కుర్రాళ్లూ వదిలేశారు.. ఫైనల్లో టీమిండియా ఓటమి! ఆసీస్‌దే వరల్డ్‌కప్‌ | Sakshi
Sakshi News home page

Under 19 World Cup: కుర్రాళ్లూ వదిలేశారు.. ఫైనల్లో టీమిండియా ఓటమి! ఆసీస్‌దే వరల్డ్‌కప్‌

Published Mon, Feb 12 2024 3:55 AM

India defeat in the final of the Under 19 World Cup - Sakshi

అచ్చు సీనియర్లలాగే... జూనియర్లూ సమర్పించుకున్నారు. ఆఖరి పోరు దాకా అజేయంగా నిలిచిన యువ భారత్‌ జట్టు ఆఖరి మెట్టుపై మాత్రం ఆ్రస్టేలియా చేతిలో ఓడింది. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ బృందం కూడా ఎదురులేని పోరాటంతో ఫైనల్‌ చేరింది. చివరకు ఆస్ట్రేలియా చేతిలోనే కంగుతింది.

ఇక్కడా భారత జూనియర్‌ జట్టు ఫైనల్‌ చేరే క్రమంలో అన్ని మ్యాచ్‌ల్లో గెలిచి కీలకమైన తుది పోరులో ఆ్రస్టేలియా జట్టు చేతిలోనే ఓటమి చవిచూసింది. వెరసి మూడు నెలల వ్యవధిలో ఆ్రస్టేలియా సీనియర్, జూనియర్‌ జట్లు వన్డే ప్రపంచకప్‌ టైటిల్స్‌ను హాట్‌ ఫేవరెట్‌ అయిన భారత్‌పైనే గెలవడం పెద్ద విశేషం.

బెనోని (దక్షిణాఫ్రికా): ప్రపంచకప్‌ కోసం ప్రతీ మ్యాచ్‌లో చిందించిన చెమటంతా ఫైనల్‌కు వచ్చేసరికి ఆవిరైంది. యువ భారత్‌ జైత్రయాత్ర కప్‌ అందుకోవాల్సిన మ్యాచ్‌లో పేలవంగా ముగిసింది. అండర్‌–19 ప్రపంచకప్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ 79 పరుగుల తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడింది.

మొదట ఆ్రస్టేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. హర్జస్‌ సింగ్‌ (55; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెపె్టన్‌ హ్యూగ్‌ వీగెన్‌ (48; 5 ఫోర్లు) రాణించారు. సీమర్లు రాజ్‌ లింబాని 3, నమన్‌ తివారి 2 వికెట్లు తీశారు. గతంలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన భారత జట్టు లక్ష్య ఛేదనలో తడబడింది. చివరకు 43.5 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌటైంది.

ఓపెనర్‌ ఆదర్శ్‌ సింగ్‌ (77 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్‌), హైదరాబాద్‌ కుర్రాడు మురుగన్‌ అభిషేక్‌ (46 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బియర్డ్‌మన్‌ (3/15) కోలుకోలేని దెబ్బ తీయగా, రాఫ్‌ మెక్‌మిలన్‌ (3/43) ఇంకెవరినీ క్రీజులో నిలువనీయలేదు.  

చక్కగా కట్టడి చేసినప్పటికీ...
టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా బ్యాటర్లెవరూ భారీ స్కోర్లు చేయకుండా భారత బౌలర్లు చక్కగానే కట్టడి చేశారు. హర్జస్‌ అర్ధసెంచరీ సాధించగా, వీగెన్, డిక్సన్‌ (56 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ఒలీవర్‌ (43 బంతుల్లో 46 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌)లను అర్ధశతకాల వరకు రానివ్వలేదు. లింబాని, నమన్‌ వరుస విరామాల్లో వికెట్లు తీశారు. అందువల్లే పెద్దస్కోరైతే నమోదు కాలేదు.
 
రాణించిన ఆదర్శ్, అభిషేక్‌ 
కష్టమైన లక్ష్యం కాదు... ఈ మెగా ఈవెంట్‌లో మన కుర్రాళ్ల ఫామ్‌ ముందు ఛేదించే లక్ష్యమే! పెద్దగా కష్టపడకుండా ఏ ఇద్దరు ఫిఫ్టీలు బాదినా... ఇంకో ఇద్దరు 30 పైచిలుకు పరుగులు చేసినా చాలు గెలవాల్సిన మ్యాచ్‌ ఇది! కానీ టాపార్డర్‌లో అర్షిన్‌ (3), ముషీర్‌ ఖాన్‌ (22), మిడిలార్డర్‌లో నమ్మదగిన బ్యాటర్లు కెప్టెన్‌ ఉదయ్‌ సహారణ్‌ (8), సచిన్‌ దాస్‌ (8)ల వికెట్లను పారేసుకోవడంతో 68/4 స్కోరు వద్దే భారత్‌ పరాజయం ఖాయమైంది. ఎందుకంటే తర్వాత వచ్చిన వారెవరూ సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడలేనివారే! ఆదర్శ్, అభిషేక్‌ల పోరాటం అంతరాన్ని తగ్గించేందుకు ఉపయోగపడింది.

