Sakshi News home page

Indian Racing League: సాగర తీరంలో రయ్‌ రయ్‌.. పరుగులు తీసిన రేసింగ్‌ కార్లు

Published Sat, Nov 19 2022 3:52 PM

 Indian Racing League in Hyderabad on Saturday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ శనివారం నెక్లెస్‌ రోడ్డులోని స్ట్రీట్‌ సర్క్యూట్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రి కేటీఆర్‌ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా– ఈ పోటీలకు ట్రయల్‌ రన్‌గా భావిస్తున్న  ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌కు నెక్లెస్‌ రోడ్డు  వేదికైంది. 2.3 కిలోమీటర్ల ట్రాక్‌లో కార్లు భారీ వేగంతో పరుగులు  తీశాయి.  60 నుంచి 80 సెకన్ల వ్యవధిలో ఒక ల్యాప్‌ చొప్పున పూర్తి చేశాయి.

సాయంత్రం 4.18  గంటలకు  మంత్రి కేటీఆర్‌  ట్రాక్‌ను సందర్శించి జెండా ఊపి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. దాంతో  రేసింగ్‌ కార్లు ముందుకు దూకాయి. వాయువేగంతో  దూసుకెళ్లాయి. గంట  పాటు పోటీలు జరిగాయి. 2.7 కిలోమీటర్ల మేర ట్రాక్‌ను ఏర్పాటు చేసినప్పటికీ ఈ పోటీల కోసం  2.3 కిలోమీటర్ల ట్రాక్‌నే వినియోగించినట్లు  అధికారులు  తెలిపారు.

ట్రాక్‌లో 17 మలుపుల నుంచి 200 కి.మీటర్లకు పైగా వేగంతో పరుగులు తీశాయి. ఈ పోటీలను వీక్షించేందుకు యువత పెద్ద సంఖ్యలో తరలిచ్చారు. పిల్లలు, పెద్దలతో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ సందడిగా కనిపించింది. మరోవైపు పోటీల నిర్వహణ సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు, ఇబ్బందులు తలెత్తకుండా వలంటీర్లు, భద్రతా బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాయి. మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు ఈ పోటీలను తిలకించేందుకు కేటీఆర్‌ తనయుడు హిమాన్షు తన స్నేహితులతో కలిసి వచ్చి పోటీలను ఆసక్తిగా వీక్షించారు. 

ఆరు బృందాలు.. 12 కార్లు.. 
పోటీల్లో ఆరు బృందాలు పాల్గొన్నాయి. 12 రేసింగ్‌ కార్లను వినియోగించారు.  హైదరాబాద్‌ బర్డ్స్‌ టీమ్‌లో నగరానికి చెందిన బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తనయుడు అనిందిత్‌రెడ్డి, అఖిల్‌ రవీంద్ర, స్వీడన్‌ రేసర్‌ నీల్‌జానీ, ఫ్రెంచ్‌ రేసర్‌ లోలా లోవిన్సాస్‌లు ఉన్నారు. కాగా..  షెడ్యూల్‌ ప్రకారం తొలిరోజు క్వాలిఫయింగ్‌తో పాటు ఒక ప్రధాన రేస్‌ జరగాల్సి ఉన్నా.. కొత్త ట్రాక్‌ కావడంతో రేసర్లు ప్రాక్టీస్‌కే పరిమితమయ్యారు. ఆదివారం అన్ని రేసులూ జరగనున్నాయి. 

కుంగిన గ్యాలరీ 
ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీ  కొద్దిగా కిందకు కుంగింది. మంత్రి కేటీఆర్‌ రావడంతో  ఆయనతో పాటు చాలా మంది పైకి వచ్చారు. దీంతో గ్యాలరీ సామర్థ్యం కంటే ఎక్కువ మంది చేరడంతో  ఒక వైపు బరువు పెరిగి గ్యాలరీ కుంగింది. అప్రమత్తమైన పోలీసులు కొంతమందిని  కిందకు దింపారు.  

విరిగిపడిన చెట్టు కొమ్మ  
మధ్యాహ్నం ట్రయల్‌ నిర్వహిస్తున్న క్రమంలో ఐమాక్స్‌ వద్ద ఒక చెట్టు కొమ్మ విరిగిపడింది. దీంతో అటు వైపు నుంచి  వేగంగా దూసుకొస్తున్న కారు ముందు భాగంలో కొమ్మ పడింది. కారును ఆపి మెకానిక్‌ షెడ్‌కు తరలించారు. చిన్న మరమ్మతుల అనంతరం తిరిగి  దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. 

గ్యాలరీలు వెలవెల 
వేలాది మంది ప్రేక్షకులు వీక్షించేందుకు అనుగుణంగా గ్యాలరీలను ఏర్పాటు చేసినప్పటికీ జనసందోహం తక్కువగానే కనిపించింది. చాలా వరకు గ్యాలరీలు ఖాళీగానే కనిపించాయి. చాలా మంది నెక్లెస్‌రోడ్డు, మింట్‌కాంపౌండ్, తదితర ప్రాంతాల్లో ట్రాక్‌ బయట నించొని పోటీలను  వీక్షించారు.  

హైదరాబాద్‌ మంచి వేదిక  
ఇప్పటి వరకు చెన్నై, బెంగళూరు, కోయంబత్తూరు తదితర చోట్ల కార్‌ రేసింగ్‌ జరిగింది. మన హైదరాబాద్‌లో జరగడం ఇదే మొదటిసారి. ఇక్కడ రేసింగ్‌ శిక్షణకు, పోటీలకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి.  ఇండియాతో పాటు మలేసియా, జపాన్, థాయ్‌లాండ్, చైనా తదితర దేశాల్లో జరిగిన పోటీల్లో పాల్గొన్నాను. పదేళ్లుగా ఈ రంగంలో ఉన్నాను. హైదరాబాద్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది. స్ట్రీట్‌ సర్క్యూట్‌ కూడా చాలా బాగుంది. అంతా తిరిగి  చూశాం. ట్రయల్స్‌ కూడా పూర్తయ్యాయి.  
    – అనిందిత్‌రెడ్డి, హైదరాబాద్‌ 

మోటార్‌ స్పోర్ట్స్‌కు ఉత్తమ భవిష్యత్‌  
మోటార్‌ స్పోర్ట్స్‌ ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్‌ ఉన్న క్రీడ. ఈ క్రీడలో  పాల్గొనే రేసర్లకు మంచి భవిష్యత్‌ ఉంటుంది. మన ఇండియాలో కూడా రేసింగ్‌లో శిక్షణనిచ్చే ఇనిస్టిట్యూషన్స్‌ ఉన్నాయి. బెంగళూరు, కొచ్చి వంటి నగరాల్లో  ఈ శిక్షణ ఉంది. హైదరాబాద్‌ యూత్‌కు ఈ రంగంలో  గొప్ప అవకాశాలున్నాయి.          
– అఖిల్‌ రవీంద్ర, బెంగళూరు 

ఇండియాలో ఇదే తొలిసారి  
పారిస్‌లో  జరిగిన పోటీల్లో పాల్గొన్నాను. ఇండియాలో పాల్గొనడం ఇదే మొదటిసారి. చాలా ఉత్సాహంగా ఉంది. 2016 నుంచి రేసింగ్‌ ఛాంపియన్‌షిప్‌  పోటీల్లో పాల్గొంటున్నాను. ఈ  పోటీలు నాకు చాలా ఇష్టం. – లోలా లోవిన్సాస్, ఫ్రాన్స్‌                    

ఇంగ్లిష్‌ చానళ్లలో మాత్రమే చూసేవాళ్లం 
కార్‌ రేసింగ్‌ అంటే ఇన్నాళ్లు టీవీలో.. అదికూడా ఇంగ్లిష్‌ న్యూస్‌ చానళ్లల్లో మాత్రమే చూసేవాళ్లం. అలాంటిది ఈ రేసింగ్‌ ఈవెంట్‌ను సిటీలో నిర్వహించడం మంచి అనుభూతినిచ్చింది. క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్‌లో సిటీ ఎంత ఎదిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఫార్ములా వన్‌ వంటి గేమ్స్‌కు నగరం ఆతిథ్యమివ్వడంతో సిటీ గొప్పదనం మరోసారి ప్రపంచానికి పరిచయం చేసింది. ఇకపై నగరవాసులు కూడా ఇలాంటి గేమ్స్‌లో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తారు.   
– సంతోష్, మోడలింగ్‌ ఔత్సాహికుడు

నగరానికి నయా కళ  
ఇలాంటి కార్‌ రేసింగ్‌ ