‘ఫీల్డర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ మెడల్‌ కోహ్లిదే.. రోహిత్‌ రియాక్షన్‌ వైరల్‌ | Sakshi
Sakshi News home page

#Viratkohli: కోహ్లి ఆ రన్స్‌ సేవ్‌ చేయడం వల్లే ఇదంతా.. రోహిత్‌ రియాక్షన్‌ చూశారా?

Published Fri, Jan 19 2024 5:20 PM

Ind vs Afg: Kohli Best Fielder Award Dont Miss Rohit Reaction Video - Sakshi

టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి మేటి బ్యాటర్‌ మాత్రమే కాదు.. అద్భుతమైన ఫీల్డర్‌ కూడా! ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించిన ఈ రన్‌మెషీన్‌.. అఫ్గనిస్తాన్‌తో మూడో టీ20 సందర్భంగా.. మరోసారి అసాధారణ ఫీల్డింగ్‌ నైపుణ్యాలతో ఆకట్టుకున్నాడు.

బెంగళూరు వేదికగా నువ్వా-నేనా అన్నట్లుగా టీమిండియాతో సాగిన మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ అసాధారణ పోరాటం చేసిన విషయం తెలిసిందే. రెండు సూపర్‌ ఓవర్ల తర్వాత గానీ జద్రాన్‌ బృందం రోహిత్‌ సేన ముందు తలవంచలేదు. ఆద్యంతం అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఈ మ్యాచ్‌ నిజానికి సూపర్‌ ఓవర్‌ దాకా వచ్చేదే కాదు.

టీమిండియా విధించిన 213 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అఫ్గన్‌ ఇన్నింగ్స్‌ పదిహేడో ఓవర్లో కోహ్లి ఓ అద్భుతం చేశాడు. వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన బంతిని.. కరీం జనత్‌ లాంగాన్‌ దిశగా సిక్సర్‌గా మలిచేందుకు భారీ షాట్‌ ఆడాడు. అయితే.. అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లి గాల్లోకి ఎగిరి బంతిని ఒడిసిపట్టి.. బౌండరీ రోప్‌ దాటకుండా లోపలికి విసిరాడు.

అప్పటికి కరీం ఒక్క పరుగు మాత్రమే తీయగా.. కోహ్లి ఎఫర్ట్‌ వల్ల టీమిండియాకు ఐదు పరుగులు సేవ్‌ అయ్యాయి. అప్పటికి అఫ్గనిస్తాన్‌ స్కోరు 165-4. ఒకవేళ ఆ ఐదు పరుగులు వచ్చి అఫ్గన్‌కు వచ్చి ఉంటే మ్యాచ్‌ టై అయ్యేదీ కాదూ.. సూపర్‌ ఓవర్ల దాకా వచ్చేది కాదు! అలా కోహ్లి ప్రత్యర్థి జట్టును దెబ్బకొట్టాడన్న మాట!!

ఈ నేపథ్యంలో టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌ టి.దిలీప్‌ విరాట్‌ కోహ్లిపై ప్రశంసల జల్లు కురిపించాడు. యువ ఆటగాళ్లకు సవాల్‌ విసిరేలా.. మైదానంలో పాదరసంలా కదులుతున్న కోహ్లి.. అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడాడు. 

ఈ క్రమంలో ‘ఫీల్డర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు విజేతగా కోహ్లిని ప్రకటించిన దిలీప్‌.. అతడికి మెడల్‌ అందజేశాడు. ఆ సమయంలో  డ్రెస్సింగ్‌ రూంలో ఉన్న టీమిండియా క్రికెటర్లంతా చప్పట్లతో కోహ్లిని అభినందించారు. ముఖ్యంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అమితానందం వ్యక్తం చేస్తూ సహచర ఆటగాడి నైపుణ్యాలను మెచ్చుకున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ టీ20లలో రీఎంట్రీ ఇచ్చిన విరాట్‌ కోహ్లి.. వ్యక్తిగత కారణాలతో తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు.

రెండో టీ20లో 16 బంతుల్లో 29 పరుగులు చేసిన అతడు.. బుధవారం నాటి మూడో మ్యాచ్‌లో మాత్రం గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. అయితే, ఫీల్డర్‌గా మాత్రం సూపర్‌ సక్సెస్‌ అయి టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.

చదవండి: #IndvsAus2021: మళ్లీ గోల్డెన్‌ డక్‌.. రీఎంట్రీ మర్చిపోవ్సాలిందే?

Advertisement
Advertisement