Andre Russell: 'ఆడమని ఎవరిని అడుక్కోం'.. విండీస్‌ కోచ్‌; రసెల్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

12 Aug, 2022 19:05 IST|Sakshi

వెస్టిండీస్‌ క్రికెటర్లు తమ దేశానికంటే బయటి దేశాలు నిర్వహించే లీగ్స్‌లోనే ఎక్కువగా కనబడుతుంటారు. కారణం డబ్బు. విండీస్‌కు ఆడితే వచ్చే డబ్బుతో పోలిస్తే.. ప్రైవేట్‌ లీగ్స్‌లో ఆ డబ్బు రెండింతల కంటే ఎక్కువుంటుంది. అందుకే క్రిస్‌ గేల్‌, డ్వేన్‌ బ్రావో, కీరన్‌ పొలార్డ్‌ , ఆండ్రీ రసెల్‌, సునీల్‌ నరైన్‌ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది. మొత్తంగా చెప్పాలంటే.. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న వివిధ క్రికెట్‌ లీగ్స్‌ అందరికంటే ఎక్కువగా కనబడేది కరేబియన్‌ క్రికెటర్లే.

మన ఐపీఎల్‌తోనూ వారికి విడదీయరాని బంధం ఉంది. డబ్బులు ఎక్కువొస్తాయంటే అవసరమైతే జాతీయ జట్టుకు ఆడే విషయాన్ని పక్కకుబెట్టడం విండీస్‌ ఆటగాళ్ల నైజం. అందుకే టి20 ఫార్మాట్‌లో రెండుసార్లు చాంపియన్‌ అయినప్పటికి ఆ జట్టులో ఎప్పుడు నిలకడ ఉండదు. ఈ మధ్య కాలంలో అది మరోసారి నిరూపితమైంది. ఇటీవలే భారత్‌తో జరిగిన టి20 సిరీస్‌లో 4-1 తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలోనే విండీస్‌ జట్టు కోచ్‌ ఫిల్‌ సిమ్మన్స్‌ రెండు రోజుల క్రితం దేశానికంటే విదేశీ లీగ్స్‌కే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్న కొందరు క్రికెటర్లపై వ్యంగ్యంగా స్పందించాడు. 

''వెస్టిండీస్ కోసం కాస్త ఆడండయ్యా అంటూ మేము ప్లేయర్లను అడుక్కోవాలని అనుకోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ ఆధారిత లీగ్‌లు ఆడుతున్న ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్‌ తదితర స్టార్లు.. జాతీయ జట్టుకు ముఖం చాటేస్తున్నారు. అక్టోబర్‌లో జరగబోయే టీ20 ప్రపంచ‌కప్‌ కోసం వెస్టిండీస్ జట్టులో అత్యుత్తమ ప్లేయర్లను బరిలోకి దించడానికి బోర్డు తీవ్రంగా కష్టపడుతున్నప్పటికీ.. చాలా మంది క్రికెటర్లు డబ్బు కోసం ఫ్రాంచైజీ లీగ్‌‌‌కే మొగ్గు చూపుతున్నారు.

ఇంకొంతమంది గాయాలతో జట్టుకు అందుబాటులో ఉండట్లేదంటూ అబద్దాలు చెబుతూ తప్పించుకుంటున్నారు. దీంతో మాకు వేరే మార్గం లేకుండా పోయింది.. ఈ విషయంలో ఎవరూ ఏమీ చేయలేరు. స్టార్ ప్లేయర్లు తన జాతీయ జట్టు కోసం ఆడాలని తాపత్రాయపడితే మార్పు వస్తుందని నమ్ముతున్నా. అందుకు తగ్గట్లు వాళ్లు కొన్ని లీగ్‌లను వదులుకుంటే తప్పితే మేము ఏం చేయలేని పరిస్థితి'' అని ఆవేదన వ్యక్తం చేశాడు.

తాజాగా విండీస​ కోచ్‌ ఫిల్‌ సిమ్మన్స్‌ చేసిన వ్యాఖ్యలపై విండీస్‌ సీనియర్‌ ప్లేయర్‌ ఆండ్రీ రసెల్‌ కాస్త ఘూటుగానే స్పందించాడు. ఫిల్‌ సిమ్మన్స్‌ ఆర్టికల్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. ''ఇలాంటిది వస్తుందని నాకు ముందే తెలుసు.. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సైలెంట్‌గా ఉండడమే ఉత్తమం..'' అంటూ క్యాప్షన్‌ జత చేసి కోపంతో ఉన్న ఎమోజీలను షేర్‌ చేశాడు. రసెల్‌ కామెంట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇక రసెల్‌ వెస్టిండీస్‌ తరపున 67 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఆఖరిసారిగా వెస్టిండీస్‌ తరపున టి20 ప్రపంచకప్‌ 2021లో పాల్గొన్నాడు. అయితే యూఏఈ వేదికగా జరిగిన ఆ ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ దారుణ ప్రదర్శన కనబరిచింది. రసెల్‌ మాత్రమే కాదు సునీల్‌ నరైన్‌ కూడా 2019 నుంచి జాతీయ జట్టుకు రెగ్యులర్‌గా అందుబాటులో ఉండడం లేదు. గాయాల సాకు చెప్పి డబ్బులు బాగా వచ్చే ఐపీఎల్‌, బిగ్‌బాష్‌ లీగ్‌, కరేబియన్‌ లీగ్‌ల్లో ఆడుతూ బిజీగా గడుపుతున్నారు.

A post shared by Andre Russell🇯🇲 Dre Russ.🏏 (@ar12russell)

చదవండి: MI Emirates: 'పొలార్డ్‌ నుంచి బౌల్ట్‌ దాకా'.. ఆరంభం కాకముందే టైటిల్‌పై కన్నేశారు

Dwayne Bravo: 600 వికెట్లతో ప్రపంచ రికార్డు.. టి20 క్రికెట్‌లో తొలి బౌలర్‌గా

మరిన్ని వార్తలు