IND Vs AUS 3rd ODI: అరుదైన క్లబ్‌లో చేరిన స్టీవ్‌ స్మిత్‌

27 Sep, 2023 15:51 IST|Sakshi

ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ అరుదైన క్లబ్‌లో చేరాడు. రాజ్‌కోట్‌ వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్‌ 27) జరుగుతున్న మూడో వన్డేలో 5000 పరుగుల మార్కును అందుకున్నాడు. తద్వారా ఆసీస్‌ తరఫున వన్డేల్లో ఈ మార్కును అందుకున్న 17వ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. కెరీర్‌లో 145 వన్డేలు ఆడిన స్మిత్‌.. 12 సెంచరీలు, 30 అర్ధసెంచరీల సాయంతో 5049 పరుగులు చేశాడు. ప్రస్తుతం స్మిత్‌ 70 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.

కాగా, వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ (463 మ్యాచ్‌ల్లో 18426 పరుగులు) పేరిట ఉంది. ఆసీస్‌ విషయానికొస్తే.. ఈ రికార్డు రికీ పాంటింగ్‌ సొంతం చేసుకున్నాడు. పాంటింగ్‌ 374 వన్డేల్లో 13589 పరుగులు చేశాడు. ఆసీస్‌ తరఫున వన్డేల్లో 10000 పరుగుల మార్కును దాటిన ఏకైక ఆటగాడు కూడా పాంటింగే కావడం విశేషం. 

ఇదిలా ఉంటే, టీమిండియాతో మూడో వన్డేలో ఆసీస్‌ ధాటిగా ఆడుతుంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌.. 31 ఓవర్ల తర్వాత 2 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. మిచెల్‌ మార్ష్‌ 4 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. డేవిడ్‌ వార్నర్‌ మెరుపు హాఫ్‌ సెంచరీ చేసి ఔటయ్యాడు. స్మిత్‌ (70), లబూషేన్‌ (13) క్రీజ్‌లో ఉన్నారు. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్‌ 2-0 తేడాతో ఇదివరకే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు