Ind vs Eng: దెబ్బకు దెబ్బ.. మాతో పెట్టుకుంటే..! | Sakshi
Sakshi News home page

Ind vs Eng: దెబ్బకు దెబ్బ.. ఘాటుగానే బదులిచ్చాడు! ఫొటో వైరల్‌

Published Mon, Feb 5 2024 4:58 PM

Ind vs Eng Iyer Payback To Lazy Ben Stokes After Stunning Run Out Dismissal Viral - Sakshi

Ind vs Eng 2nd Test: పటిష్ట జట్ల మధ్య పోటీ అంటే క్రికెట్‌ అభిమానులకు ఎల్లప్పుడూ ఆసక్తే! ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా తదితర జట్లతో స్వదేశంలో అయినా.. విదేశంలో అయినా ఫార్మాట్‌తో సంబంధం లేకుండా టీమిండియా మ్యాచ్‌ అంటే టీవీలకు అతుక్కుపోతారు వీరాభిమానులు.

ప్రేక్షకుల పరిస్థితి ఇలా ఉంటే.. మైదానంలో ఆటగాళ్లు కూడా పోటీ తీవ్రమవుతున్న కొద్దీ ఒత్తిడికి లోనవడం ఎంత సహజమో.. కీలక సమయంలో ప్రత్యర్థిని దెబ్బకు దెబ్బ తీస్తే సంబరాలు చేసుకోవడం కూడా అంతే సహజం.

ముఖ్యంగా తమను ట్రోల్‌ చేసేలా వ్యవహరించిన ప్రత్యర్థి ప్లేయర్‌కు కౌంటర్‌ ఇచ్చే అవకాశం వస్తే అస్సలు చేజార్చుకోరు. టీమిండియా ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌.. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ విషయంలో అదే పని చేశాడు.

వైజాగ్‌లో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో.. మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌.. టామ్‌ హార్లీ బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ను స్టోక్స్‌ పట్టుకున్నాడు. దీంతో మూడో రోజు ఆట(ఆదివారం)లో 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అయ్యర్‌ పెవిలియన్‌కు చేరాడు.

ఈ క్రమంలో స్టోక్స్‌ అయ్యర్‌కు సెండాఫ్‌ ఇస్తూ ఓవర్‌గా సెలబ్రేట్‌ చేసుకున్న తీరు అతడికి కోపం తెప్పించింది. అయితే, అందుకు బదులు తీర్చుకునే అవకాశం అయ్యర్‌కు నాలుగో రోజు ఆట సందర్భంగా వచ్చింది.

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 52.4వ ఓవర్‌ వద్ద అశ్విన్‌ బౌలింగ్‌లో బెన్‌ ఫోక్స్‌ సింగిల్‌ తీశాడు. అయితే, మరో ఎండ్‌లో ఉన్న బెన్‌ స్టోక్స్‌ పరుగు తీయడంలో బద్దకం ప్రదర్శించాడు. ఈ క్రమంలో బంతిని అందుకున్న అయ్యర్‌ వికెట్లకు డైరెక్ట్‌గా త్రో చేయగా.. స్టోక్స్‌ రనౌట్‌ అయ్యాడు.

దీంతో శ్రేయస్‌ అయ్యర్‌ సైతం.. స్టోక్స్‌ తన క్యాచ్‌ అందుకున్నపుడు ఎలా సెలబ్రేట్‌ చేసుకున్నాడో అదే తరహాలో వేలు చూపిస్తూ.. ‘‘తిరిగి చెల్లించేశాను’’ అన్నట్లు సైగ చేశాడు. వీరిద్దరి ఫొటోలను కలిపి షేర్‌ చేస్తున్న టీమిండియా అభిమానులు.. ‘‘మా వాళ్లతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది. ఏదీ దాచుకోరు. తిరిగి ఇచ్చేస్తారు’’ అంటూ ఇంగ్లండ్‌ ప్లేయర్లపై సెటైర్లు వేస్తున్నారు.

చదవండి: IND VS ENG 2nd Test: అతనో ఛాంపియన్‌ ప్లేయర్‌.. కుర్రాళ్లు అద్భుతం: రోహిత్‌ 

ఇక వైజాగ్‌ టెస్టులో భారత జట్టు 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా హైదరాబాద్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుని సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 15 నుంచి మూడో టెస్టు ఆరంభం కానుంది.

Advertisement
Advertisement