ICC World Cup 2023: హమ్మయ్య.. టీమిండియాకు ఆ సమస్య తీరిపోయింది! వాళ్లిద్దరు ఉన్నారుగా!

19 Jul, 2022 15:08 IST|Sakshi
టీమిండియా(PC: BCCI)

ఎమిరేట్స్‌ ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మైదానం.. మాంచెస్టర్‌... ఇంగ్లండ్‌.. 2019 ప్రపంచకప్‌ టోర్నీ.. జూలై 9.. టీమిండియా- న్యూజిలాండ్‌ మధ్య సెమీ ఫైనల్‌ మ్యాచ్‌. టాస్‌ గెలిచిన కివీస్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. జస్‌ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ కేవలం ఒక్క పరుగే చేసి పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత మరో ఓపెనర్‌ కూడా 28 పరుగులు చేసి నిష్క్రమించాడు.

ఈ క్రమంలో కెప్టెన్‌ విలియమ్సన్‌ 76, రాస్‌ టేలర్‌ 74 పరుగులతో రాణించి న్యూజిలాండ్‌ మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో కివీస్‌ జట్టు 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. 

టీమిండియా బౌలర్లలో అత్యధికంగా భువనేశ్వర్‌ కుమార్‌కు మూడు వికెట్లు దక్కాయి. బుమ్రా, హార్దిక్‌, రవీంద్ర జడేజా, యజువేంద్ర చహల్‌ ఒక్కో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

టాపార్డర్‌ టపటపా..
ఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ సహా అప్పటి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కేవలం ఒక్కో పరుగు చేసి అవుటయ్యారు. టాపార్డర్‌ కకావికలం కావడంతో భారం మొత్తం మిడిలార్డర్‌పై పడింది.

ఈ క్రమంలో వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన పంత్‌ 32, దినేశ్‌ కార్తిక్‌ 6 పరుగులు చేశారు. హార్దిక్‌ పాండ్యా 32 పరుగులతో రాణించాడు. ఇక వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధోని అర్ధ శతకం, రవీంద్ర జడేజా 77 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అయినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో 18 పరుగుల తేడాతో కివీస్‌ చేతిలో ఓటమి పాలై టీమిండియా ప్రపంచకప్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఇప్పుడు ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లోనూ..
2022.. అదే ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మైదానం.. అదే నెల.. కాకపోతే తేదీ వేరు.. సందర్భం, ప్రత్యర్థి జట్టూ వేరు.. కానీ టాపార్డర్‌ వైఫల్యం మాత్రం రెండు మ్యాచ్‌లలోనూ ఒకేలా ఉండటం గమనార్హం. జూలై 17.. 2019 నాటి సెమీస్‌ జట్టులో భాగమైన రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా ఉండగా.. కోహ్లి, పంత్‌, పాండ్యా, జడేజా, చహల్‌ వంటి ప్లేయర్లు ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా మూడో వన్డే ఆడిన జట్టులో ఉన్నారు. 

ఇంగ్లండ్‌ విధించిన 260 పరుగుల లక్ష్య ఛేధనలో భాగంగా టాపార్డర్‌ గతంలో మాదిరిగానే మరోసారి తడబడింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 17, మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఒకటి, విరాట్‌ కోహ్లి 17 పరుగులకే పెవిలియన్‌ చేరారు.

చదవండి: India Vs West Indies 2022: విండీస్‌తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్‌.. షెడ్యూల్‌, జట్లు, పూర్తి వివరాలు!


రిషభ్‌ పంత్‌- హార్దిక్‌ పాండ్యా(PC: BCCI)

నేనున్నానంటూ పంత్‌.. జత కలిసిన పాండ్యా
సిరీస్‌ గెలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో క్లిష్ట పరిస్థితులు నెలకొన్న వేళ నేనున్నాంటూ రిషభ్‌ పంత్‌ అభయమిచ్చాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు 113 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 125 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచిన పంత్‌కు హార్దిక్‌ పాండ్యా తోడయ్యాడు.

ఆరోస్థానంలో బరిలోకి దిగిన అతడు 55 బంతుల్లో 71 పరుగులు చేశాడు. వీరిద్దరి వీర విహారంతో 5 వికెట్ల తేడాతో గెలిచిన రోహిత్‌ సేన వన్డే సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఈసారి మిడిలార్డర్‌ రాణించింది. 

గతంలో.. నిజానికి మెజారిటీ మ్యాచ్‌లలో టాపార్డర్‌ విజయవంతమైన ఇన్నింగ్స్‌ ఆడటంతో మిడిలార్డర్‌ను పెద్దగా పరీక్షించాల్సిన అవసరం రాలేదనే చెప్పొచ్చు. కానీ ప్రస్తుతం పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కీలక బ్యాటర్‌ కోహ్లి తరచుగా విఫలమవుతున్నాడు. రోహిత్‌ సైతం గత కొన్ని మ్యాచ్‌లలో తన ఇన్నింగ్స్‌ను భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు.

ప్రపంచకప్‌-2023.. ఆ సమస్య తీరినట్లే!
ఇదిలా ఉంటే.. పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్‌గా నియమితుడైన తర్వాత రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ప్రపంచకప్‌-2023 టోర్నీకి ముందే మిడిలార్డర్‌ను పటిష్టం చేసే అంశంపై దృష్టి సారిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌కు తోడు పంత్‌, హార్దిక్‌ పాండ్యా రాణించడం.. సూర్యకుమార్‌ కూడా మెరుగైన ఇన్నింగ్స్‌ ఆడుతున్న నేపథ్యంలో మిడిలార్డర్‌ సమస్య తీరినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

టెస్టు క్రికెట్‌లో ఒంటిచేత్తో గెలిపించగల సత్తా పంత్‌ సొంతం. ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మ్యాచ్‌తో వన్డేల్లో తొలి సెంచరీ నమోదు చేసిన ఈ యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ వన్డే ఫార్మాట్‌లోనూ మెరుగ్గా రాణించగలనని నిరూపించాడు. నాలుగో స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో పడ్డాడు.

ఇక రీఎంట్రీలో అదరగొడుతున్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఆరో స్థానానికి తానే సరైనోడినని నిరూపించుకుంటున్నాడు. ఇక కేఎల్‌ రాహుల్‌ వన్డే ఫార్మాట్‌లో మిడిలార్డర్‌లోనూ రాణించగలడు. ఒకవేళ అనువభవజ్ఞుడైన ధావన్‌ రోహిత్‌కు జోడీగా ఓపెనింగ్‌కు దిగితే.. రాహుల్‌ ఐదో స్థానంలో ఆడాల్సి ఉంటుంది.

ఇక రాహుల్‌ ఏదేని కారణాల వల్ల జట్టుకు దూరమైనా.. ఐదో స్థానం కోసం శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా పోటీపడే అవకాశం ఉంది. కాబట్టి పంత్‌, పాండ్యా నిలకడగా రాణిస్తే మిడిలార్డర్‌ సమస్య కొంతమేర తీరినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చదవండి: ICC WC: కోహ్లి కెప్టెన్సీలో గనుక నేను ఆడి ఉంటే.. ఇండియా 3 ప్రపంచకప్‌ టైటిళ్లు గెలిచేది!
 

మరిన్ని వార్తలు