స్టార్క్‌ దెబ్బకు వణికిపోతున్న టీమిండియా.. మూడో వన్డేలోనైనా గెలుస్తారా..?

21 Mar, 2023 13:33 IST|Sakshi

39/4, 49/5.. ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేల్లో 10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్లు ఇవి. సొంతగడ్డపై కొదమసింహాల్లా రెచ్చిపోయే టీమిండియా టాపార్డర్‌ బ్యాటర్లు ప్రస్తుత వన్డే సిరీస్‌లో ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌ మిచెల్‌ స్టార్క్‌ పేస్‌ ధాటికి గజగజ వణికిపోతున్నారు. ఫలితంగా భారత్‌ పవర్‌ ప్లేల్లో చెత్త గణాంకాలు నమోదు చేసింది.

తొలి వన్డేలో కేఎల్‌ రాహుల్‌ (75 నాటౌట్‌), రవీంద్ర జడేజా (45 నాటౌట్‌) పుణ్యమా అని గట్టెక్కిన భారత్‌.. రెండో వన్డేలో పూర్తిగా చేతులెత్తేసింది. నిప్పులు చెరిగే వేగం, కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌, ఇరువైపుల బంతిని అద్భుతంగా స్వింగ్‌ చేసిన స్టార్క్‌ రెండో వన్డేలో భారత టాపార్డర్‌ బ్యాటర్ల భరతం పట్టాడు. స్టార్క్‌ ధాటికి టీమిండియా 117 పరుగులకే కుప్పకూలింది. 

ఇక్కడ ఓ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రెండు వన్డేల్లో స్టార్క్‌ ఇద్దరు భారత బ్యాటర్లను ఒకేలా ఔట్‌ చేశాడు. శుభ్‌మన్‌ గిల్‌ను ఆఫ్‌ స్టంప్‌ అవతల టెంప్టింగ్‌ డెలివరీ వేసి బట్టలో వేసుకున్న స్టార్క్‌.. సూర్యకుమార్‌ యాదవ్‌ను రెండు మ్యాచ్‌ల్లో ఒకేలా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

 బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో (టెస్ట్‌ సిరీస్‌) ఏమంత ప్రభావం చూపించని స్టార్క్‌.. వన్డే సిరీస్‌ ప్రారంభంకాగానే జూలు విదిల్చిన సింహంలా గర్జిస్తున్నాడు. తొలి వన్డేలో 3, రెండో వన్డేలో 5 వికెట్లు పడగొట్టిన స్టార్క్‌ దెబ్బకు భారత ఆటగాళ్లు క్రీజ్‌లోకి రావాలంటేనే భయపడిపోతున్నారు. ముఖ్యంగా కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో స్టార్క్‌ సంధిస్తున్న స్వింగింగ్‌ యార్కర్లను ఎదుర్కోవాలంటే భారత బ్యాటర్లకు ప్యాంట్‌ తడిసిపోతుంది. ఇలాంటి బంతులకు నిస్సహాయులుగా వికెట్‌ సమర్పించుకోవడం తప్ప భారత బ్యాటర్లు ఏమీ చేయలేకపోతున్నారు. ఇదే పరిస్థితి చెన్నై వేదికగా జరిగే ఆఖరి వన్డేలోనూ కొనసాగితే, టీమిండియా సిరీస్‌ కోల్పోవాల్సి ఉంటుంది. 

స్టార్క్‌ విషయంలో భారత ఆటగాళ్ల మైండ్‌సెట్‌ మారకపోతే.. చెన్నై వన్డేలో టీమిండియాకు ఘోర పరాభవం తప్పకపోవచ్చు. ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌ విషయంలో భారత బ్యాటర్లు, ముఖ్యంగా టాపార్డర్‌ ఆటగాళ్లు ప్రత్యేక ప్రణాళిక, ప్రాక్టీస్‌ లేకపోతే.. త్వరలో భారత్‌లోనే జరుగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో స్టార్క్‌ రూపంలో టీమిండియాకు పెను ప్రమాదం పొంచి ఉన్నట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉపఖండపు పిచ్‌లపై మహామహులైన ఫాస్ట్‌ బౌలర్లను ఎదుర్కొన్న భారత బ్యాటర్లకు స్టార్క్‌ పెద్ద విషయమేమి కాకపోయినప్పటికీ, నిర్లక్ష్యం చేస్తే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

ఇదిలా ఉంటే, ఆసీస్‌తో మూడో వన్డేలో ఎలాగైనా నెగ్గి సిరీస్‌ కైవసం చేసుకోవాలని టీమిండియా ఆటగాళ్లు పట్టుదలగా ఉన్నారు. రెండో వన్డేలో జరిగిన పొరపాట్ల విషయంలో అంతర్మధనం చేసుకున్న భారత ఆటగాళ్లు, ఆ తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని భావిస్తున్నారు. బ్యాటింగ్‌ విషయంలో, ముఖ్యంగా టాపార్డర్‌ వైఫల్యం విషయంలో టీమిండియా భారీ కసరత్తే చేస్తుంది. చెన్నై పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరించే అవకాశం ఉంది కాబట్టి, రెండో వన్డే ఆడిన జట్టునే భారత మేనేజ్‌మెంట్‌ యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు