Ind Vs Sl 2nd Test: విహారికి ఛాన్స్‌.. మరి సిరాజ్‌? | Sakshi
Sakshi News home page

Ind Vs Sl 2nd Test: ‘పింక్‌’తో పని పట్టేందుకు... విహారికి ఛాన్స్‌.. మరి సిరాజ్‌?

Published Sat, Mar 12 2022 4:17 AM

India vs Sri Lanka 2nd Test at Chinnaswamy stadium - Sakshi

India Vs Sri Lanka 2nd Test- బెంగళూరు: మూడు రోజుల్లోపే తొలి టెస్టులో శ్రీలంక ఆట ముగించిన భారత్‌ ఇప్పుడు అదే ప్రదర్శనను పునరావృతం చేసేందుకు సిద్ధమైంది. నేటి నుంచి చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది. తాజా ఫామ్, బలాబలాల దృష్ట్యా ప్రత్యర్థికంటే ఎంతో పటిష్టంగా ఉన్న టీమిండియాకు ఇక్కడా అడ్డు ఉండకపోవచ్చు.

తొలి పోరులో ఘోర వైఫల్యం తర్వాత రెండో టెస్టులో లంక ఏమాత్రం పోటీనిస్తుందనేది చూడాలి. ఫ్లడ్‌ లైట్ల వెలుగులో ‘డే అండ్‌ నైట్‌’గా గులాబీ బంతితో జరగనున్న ఈ మ్యాచ్‌కు మైదానంలో ప్రేక్షకులను 100 శాతం అనుమతిస్తుండటం చెప్పుకోదగ్గ విశేషం.  

సిరాజ్‌కు అవకాశం ఇస్తారా!  
మొహాలీలో భారత జట్టు ప్రదర్శన చూసిన తర్వాత సహజంగానే తుది జట్టులో మార్పులకు అవకాశం కనిపించదు. రోహిత్‌తో పాటు సొంతగడ్డపై మయాంక్‌ అగర్వాల్‌ ఇన్నింగ్స్‌ ఆరంభిస్తాడు. మూడో స్థానంలో హనుమ విహారికి మళ్లీ అవకాశం ఖాయం కాగా... కోహ్లి ఈ మ్యాచ్‌లోనైనా సెంచరీ సాధించి సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతాడా చూడాలి.

శ్రేయస్‌ అయ్యర్, రిషభ్‌ పంత్, రవీంద్ర జడేజాలతో మిడిలార్డర్‌ పటిష్టంగా ఉండగా ఆ తర్వాత అశ్విన్‌ కూడా సత్తా చాటగలడు. బుమ్రా, షమీ ఖాయం కాగా... మూడో స్పిన్నర్‌గా జయంత్‌ యాదవ్‌ స్థానంలో అక్షర్‌ పటేల్‌ను ఆడించడంపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆలోచిస్తోంది. అయితే ‘పింక్‌ బంతి’ బాగా స్వింగ్‌ అయ్యే అవకాశం ఉండటంతో దాదాపు సొంత మైదానంలాంటి చిన్నస్వామిలో మూడో పేసర్‌గా హైదరాబాద్‌ బౌలర్‌ సిరాజ్‌కు చాన్స్‌ లభిస్తుందేమో చూడాలి.  

తుది జట్టులో ఎవరు?
మొదట టి20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌ అయి తొలి టెస్టులోనూ ఓడిన శ్రీలంక ఇప్పుడు రెండో మ్యాచ్‌ కోసం తుది జట్టును సిద్ధం చేసుకోవడమే కష్టంగా మారింది. గత మ్యాచ్‌లో ఆడిన కుమార, నిసాంకా గాయాలతో దూరం కాగా, ఆడే అవకాశం ఉన్న చమీరా కూడా గాయపడ్డాడు. కుశాల్‌ మెండిస్‌ కోలుకోవడం ఆ జట్టుకు ఊరట.

అసలంక  స్థానంలో చండిమాల్‌కు అవకాశం దక్కవచ్చు.  మరోసారి టీమ్‌ బ్యాటింగ్‌ సీనియర్లు కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్‌లపైనే ఆధారపడి ఉంది. ఎంబుల్డెనియాతో పాటు కొత్తగా వస్తున్న చమిక కరుణరత్నే భారత్‌ను ఏమాత్రం కట్టడి చేయగలరో చూడాలి. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్న సురంగ లక్మల్‌ ఆటపై అందరి దృష్టీ ఉంది.  

4:భారత్‌కు ఇది నాలుగో డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్‌... స్వదేశంలో బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లపై గెలిచిన భారత్‌ ఆస్ట్రేలియా గడ్డపై ఓడింది.  
400: మూడు ఫార్మాట్‌లలో కలిపి రోహిత్‌కిది 400వ అంతర్జాతీయ మ్యాచ్‌ కానుంది.

Advertisement
Advertisement