‘ఒకే ఒక్క తప్పుతో వరల్డ్‌కప్‌ చేజార్చుకున్నాం’ | Sakshi
Sakshi News home page

‘తప్పు చేశాం.. వరల్డ్‌కప్‌ చేజార్చుకున్నాం’

Published Mon, Aug 24 2020 1:52 PM

Gavaskar Highlights Reason Why India Couldnt Win Last World Cup - Sakshi

న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌కప్‌ జరిగి ఏడాది అయ్యింది. అయినా ఆ వరల్డ్‌కప్‌పై ఇప్పటికీ ఏదొక సందర్భంలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆ మెగాటోర్నీ ఆరంభానికి ముందు భారత జట్టు ఫేవరెట్‌గా ఇంగ్లండ్‌లో అడుగుపెట్టింది. అప్పటికి గత కొన్నేళ్ల నుంచి టీమిండియా సాధిస్తున్న విజయాలు చూసి అంతా మనమే ఫేవరెట్‌ అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే లీగ్‌ స్టేజ్‌లో గ్రూప్‌ టాపర్‌గా నిలిచిన విరాట్‌ సేన వరల్డ్‌కప్‌ రేసులో నిలిచింది. కానీ అనుకున్నది జరగలేదు. చివరకు ఇంగ్లండ్‌ టైటిల్‌ ఎగురేసుకుపోయింది. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో భారత్‌ ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలుత కివీస్‌ను బౌలర్లు కట్టడి చేసినా బ్యాటింగ్‌లో వైఫల్యంగా కారణంగా టీమిండియా సెమీస్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 240 పరుగుల ఛేదనలో టాపార్డర్‌, మిడిల్‌ ఆర్డర్‌ విఫలం కావడంతో భారత్‌ 221 పరుగులకే పరిమితమై పరాజయం చెందింది. (చదవండి: అలా అయితే సచిన్‌ అత్యున్నత శిఖరాలకు చేరేవాడా?)

అయితే ఈ సాధారణ లక్ష్యాన్ని ఛేదించలేకపోవడానికి నాల్గో స్థానం సరిగా లేకపోవడమేనని కామెంట్లు తరచు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదే అభిప్రాయాన్ని తాజాగా దిగ్జజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ సైతం వ్యక్తం చేశాడు. ఇండియా టుడేతో మాట్లాడుతూ..‘ మనం 4,5,6 స్థానాల బ్యాటింగ్‌ ఆర్డర్‌పై ఫోకస్‌ చేయాల్సి ఉంది. ఈ స్థానాల్లో ఎవరు మెరుగైన బ్యాట్స్‌మన్‌ అనేది అన్వేషించాలి. ప్రస్తుతం 1,2,3 స్థానాలు మెరుగ్గానే ఉన్నాయి. కానీ నాల్గో స్థానం సరిగా లేదు. అదే వరల్డ్‌కప్‌లో జరిగింది. ఒకవేళ గత వరల్డ్‌కప్‌లో నాల్గో స్థానంలో మంచి బ్యాట్స్‌మన్‌ ఉండి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ప్రధానంగా వరల్డ్‌కప్‌లో కీలక సమయాల్లో మన నాలుగు, ఐదు స్థానాలు బలహీనంగా కనిపించాయి. అదే వరల్డ్‌కప్‌పై ప్రభావం చూపింది. సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడాలంటే ఒక మంచి బ్యాట్స్‌మన్‌ నాలుగు, ఐదు స్థానాల్లో అవసరం. దానిపైనే  దృష్టి సారించాలి’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌ సమయంలో నాల్గో స్థానంపై తీవ్ర చర్చే నడిచింది. అంబటి రాయుడ్ని కాదని విజయ్‌ శంకర్‌ను జట్టులోకి తీసుకున్నారు. విజయ్‌ శంకర్‌కు మధ్యలో గాయమై స్వదేశానికి వచ్చిన రాయుడికి చోటు దక్కలేదు. కాగా, ఆనాటి వరల్డ్‌కప్‌ జట్టులో రాయుడు ఉండి ఉంటే కథ వేరుగా ఉండేదని ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన సురేశ్‌ రైనా చెప్పుకొచ్చాడు. అంబటి రాయుడు లేకపోవడంతోనే వరల్డ్‌కప్‌ను గెలవలేకపోయామని రైనా మనసులో మాటను వెల్లడించాడు. (చదవండి: ‘అతనేమీ వార్న్‌ కాదు.. కుంబ్లే అనుకోండి’)

Advertisement
Advertisement