Ind Vs NZ 1st ODI: Shikhar Dhawan Reveals Reason Behind 7 Wicket Loss - Sakshi
Sakshi News home page

Shikhar Dhawan: ఆ ఓవర్‌ మా కొంప ముంచింది.. ఓటమికి ప్రధాన కారణం అదే! నిజానికి అప్పుడే..

Published Fri, Nov 25 2022 4:55 PM

Ind vs NZ Shikhar Dhawan: That Where Momentum Shifted On Loss - Sakshi

New Zealand vs India, 1st ODI- Shikhar Dhawan Comments On Loss: న్యూజిలాండ్‌తో మొదటి వన్డేలో మెరుగైన స్కోరు చేసినప్పటికీ పరాజయం తప్పలేదని టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ విచారం వ్యక్తం చేశాడు. బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో తాము ఇంకా మెరుగుపడాల్సి ఉందని పేర్కొన్నాడు. కాగా ఆక్లాండ్‌ వేదికగా శుక్రవారం నాటి వన్డేలో భారత జట్టు కివీస్‌ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ సహా మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌, వన్‌డౌన్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అర్ధ శతకాలతో మెరిసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ముగ్గురూ అద్బుతంగా రాణించడంతో 306 పరుగులు స్కోరు చేసిన టీమిండియా.. బౌలర్ల వైఫల్యం కారణంగా ఆతిథ్య జట్టు ముందు తలవంచకతప్పలేదు.

స్పష్టంగా కనిపించిన వైఫల్యం
బ్యాట్‌తో మెరిసిన వాషింగ్టన్‌ సుందర్‌(42 పరుగులు- ఎకానమీ 4.20) మినహా మిగతా బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ప్రపంచకప్‌-2022లో రాణించిన అర్ష్‌దీప్‌ సింగ్‌ 8.1 ఓవర్లలో 68, ఉమ్రాన్‌ మాలిక్‌ 10 ఓవర్లలో 66, యజువేంద్ర చహల్‌ 10 ఓవర్లలో 67 పరుగులు ఇవ్వగా.. శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన 40వ ఓవర్‌ మ్యాచ్‌ను కివీస్‌కు అనుకూలంగా మార్చివేసింది.

ఆ ఓవర్లోనే అంతా తలకిందులు
ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం ధావన్‌ మాట్లాడుతూ ఓటమికి గల కారణాలు వెల్లడించాడు. ‘‘మొదటి 10- 15 ఓవర్లు కాస్త కష్టంగా తోచింది. అయితే, పిచ్‌ను అంచనా వేసి మా వ్యూహాలు అమలు చేసి మెరుగైన స్కోరు నమోదు చేశాం. 

కానీ, ఈ రోజు మేము సరిగ్గా బౌలింగ్‌ చేయలేకపోయాం. ముఖ్యంగా గుడ్‌ లెంత్‌తో బౌలింగ్‌ చేయడంలో మా వాళ్లు విఫలమయ్యారు. ఆ బలహీనతను లాథమ్‌ సరిగ్గా వాడుకున్నాడు. నిజానికి 40 ఓవర్లోనే మ్యాచ్‌ మా చేజారి... కివీస్‌కు అనుకూలంగా మారింది.

ఒకవేళ గెలిచి ఉంటే మేము సంతోషించేవాళ్లం. కానీ ఆటలో ఇవన్నీ సహజమే. జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. వారికి ఇదొక పాఠం లాంటిది. బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో ఆట తీరు మెరుగుపరచుకుని.. తదుపరి మ్యాచ్‌లో మా వ్యూహాలు మరింత పక్కాగా అమలు చేస్తాం’’ అని గబ్బర్‌ చెప్పుకొచ్చాడు. 

అద్భుత, అజేయ శతకం
కివీస్‌ ఇన్నింగ్స్‌లో 40వ ఓవర్‌ వేసిన శార్దూల్‌ బౌలింగ్‌లో.. న్యూజిలాండ్‌ బ్యాటర్‌ టామ్‌ లాథమ్‌.. భారీగా పరుగులు రాబట్టాడు. మొదటి బంతిని సిక్స్‌గా మలిచిన అతడు.. ఆ తర్వాత వరుసగా నాలుగు ఫోర్లు బాదాడు. ఇక ఓవర్‌లో వైడ్‌ల రూపంలో రెండు పరుగులు రాగా.. ఆఖరి బంతికి ఒక పరుగు తీసి శతకం పూర్తి చేసుకున్నాడు. 

ఈ ఓవర్లో మొత్తంగా కివీస్‌కు 25 పరుగులు వచ్చాయి. ఇక మొత్తంగా ఈ మ్యాచ్‌లో 145 పరుగులతో అజేయంగా నిలిచి న్యూజిలాండ్‌ను గెలిపించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. మరోవైపు శార్దూల్‌.. 9 ఓవర్లలో 63 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విజయంతో విలియమ్సన్‌ బృందం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

చదవండి: IND VS NZ 1st ODI: టీమిండియా చెత్త రికార్డు.. చరిత్రలో తొలిసారి ఇలా..!
FIFA WC: బ్రెజిల్‌ను గెలిపించినోడు.. పొట్టకూటి కోసం ఐస్‌క్రీంలు అమ్మి

Advertisement
Advertisement