Ind vs Eng: బుమ్రా విషయంలో ఫోక్స్‌ చేసిందేమిటి? ఇదేనా మీ ‘క్రీడా స్ఫూర్తి’?

30 Jan, 2024 13:22 IST|Sakshi

India vs England, 1st Test: టీమిండియాతో తొలి టెస్టు సందర్భంగా ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ వ్యవహరించిన తీరు నెట్టింట చర్చకు దారితీసింది. హైదరాబాద్‌లో నువ్వా- నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో ఫోక్స్‌ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడంటూ టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు.

ఒకవేళ ఫోక్స్‌ చేసిన పనే గనుక భారత వికెట్‌ కీపర్‌ చేసి ఉంటే ఇంగ్లండ్‌ మీడియా గగ్గోలు పెట్టేదంటూ వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది?.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఉప్పల్‌ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్‌ మొదటి టెస్టులో తలపడ్డ విషయం తెలిసిందే. తొలి రెండు రోజులు రోహిత్‌ సేన ఆధిపత్యం కనబరచగా.. ఆ తర్వాత స్టోక్స్‌ బృందం పైచేయి సాధించింది.

చివరికి 28 పరుగుల తేడాతో ఎట్టకేలకు విజయం అందుకుని 1-0తో ముందడుగు వేసింది. ఇదిలా ఉంటే.. ఈ టెస్టు నాలుగో రోజు ఆటలో భాగంగా.. ఇంగ్లండ్‌ విధించిన 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు టీమిండియా బరిలోకి దిగింది.

బుమ్రా విషయంలో ఫోక్స్‌ చేసిందేమిటి?
ఈ క్రమంలో.. రెండో ఇన్నింగ్స్‌లో 66వ ఓవర్‌ సమయానికి టీమిండియా కేవలం 189 పరుగులు మాత్రమే చేసి తొమ్మిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. అలాంటి సమయంలో ఓవర్‌ ఐదో బంతికి స్పిన్నర్‌ టామ్‌ హార్లీ బౌలింగ్‌లో భారత టెయిలెండర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.

ఆ కోపం, చిరాకులో క్రీజులోపలే మళ్లీ షాట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నట్లుగా కనిపించిన బుమ్రా గాల్లోకి ఎగిరాడు. అయితే, అంతలోనే బంతిని అందుకున్న వికెట్‌ కీపర్‌ ఫోక్స్‌ బెయిల్స్‌ను పడగొట్టి స్టంపౌట్‌కు అప్పీలు చేశాడు. కానీ.. అప్పటికే బుమ్రా తన పాదాన్ని నేలమీద పెట్టడంతో అప్పటికి ప్రమాదం తప్పింది. 

క్యారీ- బెయిర్‌ స్టో వివాదం గుర్తుచేస్తూ
ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో యాషెస్‌ టెస్టులో ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ.. జానీ బెయిర్‌ స్టోను ఇంచుమించు ఇదే తరహాలో అవుట్‌ చేసినపుడు ఇంగ్లండ్‌ మీడియా చేసిన రచ్చను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.

నాడు నిబంధనలకు అనుగుణంగానే క్యారీ వ్యవహరించినా.. క్రీడా స్ఫూర్తిని మరిచాడంటూ దుమ్మెత్తిపోసిన మీడియాకు ఫోక్స్‌ చేసిన పని కనబడటం లేదా అని ప్రశ్నిస్తున్నారు. మ్యాచ్‌ ముగిసి రెండు రోజు కావొస్తున్నా ఈ విషయం మీద చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇంగ్లండ్‌ టీమిండియాపై ఇలా గెలవాలని భావించిందా అంటూ సొంత అభిమానులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య ఫిబ్రవరి 2 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది. ఇందుకు విశాఖపట్నంలోని వైఎస్సార్‌ స్టేడియం వేదిక కానుంది. ఇక ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ గాయాల కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. సర్ఫరాజ్‌ ఖాన్‌, సౌరభ్‌ కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌ జట్టులోకి వచ్చారు.

చదవండి: Ind vs Eng: ఆఖరి 3 టెస్టులకు జట్టు ఎంపిక?.. కోహ్లి రీఎంట్రీ డౌటే!?

whatsapp channel

మరిన్ని వార్తలు