Ruturaj Gaikwad: అతడికి ఇప్పుడు 18, 19 కాదు.. 24.. 28 ఏళ్లకు ఆడిస్తారా? వన్డే జట్టులోకి తీసుకోండి!

13 Dec, 2021 14:03 IST|Sakshi
PC: BCCI

Dileep Vengsarkar Comments On Ruthuraj Gaikwad: రుతురాజ్‌ గైక్వాడ్‌.. ఈ పేరే ఒక సంచలనం.. ఐపీఎల్‌-2021లో అత్యధిక పరుగులు(635) సాధించి ఆరెంజ్‌ క్యాప్‌ దక్కించుకున్న ఈ యువ ఆటగాడు.. విజయ్‌ హజారే ట్రోఫీలోనూ అదరగొడుతున్నాడు. దేశవాళీ వన్డే టోర్నీలో ఇప్పటికే మూడు శతకాలు బాది సత్తా చాటాడు రుతురాజ్‌. మహారాష్ట్ర కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం దిలీప్‌ వెంగసర్కార్‌ రుతురాజ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో వన్డే సిరీస్‌కు రుతురాజ్‌ను ఎంపిక చేయాలని సూచించాడు.

ఈ మేరకు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో దిలీప్‌ వెంగసర్కార్‌ మాట్లాడుతూ... ‘‘మూడో స్థానంలో అతడు బ్యాటింగ్‌ చేయగలడు. తనను కచ్చితంగా జట్టులోకి తీసుకోవాలి. రుతురాజ్‌ వయసు పద్దెనిమిదో.. పందొమ్మిదో కాదు.. తనకు ఇప్పుడు 24 ఏళ్లు. ఇదే సరైన సమయం. ఒకవేళ 28 ఏళ్ల వయసులో అతడిని జట్టులోకి ఎంపిక చేసినా పెద్దగా ఫలితం ఉండబోదు కదా!’’ అని చెప్పుకొచ్చాడు. వయసు రీత్యా చూసినా, ఫామ్‌ పరంగా చూసినా రుతురాజ్‌ ఎంపికకు ఇదే సరైన సమయమని అభిప్రాయపడ్డాడు.

కాగా రుతురాజ్‌ గైక్వాడ్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో ఇప్పటి వరకు 4 ఇన్నింగ్స్‌లో 435 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ యువ ఓపెనర్‌ను ఐపీఎల్‌ మెగా వేలంలో నేపథ్యంలో ఆ జట్టు రిటైన్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక జూలైలో శ్రీలంక పర్యటన సందర్భంగా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో అరంగేట్రం చేసిన రుతురాజ్‌తాజా ప్రదర్శన దృష్ట్యా... వన్డేల్లోనూ ఆడించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. 

చదవండి: ODI Captaincy: కోహ్లి కెప్టెన్‌గా ఉంటే ఏంటి.. లేకపోతే ఏంటి?జరిగేది అదే: గంభీర్‌

మరిన్ని వార్తలు