Sakshi News home page

Ind Vs Sa 1st Test: మూడోరోజు ముగిసిన ఆట.. 146 పరుగుల ఆధిక్యంలో టీమిండియా

Published Tue, Dec 28 2021 2:12 PM

Ind Vs Sa 1st Centurion Test: Day 3 Updates And Highlights In Telugu - Sakshi

Ind Vs Sa 1st Centurion Test Day 3 Live Updates

టీమిండియా, సౌతాఫ్రికాల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడోరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 16 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 5, శార్దూల్‌ ఠాకూర్‌ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ కలుపుకొని 146 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌట్‌ అయింది. కాగా మూడోరోజు ఆటలో తొలి సెషన్‌లో సౌతాఫ్రికా ఆధిపత్యం చూపించగా.. మిగిలిన రెండు సెషన్లలో టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. నాలుగో రోజు ఆటలో టీమిండియా తొలి రెండు సెషన్ల పాటు ఆడి భారీ స్కోరు చేస్తే సౌతాఫ్రికా ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టమే.

20:56 PM: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో టీమిండియాకు 130 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. టీమిండియా బౌలర్ల కట్టుదిట్టమైన బంతులకు సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్‌ పరుగులు తీయడంలో ఇబ్బందులు పడ్డారు. ప్రొటీస్‌ బ్యాటింగ్‌లో టెంబా బవుమా 52 పరుగులు చేయగా.. క్వింటన్‌ డికాక్‌ 34 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో మహ్మద్‌ షమీ 5 వికెట్లతో దుమ్మురేపగా.. బుమ్రా, శార్దూల్‌ చెరో రెండు, సిరాజ్‌ ఒక వికెట్‌ తీశారు. 

7:31 PM : తొలి టెస్టులో టీమిండియా చెలరేగుతుండడంతో సౌతాఫ్రికా బ్యాటర్స్‌ పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. తాజాగా 12 పరుగులు చేసిన ముల్డర్‌ షమీ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో దక్షిణాఫ్రికా ఆరో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం 44 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. టెంబా బవుమా 48 పరుగులతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 

6:35 PM : శార్ధూల్‌ ఠాకూర్‌ అద్బుత బౌలింగ్‌తో దక్షిణాఫ్రికా ఐదో వికెట్‌ కోల్పోయింది. ఇన్నింగ్స్‌ 34వ ఓవర్‌ తొలి బంతికి డికాక్‌ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 37 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. బవుమా 31, ముల్డర్‌ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

4: 47 PM: భారత బౌలర్లు దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపిస్తున్నారు. వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతున్నారు. దీంతో 32 పరుగులకే ప్రొటిస్‌ నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం తెంబా బవుమా, క్వింటన్‌ డికాక్‌ క్రీజులో ఉన్నారు. బుమ్రా ఒకటి, షమీ రెండు, సిరాజ్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.

4: 22PM- మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో ప్రొటిస్‌ బ్యాటర్‌ కీగన్‌ పీటర్సన్‌ అవుటయ్యాడు. దీంతో 30 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా రెండో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం మార్కరమ్‌, రసే వాన్‌ డెర్‌ డసెన్‌ క్రీజులో ఉన్నారు.

4: 22PM: రెండో వికెట్‌ కోల్పోయిన దక్షిణాఫ్రికా

3: 50 PM: లంచ్‌ బ్రేక్‌ సమయానికి ప్రొటిస్‌ జట్టు స్కోరు: 21/1 (7). పీటర్సన్‌(11), మార్కరమ్‌(9) క్రీజులో ఉన్నారు.

3: 10 PM: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా మొదటి వికెట్‌ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో ప్రొటిస్‌ కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. ఎయిడెన్‌ మార్కరమ్‌, కీగన్‌ పీటర్సన్‌ క్రీజులో ఉన్నారు.

2: 52 PM: దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి టీమిండియా ఆటగాళ్లు చేతులెత్తేశారు. దీంతో మూడో రోజు ఆటలో భాగంగా 327 పరుగులకు టీమిండియా ఆలౌట్‌ అయింది. కాగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అయితే, వర్షం కారణంగా రెండో రోజు ఆట రద్దు కాగా... మంగళవారం ఆట ప్రారంభించిన కొద్ది సేపటికే ఆలౌట్‌ అయింది.

దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడికి అత్యధికంగా 6 వికెట్లు దక్కగా... రబడ 3, జాన్‌సెన్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. ఇక టీమిండియా ఆటగాళ్లలో కేఎల్‌ రాహుల్‌ 123 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మయాంక్‌ అగర్వాల్‌(60), కోహ్లి(35), రహానే(48), బుమ్రా (14) మినహా మిగతా ఆటగాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు.

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌: 327 పరుగులు, ఆలౌట్‌

2: 37 PM: టీమిండియా తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. మహ్మద్‌ షమీ ఎంగిడి బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌ క్రీజులో ఉన్నారు.

2: 26 PM: ప్రొటిస్‌ బౌలర్‌ కగిసో రబడ విశ్వరూపం చూపిస్తున్నాడు. వరుసగా వికెట్లు తీస్తూ టీమిండియాను దెబ్బకొడుతున్నాడు. ఇప్పటి వరకు మొత్తంగా అతడు 3 వికెట్లు తీయగా.. ఎంగిడి 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

2: 26 PM: కోహ్లి సేన నిమిదో వికెట్‌ కోల్పోయింది. శార్దూల్‌ ఠాకూర్‌ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌ చేరాడు. 

2: 15 PM: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మూడో రోజు ఆట ఆరంభం కాగానే వరుసగా వికెట్లు కోల్పోతోంది. కేఎల్‌ రాహుల్‌, అజింక్య రహానే, అశ్విన్‌, రిషభ్‌ పంత్‌ రూపంలో నాలుగు వికెట్లు కోల్పోయింది.

వరుణుడు కరుణించడంతో దక్షిణాఫ్రికా- భారత్‌ మధ్య తొలి టెస్ట్‌ మూడో రోజు ఆట ప్రారంభమైంది. కాగా  ఆరంభంలోనే రెండు కీలక వికెట్లను భారత్‌ కోల్పోయింది. సెంచరీ సాధించి మంచి టచ్‌లో కనిపించిన కేఎల్‌ రాహుల్‌, రబడ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఎంగిడీ బౌలింగ్‌లో రహానే కూడా వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 

తుదిజట్లు:
భారత్‌: కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, ఛతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), అజింక్య రహానే, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌.

దక్షిణాఫ్రికా:
డీన్‌ ఎల్గర్‌(కెప్టెన్‌), ఎయిడెన్‌ మార్కరమ్‌, కీగన్‌ పీటర్సన్‌, రసే వాన్‌ డెర్‌ డసెన్‌, తెంబా బవుమా, క్వింటన్‌ డికాక్‌(వికెట్‌ కీపర్‌), వియాన్‌ మల్దర్‌, మార్కో జాన్‌సెన్‌, కేశవ్‌ మహరాజ్‌, కగిసో రబడ, లుంగి ఎంగిడి.

Advertisement
Advertisement