ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌.. ఇంపాక్ట్‌ ఫీల్డర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు ఎవరికంటే..? | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌.. ఇంపాక్ట్‌ ఫీల్డర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు ఎవరికంటే..?

Published Sun, Mar 10 2024 6:00 PM

IND VS ENG: Rohit And Gill Received The Impact Fielder Of The Series Medal From Jay Shah - Sakshi

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌ కోల్పోయిన టీమిండియా.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి, సిరీస్‌ కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి, పటిష్టమైన ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది.

విరాట్‌ కోహ్లి, మొహమ్మద్‌ షమీ లాంటి సీనియర్లు ఈ సిరీస్‌కు దూరమైనప్పటికీ వారి స్థానాలకు భర్తీ చేస్తూ యువ ఆటగాళ్లు దుమ్మురేపారు. ఈ సిరీస్‌లో టీమిండియా కుర్ర బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, దృవ్‌ జురెల్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌ లాంటి అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని జట్టులో సీనియర్ల స్థానాన్ని ప్రశ్నార్దకంగా మార్చారు.

బౌలింగ్‌ విషయానికొస్తే.. సీనియర్లు అశ్విన్‌, రవీంద్ర జడేజాలకు ఈ సిరీస్‌ చిరకాలం గుర్తుండిపోతుంది. కుల్దీప్‌, బుమ్రా అవకాశం వచ్చిన ప్రతిసారి తమ సత్తా నిరూపించుకున్నారు. దృవ్‌ జురెల్‌ బ్యాటర్‌గానే కాకుండా వికెట్‌కీపర్‌గానూ రాణించి పంత్‌ స్థానానికి ఎసరుపెట్టేలా కనిపిస్తున్నాడు. ఈ సిరీస్‌ మొత్తంలో ఒక్క రజత్‌ పాటిదార్‌ మినహాయించి టీమిండియాకు అన్ని శుభాలే జరిగాయి.

పాటిదార్‌ ఒక్కడే మూడు మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆకాశ్‌దీప్‌ సైతం లభించిన అవకాశాన్ని చక్కగా ఒడిసిపట్టుకున్నాడు. ఆకాశ్‌ నాలుగో టెస్ట్‌లో రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనే కాకుండా ఈ సిరీస్‌ ఆధ్యాంతం టీమిండియా ఆటగాళ్లు ఫీల్డింగ్‌లోనూ మెరుగ్గా రాణించారు. భారత ఆటగాళ్లు దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో మైదానంలో పాదరసంలా కదిలారు.

అద్భుతంగా ఫీల్డింగ్‌ చేసి పరుగులు నియంత్రించడంతో పాటు కొన్ని కళ్లు చెదిరే క్యాచ్‌లు పట్టారు. సిరీస్‌ మొత్తంలో ఫీల్డింగ్‌లో సత్తా చాటిన రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌లకు ఇంపాక్ట్‌ ఫీల్డర్స్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు దక్కింది. ఫీల్డింగ్‌కు సంబంధించి కుల్దీప్‌ యాదవ్‌కు ప్రత్యేక అవార్డు లభించింది. గతకొంతకాలంగా మైదానంలో రాణించే వారిని ఇంపాక్ట్‌ ఫీల్డర్‌ అవార్డుతో సత్కరిస్తున్న విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే, ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. అంతకుముందు జరిగిన రాంచీ టెస్ట్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. హైదారాబాద్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ చేతిలో 28 పరుగుల తేడాతో ఓటమిపాలైన భారత్‌.. ఆతర్వాత రెండో టెస్ట్‌లో 106 పరుగుల తేడాతో, మూడో టెస్ట్‌లో 434 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

సిరీస్‌ ఆధ్యాంతం పరుగుల వరద పారించిన యశస్వి జైస్వాల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు లభించింది. ఈ సిరీస్‌లో జైస్వాల్‌ 9 ఇన్నింగ్స్‌ల్లో 2 డబుల్‌ సెంచరీలు, 3 అర్దసెంచరీల సాయంతో 712 పరుగులు చేసి సిరీస్‌ లీడింగ్‌ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.

Advertisement
Advertisement