వస్తున్నట్లు ముందుగా చెప్పలేదు! ఆరోజు రోహిత్‌ భార్య రితిక అన్న మాట నా జీవితంలో మర్చిపోలేను!

19 Jul, 2023 21:45 IST|Sakshi

Tilak Varma Family Sakshi Exclusive Interview: ‘‘మా ఇంటికి వస్తున్నట్లు ముందు రోజు చెప్పలేదసలు! టెండుల్కర్‌ సర్‌.. రోహిత్‌ సర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌.. ఇషాన్‌ కిషన్‌... ఇలా ముంబై ఇండియన్స్‌ ప్లేయర్లంతా వచ్చారు. రోహిత్‌ సర్‌, సూర్యకుమార్‌ తమ కుటుంబాలతో వచ్చారు. వాళ్లందరినీ డిన్నర్‌కు పిలుస్తాన్నా డాడీ అని నాలుగు గంటల ముందు చెప్పాడు.

కానీ నాకైతే వాళ్లు మన ఇంటికి వస్తరా అని డౌట్‌ వచ్చింది. అయితే, తిలక్‌ మాత్రం కచ్చితంగా వస్తారు డాడీ అని చెప్పాడు. మేము చాలా సంతోషించాం. క్రికెట్‌ గాడ్‌ టెండుల్కర్‌ సర్‌ మా ఇంటికి రావడం కంటే అదృష్టం ఏముంటుంది? ఆ రోజు రాత్రి 7. 30- 8.30 మధ్య సమయంలో వచ్చారు. అయితే, వాళ్లు వచ్చేదాకా మేమెవరికీ చెప్పలేదు. పబ్లిసిటీ చేయలేదు. మావాడు కూడా వాళ్లతోనే వచ్చాడు. వాళ్లతోనే వెళ్లిపోయాడు.

కిందనే కూర్చున్నారు
వాళ్లంతా మా ఇంట్లో దగ్గరదగ్గర మూడు- నాలుగు గంటలపాటు గడిపారు. డిన్నర్‌కు దమ్‌ బిర్యానీ, హండీ బిర్యాని వండించాం. వాళ్లకు వంటలన్నీ నచ్చాయని చెప్పారు. క్యారెట్‌ జ్యూస్‌ స్పెషల్‌గా ఇంట్లోనే చేశాం. అన్నీ చాలా బాగున్నాయని చెప్పారు. అంత పెద్ద క్రికెటర్లు అయినా వాళ్లకు ఏమాత్రం గర్వం లేదు. హుందాగా ఉన్నారు. వాళ్లంతట వాళ్లే సర్వ్‌ చేసుకున్నారు. కింద కూర్చునే భోజనం చేశారు.

రితిక అన్న మాటలు జీవితాంతం మర్చిపోలేను
ఇషాన్‌ కిషన్‌ అయితే చాలా సరదాగా ఉన్నాడు. ఇక రోహిత్‌ శర్మ భార్య రితిక అయితే రాగానే మా ఇంట్లో వా​ళ్లతో కలిసిపోయారు. మా ట్రిగ్గర్‌(పెట్‌ డాగ్‌)తో ఆడుకున్నారు. సూర్య కుమార్‌ భార్య కూడా సరదాగా గడిపారు. ఇద్దరూ కిందనే కూర్చున్నారు. నేను వెంటనే.. ‘‘కింద ఎందుకు కూర్చున్నారు రితికా.. వద్దు’’ అన్నాను.

అందుకు బదులుగా ఆవిడ అన్న మాటను నేను జీవితాంతం మర్చిపోలేను. ‘‘మేము సోఫా మీద కూర్చుంటే ఇది మీ ఇల్లు అవుతుంది. అదే కింద కూర్చుంటే మన ఇల్లు అవుతుంది కదా!’’ అన్నారు. అంత హుందాగా మాట్లాడారు. 

ఆరోజు మొత్తం 21 మంది వరకు వచ్చారు. మా మర్యాదలు వాళ్లకి నచ్చాయి’ అని భారత యువ బ్యాటర్‌ తిలక్‌ వర్మ తండ్రి నంబూరి నాగరాజు హర్షం వ్యక్తం చేశారు. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్‌ జట్టు తమ ఇంటికి వస్తారని అసలు ఊహించలేదన్నారు.

నాడు తిలక్‌ ఇంటికి తరలివచ్చిన అతిరథ మహారథులు
కాగా ఐపీఎల్‌-2023లో భాగంగా ఏ‍ప్రిల్‌లో సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన ఎంఐ జట్టు తమ ఆటగాడు తిలక్‌ వర్మ ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. టీమిండియా దిగ్గజం, ఎంఐ మెంటార్‌ సచిన్‌ టెండుల్కర్‌ సహా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కుటుంబాలతో హాజరయ్యారు.

ఈ సందర్భంగా తిలక్‌ ఫ్యామిలీ వాళ్లకు రుచికరమైన భోజనం వడ్డించింది. ఇషాన్‌ కిషన్‌తో పాటు తన బెస్ట్‌ఫ్రెండ్‌ డెవాల్డ్‌ బ్రెవిస్‌(సౌతాఫ్రికా)తో తిలక్‌ ఎంతో సంతోషంగా గడిపాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌ అయ్యాయి. కాగా ముంబై ఇండియన్స్‌ కీలక బ్యాటర్లలో ఒకడిగా ఎదిగిన హైదరాబాదీ తిలక్‌ వర్మ.. ఇటీవలే టీమిండియాకు ఎంపికైన విషయం తెలిసిందే.

వెస్టిండీస్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌కు సెలక్ట్‌ చేసిన జట్టులో అతడికి స్థానం దక్కింది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ తిలక్‌ వర్మ కుటుంబాన్ని పలకరించగా.. అతడి ఎదుగుదల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అదే విధంగా ముంబై ఇండియన్స్‌ జట్టు తమ ఇంటికి వచ్చిన నాటి సంగతులు గుర్తుచేసుకుని మరోసారి మురిసిపోయారు.

చదవండి: Ind Vs Pak: సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్‌.. పాక్‌ను చిత్తు చేసిన భారత్‌

మరిన్ని వార్తలు