IND VS ENG 2nd Test: బెన్‌ స్టోక్స్‌ అసహనం.. టెక్నాలజీది తప్పంటూ..! | India Vs England 2nd Test: England Captain Ben Stokes Said Technology Got Zak Crawley's LBW Dismissal Wrong - Sakshi
Sakshi News home page

IND VS ENG 2nd Test: బెన్‌ స్టోక్స్‌ అసహనం.. టెక్నాలజీది తప్పంటూ..!

Published Mon, Feb 5 2024 7:11 PM

IND VS ENG 2nd Test: Technology Wrong On This Occasion, Stokes On Crawley LBW - Sakshi

విశాఖ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ 106 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. తొలి టెస్ట్‌లో అన్ని విభాగాల్లో రాణించి టీమిండియాను ఓడించిన ఇంగ్లండ్‌.. ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమై ఓటమిపాలైంది. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు తేలిపోయిన వేల  బుమ్రా (9/91), యశస్వి జైస్వాల్‌ (209), శుభ్‌మన్‌ గిల్‌ (104) అద్భుత ప్రదర్శనలతో సత్తా చాటి టీమిండియాకు అపురూప విజయాన్ని అందించారు. ముఖ్యంగా బుమ్రా స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌పై చెలరేగి ఇంగ్లండ్‌ ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. 

మ్యాచ్‌ అనంతరం ప్రజెంటేషన్‌ సెర్మనీ సందర్భంగా ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ తమ వైఫల్యాలను అంగీకరించినప్పటికీ, ఓ విషయంలో మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. సహచర ఆటగాడు జాక్‌ క్రాలే ఎల్బీడబ్ల్యూ విషయంలో సాంకేతికతను తప్పుబడుతూ తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. గేమ్‌లో సాంకేతికత స్పష్టంగా ఉంది. ఇది ఎప్పటికీ 100 శాతం కాకూడదనే  అంపైర్ కాల్ అనే ఆప్షన్‌ను ఉంచారు. ఇలాంటి సందర్భంలో పూర్తిగా సాంకేతికతపై ఆధారపడి థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్‌ కాదన్నది నా వ్యక్తిగత అభిప్రాయమని స్టోక్స్‌ అన్నాడు. 

ఇంతకీ ఏం జరిగిందంటే.. జాక్‌ క్రాలే (73) మాంచి జోరుమీదున్న సమయంలో కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో సందేహాస్పదంగా ఉన్న డీఆర్‌ఎస్‌ అప్పీల్‌ను థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. ఫీల్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించినా, సందర్భం సందేహాస్పదంగా ఉన్నా థర్డ్‌ అంపైర్‌ క్రాలేను ఔట్‌గా ప్రకటించడంతో వివాదం మొదలైంది. వాస్తవానికి ఇలాంటి సందర్భంలో థర్డ్‌ అంపైర్‌ అంపైర్స్‌ కాల్‌తో వెళ్తారు.

కానీ ఈ సందర్భంలో థర్డ్‌ అంపైర్‌ అలా చేయకుండా సాంకేతికత ఆధారంగా క్రాలేను ఔట్‌గా ప్రకటించాడు. రీప్లేలో బంతి లెగ్‌ సైడ్‌ వెళ్తున్నట్లు అనిపించినా, చివరకు లెగ్‌ స్టంప్‌కు తగులుతున్నట్లు డీఆర్‌ఎస్‌ చూపించింది. ఈ సాంకేతికత ఆధారంగానే థర్డ్‌ అంపైర్‌ క్రాలేను ఔట్‌గా ప్రకటించాడు. థర్డ్‌ అంపైర్‌ నిర్ణయంతో క్రాలే సహా ఇంగ్లీష్‌ బృందం మొత్తం ఆశ్యర్యం వ్యక్తం చేసింది. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్న ఇంగ్లండ్‌ కోచ్‌ బ్రెండన్ మెక్‌కల్లమ్ సైతం థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. 

Advertisement
Advertisement