IND VS WI: Shikhar Dhawan, Shreyas Iyer Tests Covid Negative Ahead of 2nd ODI - Sakshi
Sakshi News home page

IND VS WI: కోవిడ్‌ నుంచి కోలుకున్న టీమిండియా ఆటగాళ్లు.. రెండో వన్డేకు అతడు దూరమేనా..!

Published Tue, Feb 8 2022 6:56 PM

IND VS WI: Shikhar Dhawan, Shreyas Iyer Tests Covid Negative Ahead Of 2nd ODI - Sakshi

విండీస్‌తో తొలి వన్డేకు ముందు కరోనా బారిన పడిన నలుగురు టీమిండియా ఆటగాళ్లలో ముగ్గురు కోలుకున్నారు. నిన్న జరిపిన ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో శిఖ‌ర్ ధవ‌న్, శ్రేయ‌స్ అయ్య‌ర్, రిజర్వ్‌ ఆటగాడు నవ్‌దీప్‌ సైనీలకు నెగిటివ్‌ వచ్చిందని, రిజర్వ్‌ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌లో మాత్రం ఇంకా స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. కోవిడ్‌ నుంచి కోలుకున్న ముగ్గురు తొలి వన్డేకు దూరమైన కేఎల్‌ రాహుల్‌తో కలిసి ఇవాళ జరిగిన ప్రాక్టీస్ సెష‌న్‌లో పాల్గొన్నారు.

అయితే, వీరిలో రాహుల్‌ను మినహాయించి మిగతా ముగ్గురు రెండో వ‌న్డే ఆడటం అనుమానమేనని బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. క‌రోనా నెగెటివ్ వ‌చ్చిన‌ప్ప‌టికీ వీరు వైద్య బృందం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉండనుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రాహుల్‌ గైర్హాజరీలో తొలి వన్డేలో రోహిత్‌తో కలిసి ఓపెనింగ్‌ చేసిన యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ రెండో వన్డేకు బెంచ్‌కే పరిమితం కానున్నాడు. టీమిండియాలో ఈ ఒక్క మార్పు మినహా తొలి వన్డే బరిలో దిగే జట్టే యధాతథంగా కొనసాగే అవకాశం ఉంది.

తొలి వన్డేలో మిడిలార్డర్‌ బ్యాటర్లు సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హూడాలు పర్వాలేదనిపించడంతో ఇషాన్ కిష‌న్‌తో పాటు షారూక్ ఖాన్‌, మ‌యాంక్ అగ‌ర్వాల్‌లు మరో అవకాశం కోసం వేచి చూడక తప్పదు. ఇదిలా ఉంటే, ఆదివారం జ‌రిగిన తొలి వ‌న్డేలో వెస్టిండీస్‌పై టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. భారత బౌలర్లు చహల్‌(4/49), వాషింగ్టన్‌ సుందర్‌(3/30), ప్రసిద్ద్‌ కృష్ణ(2/29), సిరాజ్‌(1/26) చెలరేగడంతో విండీస్‌ 176 పరుగుల స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది.

జేసన్‌ హోల్డర్‌(71 బంతుల్లో 57; 4 సిక్సర్లు) ఒక్కడే హాఫ్‌ సెంచరీతో రాణించాడు. అనంతరం ఛేదనలో రోహిత్‌ శర్మ(60), ఇషాన్‌ కిషన్‌(28) తొలి వికెట్‌కు 84 పరుగులు జోడించి టీమిండియా గెలుపుకు పునాది వేయగా, ఆఖర్లో సూర్యకుమార్‌ యాదవ్‌(36 బంతుల్లో 34; 5 ఫోర్లు), దీపక్‌ హూడా(32 బంతుల్లో 26; 2 ఫోర్లు) మ్యాచ్‌ను లాంఛనంగా ముగించారు. కోహ్లి(8), పంత్‌(11) మరోసారి నిరుత్సాహపరిచారు.
చదవండి: కోహ్లిని మరోసారి అవమానించిన బీసీసీఐ.. 100వ టెస్ట్‌ యధాతథంగా..!

Advertisement

తప్పక చదవండి

Advertisement