Shubman Gill Has Potential To Become As Big As Virat Kohli And Tendulkar, Says Robin Uthap - Sakshi
Sakshi News home page

అతడొక అద్భుతం.. కచ్చితంగా సచిన్‌ అంతటివాడు అవుతాడు: ఉతప్ప

Published Thu, May 18 2023 12:39 PM

I see potential in Shubman Gill being as big as someone like kohli, sachin - Sakshi

ఐపీఎల్‌-2023లో దుమ్మురేపుతున్న గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌పై భారత మాజీ క్రికెటర్‌ రాబిన్‌ ఊతప్ప ప్రశంసల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో శుబ్‌మన్ గిల్ కచ్చితంగా కోహ్లి లేదా సచిన్ అంతటి వాడు అవుతాడని రాబిన్‌ కొనియాడాడు. కాగా గిల్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన గిల్‌.. 576 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా అహ్మదాబాద్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్ లో గిల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.  58 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు.

కాగా గిల్‌కు ఇదే తొలి ఐపీఎల్‌ సెంచరీ కావడం విశేషం. అయితే ఐపీఎల్‌లోనే కాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో అదరగొడుతున్నాడు. ఒక క్యాలెండర్‌ ఈయర్‌లో మూడు ఫార్మాట్‌లతో పాటు ఐపీఎల్‌లో సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడిగా గిల్‌ నిలిచాడు. ఈ ఏడాది గిల్‌ టెస్టు, వన్డే, టీ20ల్లో సెంచరీ సాధించాడు.

ఈ నేపథ్యంలో ఊతప్ప ఐపీఎల్‌ డిజిటల్‌ బ్రాడ్‌కాస్టర్‌ జియోసినిమాతో మాట్లాడుతూ.. "గిల్‌ అద్భుతమైన ఆటగాడు. అతడి బ్యాటింగ్‌ టెక్నిక్‌ చాలా బాగుంటుంది. విరాట్ కోహ్లి లేదా సచిన్ టెండూల్కర్ అంతటి గొప్ప ప్లేయర్ అవుతాడని నేను కచ్చితంగా నమ్ముతున్నాను. గిల్‌లో కోహ్లి, సచిన్‌కు ఉన్న సామర్థ్యం ఉంది.

అతడు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గిల్‌ ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడు" అని పేర్కొన్నాడు. అదే విధంగా మరో యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్ ను కూడా ఉతప్ప పొగడ్తలతో ముంచెత్తాడు. జైస్వాల్‌లో అద్బుతమైన టాలెంట్‌ ఉందని, భవిష్యత్తులో గిల్‌,  జైస్వాల్ భారత క్రికెట్‌కు చాలా కీలక ఆటగాళ్లగా మారుతారని రాబిన్‌ అభిప్రాయపడ్డాడు.

కాగా జైశ్వాల్‌ కూడా ఈ ఏడాది సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తొలి ఐపీఎల్‌ సెంచరీ కూడా సాధించాడు. రాజస్తాన్‌ విజయాల్లో జైస్వాల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన జైశ్వాల్‌.. 575 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
చదవండి: IPL: నీ వల్లే ద్రవిడ్‌కు ఎప్పుడూ లేనంత కోపం వచ్చింది! ఆరోజు నేను సిక్స్‌ కొట్టడం వల్లే...

Advertisement
Advertisement