'Ghar baith ke bhi kya karunga': Star To Net Bowler Mohit Sharma Credits Ashish Nehra - Sakshi
Sakshi News home page

Mohit Sharma: ఒకప్పుడు పర్పుల్‌ క్యాప్‌ విన్నర్‌.. తర్వాత నెట్‌బౌలర్‌! 6.5 కోట్ల నుంచి 50 లక్షల ధరకు.. రీ ఎంట్రీలో..

Published Fri, Apr 14 2023 12:03 PM

Ghar baith ke bhi kya karunga: Star To Net Bowler Mohit Sharma Credits Ashish Nehra - Sakshi

From Purple Cap To Net Bowler To IPL Return- Mohit Sharma Comeback Story: ‘‘ఎప్పుడెప్పుడు మైదానంలో అడుగుపెడతానా అన్న ఆతురత ఓవైపు.. చాలా ఏళ్ల తర్వాత పునరాగమనం చేస్తున్నా కదా.. పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో అన్న బెరుకు మరోవైపు.. వెన్ను నొప్పి నుంచి కోలుకున్న తర్వాత గతేడాది దేశవాళీ క్రికెట్‌ ఆడాను.. 

అతికొద్ది మందికి మాత్రమే నేను డొమెస్టిక్‌ క్రికెట్‌ ఆడుతున్నానని తెలుసు. వారిలో అషూ పా ఒకరు. అషూ పా నాకు కాల్‌ చేసి జట్టుతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పారు. నాకు కూడా.. ‘‘ఇంట్లో కూర్చుని పెద్దగా చేసేది కూడా ఏం లేదు కదా’’ అని అనిపించింది.

అందుకే ఇంట్లో ఖాళీగా ఉండే బదులు జట్టుతో ఉండాలని నిర్ణయించుకున్నా. గతేడాది గుజరాత్‌ టైటాన్స్‌ నెట్‌ బౌలర్‌గా సేవలు అందించా. నెట్‌ బౌలర్‌గా ఉండటం అవమానకరంగా భావించాల్సిన విషయమేమీ కాదు. 

పైగా మనకు కావాల్సినంత ఎక్స్‌పోజర్‌ దొరుకుతుంది. గుజరాత్‌ టైటాన్స్‌తో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉంది’’ అని టీమిండియా పేసర్‌ మోహిత్‌ శర్మ అన్నాడు. ఐపీఎల్‌లో తన పునరాగమనానికి కారణం ఆశిష్‌ నెహ్రా భయ్యా అని చెప్పుకొచ్చాడు. 

అంతా ఆయన వల్లే
టైటాన్స్‌ డ్రెస్సింగ్‌ రూంలో వాతావరణం ఎంతో బాగుంటుందని కోచ్‌ నెహ్రా, కెప్టెన్‌ హార్దిక్ పాండ్యా సహాయ సహకారాల వల్లే తను అనుకున్నది చేయగలిగానని తెలిపాడు. కాగా గతంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన మోహిత్‌ శర్మ 2014 సీజన్‌లో పర్పుల్‌ క్యాప్‌ గెలిచాడు.

సీఎస్‌కే తరఫున 16 మ్యాచ్‌లలో 23 వికెట్లు పడగొట్టి ఆ ఏడాది అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. చెన్నైకి ప్రాతినిథ్యం వహిస్తూ తన ప్రతిభను నిరూపించుకున్న ఈ ఫాస్ట్‌బౌలర్‌ 2015 వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపికయ్యాడు కూడా!

పర్పుల్‌ క్యాప్‌ విన్నర్‌ నుంచి నెట్‌ బౌలర్‌గా
చివరిగా.. 2015లో టీమిండియాకు ఆడిన ఈ హర్యానా బౌలర్‌ ఐపీఎల్‌-2020 సీజన్‌ తర్వాత క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు కూడా దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో గతేడాది గుజరాత్‌ టైటాన్స్‌కు నెట్‌ బౌలర్‌గా ఉన్న మోహిత్‌ శర్మ.. ఆశిష్‌ నెహ్రా సూచన మేరకు దేశవాళీ క్రికెట్‌లో ఆటను కొనసాగించాడు.

ఘనంగా పునరాగమనం
ఈ క్రమంలో ఐపీఎల్‌-2023లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌తో గుజరాత్‌ తరఫున అరంగేట్రం చేస్తూ ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రాగానే తన సత్తా ఏమిటో మరోసారి నిరూపించుకున్నాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో మొత్తంగా నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసిన మోహిత్‌.. 18 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు పంజాబ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మ(25), ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రన్‌ (22)లను అవుట్‌ చేశాడు. తద్వారా పంజాబ్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. జట్టు విజయంలో తన వంతు సాయం అందించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

అప్పుడు ఆరున్నర కోట్లు.. ఇప్పుడు 50 లక్షలు
ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. తన రీఎంట్రీ, విజయం వెనుక ఆశిష్‌ నెహ్రా సహకారం ఉందంటూ కృతజ్ఞతా భావం చాటుకున్నాడు మోహిత్‌ శర్మ. కాగా 2016లో 6.5 కోట్ల రూపాయల(కింగ్స్‌ ఎలెవన్‌)కు అమ్ముడుపోయిన రైట్‌ఆర్మ్‌ మీడియం పేసర్‌ మోహిత్‌ను.. గుజరాత్‌ ఈ ఏడాది మినీ వేలంలో 50 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది.

స్టార్‌ బౌలర్‌గా భారీ ధర పలికిన మోహిత్‌.. నెట్‌ బౌలర్‌గా పనిచేసి ప్రస్తుతం 50 లక్షల ప్లేయర్‌గా మారడం గమనార్హం. ఏదేమైనా గుజరాత్‌ టైటాన్స్‌ రూపంలో వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే మోహిత్‌కు పూర్వ వైభవం వచ్చే దాఖలాలు లేకపోలేదు.

పంజాబ్‌ కింగ్స్‌ వర్సెస్‌ గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచ్‌ స్కోర్లు
టాస్‌: గుజరాత్‌- బౌలింగ్‌
పంజాబ్‌:  153/8 (20)
గుజరాత్‌:  154/4 (19.5)
విజేత: గుజరాత్‌ టైటాన్స్‌.. 6 వికెట్ల తేడాతో గెలుపు 

చదవండి: కేకేఆర్‌తో మ్యాచ్‌.. 13 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్‌! సన్‌రైజర్స్‌ తుది జట్టు ఇదే

Advertisement

తప్పక చదవండి

Advertisement