జో రూట్‌ మాయాజాలం.. టీమిండియా ఒక్క పరుగు చేయకుండానే! | Sakshi
Sakshi News home page

Ind vs Eng: జో రూట్‌ మాయాజాలం.. టీమిండియా ఒక్క పరుగు చేయకుండానే..

Published Sat, Jan 27 2024 12:37 PM

Ind vs Eng 1st Test Day 3 Root Shines India Lost Final 3 wickets For No runs - Sakshi

India vs England, 1st Test Day 3: టీమిండియాతో తొలి టెస్టులో ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌ జో రూట్‌ బ్యాటింగ్‌లో విఫలమైనా.. బౌలింగ్‌లో అదరగొట్టాడు. ఈ రైటార్మ్‌ ఆఫ్‌ బ్రేక్‌ స్పిన్నర్‌ ఏకంగా నాలుగు వికెట్లు కూల్చి సత్తా చాటాడు.

భారత తొలి ఇన్నింగ్స్‌లో... ఇంగ్లండ్‌ రెగ్యులర్‌ బౌలర్లు ఒకటీ రెండు వికెట్లకే పరిమితమైన వేళ రూట్‌ టాప్‌ వికెట్‌ టేకర్‌గా నిలవడం విశేషం. హైదరాబాద్‌ వేదికగా గురువారం మొదలైన టెస్టులో ఇంగ్లండ్‌ 246 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ ముగించింది.

ఈ క్రమంలో తొలి రోజే బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. శనివారం నాటి మూడో రోజు ఆటను 421/7తో మొదలుపెట్టి 436 పరుగుల వద్ద ఆలౌట్‌ అయింది. అయితే, శనివారం టీమిండియా కోల్పోయిన మూడు వికెట్లలో రెండు వికెట్లు రూట్‌ తీసినవే. అవి కూడా ఒకే ఓవర్లో వరుస బంతుల్లో తీయడం విశేషం.

119.3 ఓవర్లో రవీంద్ర జడేజా(87)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న రూట్‌.. అతడిని ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. ఈ క్రమంలో జడ్డూ స్థానంలో ఎంట్రీ ఇచ్చిన జస్‌ప్రీత్‌ బుమ్రా(0)ను అద్భుత రీతిలో క్లీన్‌ బౌల్డ్‌ చేసి పెవిలియన్‌కు చేర్చాడు. 

ఒక్క పరుగు చేయకుండానే ఆఖరి మూడు వికెట్లు డౌన్‌
ఆ తర్వాతి రెండో ఓవర్‌కే రెహాన్‌ అహ్మద్‌ అక్షర్‌ పటేల్‌(44)ను అవుట్‌ చేయడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. రూట్‌, రెహాన్‌ దెబ్బకు టీమిండియా తమ స్కోరుకు ఒక్క పరుగు కూడా జత చేయకుండానే ఆఖరి మూడు వికెట్లు కోల్పోవడం విశేషం.

ఇదిలా ఉంటే.. రెండో రోజు ఆటలో భాగంగా జో రూట్‌ యశస్వి జైస్వాల్‌(80) రూపంలో బిగ్‌ వికెట్‌ పడగొట్టడం విశేషం. అదే విధంగా శ్రీకర్‌ భరత్‌(41)ను కూడా ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన టీమిండియా ఓవరాల్‌గా 190 పరుగుల ఆధిక్యంలో నిలవగా.. రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ కొనసాగిస్తోంది.

దెబ్బకు దెబ్బ
రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌లో రూట్‌(2) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. 21 ఓవర్లలో ఇంగ్లండ్‌ స్కోరు: 117-3

చదవండి: Rohit Sharma: ఎన్ని సెంచరీలు చేస్తే ఏం లాభం?.. అదొక్కటి తప్ప అన్నీ గెలిచాం

Advertisement
Advertisement