Having Him In WC Team Is Must; Ganguly Message To Dravid Fans Reacts - Sakshi
Sakshi News home page

WC 2023: యశస్విని కచ్చితంగా వరల్డ్‌కప్‌ టోర్నీలో ఆడించాలన్న గంగూలీ.. అదెలా కుదురుతుంది దాదా?

Published Wed, Jul 19 2023 7:09 PM

Having Him In WC Team Is Must Ganguly Message to Dravid Fans Reacts - Sakshi

ICC ODI World Cup 2023: వన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీకి ఇంకా రెండున్నర నెలలకుపైగా సమయం ఉంది. భారత్‌ వేదికగా అక్టోబరు 5 నుంచి ఈ మెగా ఈవెంట్‌ ఆరంభం కానుంది. ఆతిథ్య టీమిండియాతో పాటు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించగా.. క్వాలిఫయర్స్‌లో సత్తా చాటి శ్రీలంక, నెదర్లాండ్స్‌ కూడా టాప్‌-10లో అడుగుపెట్టాయి.

లంకతో పాటు డచ్‌ జట్టు
జింబాబ్వేలో జరిగిన క్వాలిఫయర్స్‌లో అద్భుత విజయాలు నమోదు చేసి ఐసీసీ మెగా టోర్నీ ఆడేందుకు అర్హత సాధించాయి. ఇదిలా ఉంటే.. టీమిండియా ఐసీసీ ట్రోఫీ సాధించి పదేళ్లు గడిచిపోయింది. మహేంద్ర సింగ్‌ ధోని సారథ్యంలో 2013లో చివరిసారి చాంపియన్స్‌ ట్రోఫీ రూపంలో భారత్‌ ఐసీసీ టైటిల్‌ సాధించింది.

భారీ అంచనాలు నెలకొన్న వేళ
ఆ తర్వాత వరుస ఈవెంట్లలో వైఫల్యం చెంది విమర్శలు మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో పుష్కరకాలం తర్వాత సొంతగడ్డపై వరల్డ్‌కప్‌ ఈవెంట్‌ జరుగనన్న తరుణంలో రోహిత్‌ సేనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రపంచకప్‌ జట్టు కూర్పుపై అభిమానులు సహా మాజీ ఆటగాళ్లు ఇప్పటికే చర్చ మొదలుపెట్టేశారు.

తొలి మ్యాచ్‌లోనే సెంచరీ ఎంతో ప్రత్యేకం
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వెస్టిండీస్‌తో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన యశస్వి జైశ్వాల్‌ను వరల్డ్‌కప్‌ జట్టులోకి తీసుకోవాలని దాదా మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. టెలిగ్రాఫ్‌తో ముచ్చటిస్తూ.. అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన యశస్విని కొనియాడాడు.

‘‘తొలి ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లోనే శతకం సాధించడం ఎల్లప్పుడూ ప్రత్యేకమే. ఆ అనుభూతి ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. ఎందుకంటే నా మొదటి మ్యాచ్‌లో నేను కూడా సెంచరీ కొట్టాను. యశస్వి టెక్నిక్‌ బాగుంది. 

అతడు ఉంటే ప్రయోజనకరం
జట్టులో ఎడమచేతి వాటం గల బ్యాటర్‌ ఉండటం ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి వన్డే వరల్డ్‌కప్‌ జట్టులో అతడకి కచ్చితంగా చోటివ్వాలి’’ అని గంగూలీ పేర్కొన్నాడు. కాగా విండీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన యశస్వికి వన్డేల్లో మాత్రం అవకాశం ఇవ్వలేదు సెలక్టర్లు. అంతేకాదు.. ఆసియా క్రీడలు-2023కి పంపే ద్వితీయశ్రేణి జట్టుకు ఎంపిక చేశారు.

అదెలా కుదురుతుంది దాదా?
సెప్టెంబరు 28 నుంచి ఆరంభం కానున్న ఈ టోర్నీలో ఆడే భారత జట్టులోని ఆటగాళ్లు అక్టోబరు 5న ప్రారంభమయ్యే ప్రపంచకప్‌ ఈవెంట్‌కు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ప్రధాన జట్టును పంపడం వీలుకాకపోవడంతోనే బీసీసీఐ ద్వితీయ శ్రేణి జట్టును చైనాకు పంపనుంది. ఈ నేపథ్యంలో యశస్వి వన్డే వరల్డ్‌కప్‌ జట్టులో భాగమయ్యే అవకాశం లేదని కొంతమంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఆసియా క్రీడలకు భారత పురుషుల జట్టు:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివం దూబే, ప్రభ్‌షిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్).
స్టాండ్‌బై ప్లేయర్లు: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్.

చదవండి: దీనస్థితిలో ధోని సొంత అన్న? బయోపిక్‌లో ఎందుకు లేడు? అయినా అతడితో..
రోహిత్‌ తిరిగి వచ్చేశాడు! యశస్వి జైశ్వాల్‌ తొలిసారి.. కోహ్లి మాత్రం

Advertisement
Advertisement