అండర్‌–19 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌పై నెగ్గడం ఆస్ట్రేలియాకిదే తొలిసారి. ఈ రెండు జట్లు 2012, 2018 టోర్నీ ఫైనల్స్‌లోనూ తలపడగా రెండుసార్లూ భారత జట్టే గెలిచింది.

4 అండర్‌–19 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ను ఓడించిన నాలుగో జట్టు ఆ్రస్టేలియా. గతంలో పాకిస్తాన్‌ (2006), వెస్టిండీస్‌ (2016), బంగ్లాదేశ్‌ (2020) ఫైనల్లో ఓడించి విజేతగా నిలిచాయి.   

అండర్‌–19 ప్రపంచకప్‌ సాధించడం ఆ్రస్టేలియాకిది నాలుగోసారి. గతంలో ఆ జట్టు 1988, 2002, 2010లలో విజేతగా నిలిచింది.

2012 భారత అండర్‌–19 జట్టుపై 2012 తర్వాత ఆస్ట్రేలియా యువ జట్టు మళ్లీ గెలుపొందడం విశేషం. గత 12 ఏళ్లలో ఆ్రస్టేలియా జూనియర్‌ జట్టుతో ఆడిన 10 మ్యాచ్‌ల్లోనూ యువ భారత్‌ విజయం సాధించింది.

స్కోరు వివరాలు
ఆ్రస్టేలియా ఇన్నింగ్స్‌: డిక్సన్‌ (సి) అభిషేక్‌ (బి) తివారి 42;  కొన్‌స్టాస్‌ (బి) లింబాని 0; వీగెన్‌ (సి) ముషీర్‌ (బి) తివారి 48; హర్జస్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) సౌమీ పాండే 55; హిక్స్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) లింబాని 20; ఒలీవర్‌ (నాటౌట్‌) 46; మెక్‌మిలన్‌ (సి అండ్‌ బి) ముషీర్‌ 2; అండర్సన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) లింబాని 13; స్ట్రేకర్‌ (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 253. వికెట్ల పతనం: 1–16, 2–94, 3–99, 4–165, 5–181, 6–187, 7–221. బౌలింగ్‌: రాజ్‌ లింబాని 10–0–38–3, నమన్‌ తివారి 9–0–63–2, సౌమీ పాండే 10–0–41–1, ముషీర్‌ 9–0–46–1, అభి    షేక్‌ 10–0–37–0, ప్రియాన్షు 2–0–17–0. 

భారత్‌ ఇన్నింగ్స్‌: ఆదర్శ్‌ (సి) హిక్స్‌ (బి) బియర్డ్‌మన్‌ 47; అర్షిన్‌ (సి) హిక్స్‌ (బి) విడ్లెర్‌ 3; ముషీర్‌ (బి) బియర్డ్‌మన్‌ 22; ఉదయ్‌ (సి) వీగెన్‌ (బి) బియర్డ్‌మన్‌ 8; సచిన్‌ (సి) హిక్స్‌ (బి) మెక్‌మిలన్‌ 9; ప్రియాన్షు (సి) విడ్లెర్‌ (బి) అండర్సన్‌ 9; అవనీశ్‌ రావు (సి అండ్‌ బి) మెక్‌మిలన్‌ 0; అభిషేక్‌ (సి) వీగెన్‌ (బి) విడ్లెర్‌ 42; లింబాని (బి) మెక్‌మిలన్‌ 0; నమన్‌ (నాటౌట్‌) 14; సౌమీ (సి) హిక్స్‌ (బి) స్ట్రేకర్‌ 2; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (43.5 ఓవర్లలో ఆలౌట్‌) 174. వికెట్ల పతనం: 1–3, 2–40, 3–55, 4–68, 5–90, 6–91, 7–115, 8–122, 9–168, 10–174. బౌలింగ్‌: విడ్లెర్‌ 10–2–35–2, అండర్సన్‌ 9–0–42–1, స్ట్రేకర్‌ 7.5–1–32–1, బియర్డ్‌ మన్‌ 7–2–15–3, మెక్‌మిలన్‌ 10–0–43–3.

Advertisement
Advertisement