రూ. 24.75 కోట్లు.. మరీ ఇంత చెత్త ప్రదర్శనా? | Iceland Cricket Brutal Dig At KKR Rs 24.75 Crore Buy Mitchell Starc Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2024: స్టార్క్‌ చెత్త గణాంకాలు.. బీర్‌ కంటే ఎక్కువ ధరే!

Published Sun, Mar 31 2024 2:49 PM

Iceland Cricket Brutal Dig At KKR Rs 24 75 Crore Buy Mitchell Starc Goes Viral - Sakshi

ఐపీఎల్‌-2024.. మినీ వేలంలో ఏకంగా రూ. 24.75 కోట్లకు అమ్ముడుపోయిన క్రికెటర్‌. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు. మరి ఆడిన రెండు మ్యాచ్‌లలో అతడి గణాంకాలు ఎలా ఉన్నాయి?!..

దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఐపీఎల్‌లో పునరాగమనం చేశాడు ఆస్ట్రేలియా స్టార్‌ మిచెల్‌ స్టార్క్‌. వన్డే వరల్డ్‌కప్‌-2023లో సత్తా చాటిన ఈ సీనియర్‌ పేసర్‌ కోసం వేలంలో ఫ్రాంఛైజీలన్నీ పోటీ పడితే.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది.

ఒక్క వికెట్‌ కూడా తీయలేదు
కానీ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో స్టార్క్‌ వల్ల జట్టుకు చేకూరిన ప్రయోజనం శూన్యం. ఐపీఎల్‌ పదిహేడో ఎడిషన్‌ లో కేకేఆర్‌ తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడిన విషయం తెలిసిందే. 

సొంతమైదానం ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ అదృష్టవశాత్తూ.. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. అందుకే స్టార్క్‌ పేలవ ప్రదర్శన పెద్దగా హైలైట్‌ కాలేదు.

చెత్త గణాంకాల వల్ల విమర్శలు
నిజానికి ఈ మ్యాచ్‌లో మిచెల్‌ స్టార్క్‌ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి ఏకంగా 53 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. 22 ఏళ్ల పేసర్‌ హర్షిత్‌ రాణా(4/33) విజయవంతమైన చోట ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌ పూర్తిగా తేలిపోయాడు.

తదుపరి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లోనూ చెత్త ప్రదర్శన పునరావృతం చేశాడు స్టార్క్‌. నాలుగ ఓవర్ల బౌలింగ్‌లో 47 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయాడు. ఫలితంగా.. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో కలిపి 8-0-100-0 గణాంకాలు నమోదు చేసి విమర్శలు మూటగట్టుకుంటున్నాడు.

కమిన్స్‌ మాత్రం మెరుగ్గానే
మరోవైపు.. రూ. 20.50 కోట్లకు అమ్ముడై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆసీస్‌ సారథి ప్యాట్‌ కమిన్స్‌ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. తొలి మ్యాచ్‌లో 1/32, మలి మ్యాచ్‌లో 2/35 గణాంకాలతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్‌గా ఓ మ్యాచ్‌లోనూ జట్టును గెలిపించాడు.

బీరు కంటే ఎక్కువే
ఇదిలా ఉంటే.. స్టార్క్‌ ప్రదర్శనను ఐస్‌ల్యాండ్‌ క్రికెట్‌ దారుణంగా ట్రోల్‌ చేసింది. ఐపీఎల్‌-2024లో ఇప్పటి వరకు స్టార్క్‌ బౌలింగ్‌ గణాంకాలు.. తమ దేశంలో బీర్‌ కంటే కూడా ఖరీదుగా ఉన్నాయని వ్యంగ్యస్త్రాలు సంధించింది. కాగా యూరోపియన్‌ దేశం ఐస్‌ల్యాండ్‌లో బీర్‌ ధరలు.. మిగతా దేశాలతో పోలిస్తే ఎక్కువగానే ఉంటాయనే ప్రచారం ఉంది.

చదవండి: మాటల్లేవ్‌.. ఇన్నాళ్లూ ఎక్కడ దాక్కున్నావు! స్మిత్‌కు వార్నింగ్‌ ఇచ్చేశా!

Advertisement
Advertisement