Yuvraj Singh Said MS Dhoni And Virat Kohli Both Supported Me A Lot When I Made Comeback - Sakshi
Sakshi News home page

Yuvraj Singh: కోహ్లి లేకుంటే అసలు జట్టులోకి వచ్చేవాడినే కాదు.. ధోని వాస్తవమేమిటో కళ్లకు కట్టాడు: యువీ

Published Sat, Jun 24 2023 4:42 PM

If He Not Backed Me Would Not Made Comeback Yuvraj on Kohli Dhoni Shows - Sakshi

Yuvraj Singh: టీమిండియా స్టార్‌ యువరాజ్‌ సింగ్‌ పలు చిరస్మరణీయ విజయాల్లో భాగమయ్యాడు. అండర్‌-19 వరల్డ్‌కప్‌ మొదలు ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్‌-2007, వన్డే వరల్డ్‌కప్‌-2011 టోర్నీల్లో భారత్‌ గెలుపులో తన వంతు పాత్ర పోషించాడు. 

ముఖ్యంగా 2007లో ఒకే ఓవర్లో యువీ ఆరు సిక్సర్లు బాదిన ఫీట్‌ను క్రికెట్‌ అభిమానులు అంత తేలికగా మర్చిపోలేరు. భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ ఈవెంట్‌లోనూ యువీ తన అద్భుత ఆట తీరుతో అభిమానులకు వినోదం పంచాడు.

అంతా సవ్యంగా సాగుతోందనుకున్న సమయంలో క్యాన్సర్‌ రూపంలో యువీ కెరీర్‌కు బ్రేక్‌ పడింది. మహమ్మారి బారిన పడినప్పటికీ ఆత్మవిశ్వాసం సడలనివ్వని యువరాజ్‌.. క్రమక్రమంగా కోలుకున్నాడు. అంతేకాదు 2017లో టీమిండియా తరఫున రీ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికి విరాట్‌ కోహ్లి కెప్టెన్‌గా ఉన్నాడు.

ఇదిలా ఉంటే.. 2019 వరల్డ్‌కప్‌లో ఆడాలని యువీ భావించినప్పటికీ సెలక్టర్లు అతడికి మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో అదే ఏడాది జూన్‌ 10న యువరాజ్‌ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాల గురించి గతంలో న్యూస్‌18 ఇంటర్వ్యూలో మాట్లాడిన యువీ పంచుకున్న ఆసక్తికర విషయాలను నెటిజన్లు తాజాగా తెరమీదకు తెచ్చారు. 

నాటి విషయాలు యువీ పంచుకుంటూ..
పునరాగమనంలో కోహ్లి తనకు పూర్తి మద్దతుగా నిలిచాడని.. అదే విధంగా మహేంద్ర సింగ్‌ ధోనితో తన అనుబంధం ఎలా ఉండేదో వివరించాడు. ఈ మేరకు.. ‘‘నేను తిరిగి జట్టులోకి వచ్చినపుడు విరాట్‌ కోహ్లి నాకు అండగా నిలబడ్డాడు. ఒకవేళ తన సహకారమే గనుక లేకుండా నేనసలు జట్టులోకి వచ్చేవాడినే కాదు.

అదే సమయంలో ధోని నాకు వాస్తవాలేమిటో కళ్లకు కట్టినట్లు చూపాడు. 2019 ప్రపంచకప్‌ జట్టు ఎంపిక సమయంలో సెలక్టర్లు నా పేరును పరిశీలించడం లేదన్న నిజాన్ని ధోని నాకు చెప్పాడు’’ అని యువరాజ్‌ సింగ్‌ పేర్కొన్నాడు.

నువ్వే నా ప్రధాన ప్లేయర్‌వి.. గుర్తుపెట్టుకో
2011 ప్రపంచకప్‌ టోర్నీ నాటి పరిస్థితుల గురించి చెబుతూ.. ‘‘ధోనికి నాపై నమ్మకం ఎక్కువ. ప్రతిసారి.. ‘‘నువ్వే నా ప్రధాన ప్లేయర్‌వి.. గుర్తుపెట్టుకో’’ అని చెప్పేవాడు. కానీ 2015 ప్రపంచకప్‌ నాటికి పరిస్థితులు మారిపోయాయి.

కానీ అప్పుడు మాత్రం
నేను ఎవరినీ వేలెత్తిచూపాలని అనుకోవడం లేదు. కెప్టెన్‌గా ఒక్కోసారి కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు. సారథిగా ఉన్నపుడు జట్టు ప్రదర్శన మొత్తానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతిసారి తమను తాము సమర్థించుకునే అవకాశం ఉండదు’’ అని యువీ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు.

కాగా ధోని వల్లే తన కుమారుడి కెరీర్‌ నాశనమైందంటూ యువీ తండ్రి యోగ్‌రాజ్‌ గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. తాను ధోని ఆటకు అభిమానినే అయినా.. తన కుమారుడి విషయంలో అతడు చేసిన పని ఆమోదయోగ్యనీయం కాదంటూ మండిపడ్డాడు.

చదవండి: ధోని నమ్మకం నిలబెట్టిన ప్రపంచకప్‌ విజేత, 2 సార్లు ఐపీఎల్‌ ‘విన్నర్‌’.. ఇప్పుడు పోలీస్‌
లెజండరీ ఓపెనర్‌ దిల్షాన్‌.. డీకే మాదిరే! ఉపుల్‌ తరంగతో భార్య ‘బంధం’.. అతడినే పెళ్లాడి!

Advertisement

తప్పక చదవండి

Advertisement