‌ ఖాన్, గుర్జోత్‌ ఖాంగురా, అనంత్‌జీత్‌ సింగ్‌ వరుసగా 17వ, 19వ, 23వ స్థానాల్లో నిలిచి ఫైనల్‌ చేరలేకపోయారు.    

Advertisement
Advertisement