పురుషుల హాకీ జట్టు శుభారంభం

25 Jul, 2021 06:31 IST|Sakshi

మహిళల జట్టుకు భారీ ఓటమి

టోక్యో: ఒలింపిక్స్‌ హాకీలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల జట్టు శుభారంభం చేయగా... మహిళల జట్టు చిత్తుగా ఓడింది. పూల్‌ ‘ఎ’లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 3–2తో గెలుపొందింది. హర్మన్‌ప్రీత్‌ (26వ, 33వ ని.లో) రెండు గోల్స్‌ సాధించగా, రూపిందర్‌ పాల్‌ సింగ్‌ (10వ ని.లో) ఒక గోల్‌ చేశాడు. సీనియర్‌ గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ గోల్‌పోస్ట్‌ వద్ద ప్రత్యర్థి గోల్స్‌ను చాకచక్యంగా ఆడ్డుకోవడంతో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ భారత్‌ విజయం సాధించింది. న్యూజిలాండ్‌ జట్టులో కేన్‌ రసెల్‌(6వ ని.), జెనెస్‌(43వ ని.) చెరో గోల్‌ చేశారు.

ఆదివారం జరిగే తదుపరి మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు  ఆస్ట్రేలియాతో తలపడుతుంది. మరోవైపు మహిళల గ్రూప్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌లో భారత జట్టు ప్రపంచ నంబర్‌వన్‌ నెదర్లాండ్స్‌ చేతిలో 1–5 గోల్స్‌ తేడాతో ఓడింది. అమ్మాయిల జట్టు అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచారు. డిఫెండర్లు చేతులెత్తేయగా... అలసత్వం జట్టును నిండా ముంచేసింది. నెదర్లాండ్స్‌ జట్టులో ఫెలిస్‌ అల్బర్స్‌ (6వ, 43వ ని.) రెండు గోల్స్‌ చేయగా, గెఫిన్‌ (33వ ని.), ఫ్రెడెరిక్‌ మట్ల (45వ ని.), జాక్వెలిన్‌ వాన్‌ (52వ ని.) తలా ఒక గోల్‌ సాధించారు. భారత్‌ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను కెప్టెన్‌ రాణి రాంపాల్‌ పదో నిమిషంలో సాధించింది. 26న జరిగే తదుపరి మ్యాచ్‌లో అమ్మాయిల జట్టు జర్మనీతో ఆడుతుంది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు