Ind Vs Zim ODI Series: వరుస విజయాలు.. టీమిండియాకు గట్టి పోటీనిస్తాం: జింబాబ్వే కోచ్‌

12 Aug, 2022 14:59 IST|Sakshi
కేఎల్‌ రాహుల్‌- జింబాబ్వే జట్టు(PC: BCCI/Zimbabwe Cricket)

India tour of Zimbabwe, 2022- ODI Series: స్వదేశంలో బంగ్లాదేశ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు కైవసం చేసుకుని జోరు మీదుంది జింబాబ్వే క్రికెట్‌ జట్టు. టీ20, వన్డే సిరీస్‌లో అనూహ్య రీతిలో పర్యాటక బంగ్లాకు షాకిచ్చి 2-1తో ఓడించింది. ఇదే జోష్‌లో టీమిండియాతో పోరుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జింబాబ్బే జట్టు హెడ్‌ కోచ్‌ డేవిడ్‌ హౌన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

భారత్‌ వంటి పటిష్ట జట్టుతో ఆడటం తమకు లభించిన గొప్ప అవకాశమన్న డేవిడ్‌.. తాము కచ్చితంగా గట్టి పోటీనిస్తామనే భావిస్తున్నామని తెలిపాడు. గత కొన్ని రోజులుగా అనుకున్న ఫలితాలు సాధిస్తున్నామని.. రానున్న సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. 

గట్టి పోటీనిస్తాం!
ఈ మేరకు స్పోర్ట్స్‌ స్టార్‌తో డేవిడ్‌ మాట్లాడుతూ.. ‘‘ఇండియా ఇక్కడికి రావడం మనకు లభించిన మంచి అవకాశం అని డ్రెస్సింగ్‌ రూంలో మా వాళ్లకు నేను చెప్పాను. మెరుగైన స్కోర్లు నమోదు చేయడంతో పాటుగా.. ప్రపంచంలోని మేటి జట్టుపై మెరుగైన స్కోరు నమోదు చేసే విధంగా ముందుకు సాగాలన్నాను. 

అయితే, కేవలం నంబర్లకే పరిమితమైతే సరిపోదు కచ్చితంగా రాణించాలని.. గట్టి పోటీనివ్వాల్సి ఉంటుందని వాళ్లకు చెప్పాను. నిజంగానే మా వాళ్లు ఆ పని చేస్తారనే ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. 

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితేనే!
అదే విధంగా.. ‘‘నా దృష్టిలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మేము గెలుస్తామనే నమ్మకంతో బరిలోకి దిగినపుడే అన్నీ సాధ్యమవుతాయి. గత కొన్ని రోజులుగా మేము ఇలాంటి ఆశావహ దృక్పథం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాం. ఇకపై కూడా.. ముఖ్యంగా టీమిండియా విషయంలోనూ ఇదే కొనసాగించగలమని నమ్ముతున్నా’’ అని డేవిడ్‌ చెప్పుకొచ్చాడు.

కాగా ఈ ఏడాది జూన్‌లో లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ స్థానంలో జింబాబ్వే హెడ్‌కోచ్‌గా నియమితుడయ్యాడు డేవిడ్‌. అతడి మార్గదర్శనంలో జింబాబ్వే జట్టు టీ20 వరల్డ్‌కప్‌-2022 టోర్నీకి అర్హత సాధించడంతో పాటుగా బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో అదరగొట్టింది. ఇక.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఆగష్టు 18, 20, 22 తేదీల్లో హరారే వేదికగా కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని టీమిండియా ఆతిథ్య జట్టుతో తలపడనుంది.

చదవండి: IND vs ZIM: 6 ఏళ్ల తర్వాత భారత్‌తో సిరీస్‌.. జట్టును ప్రకటించిన జింబాబ్వే! కెప్టెన్‌ దూరం!
IND vs ZIM: జింబాబ్వేతో వన్డే సిరీస్‌.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌

మరిన్ని వార్తలు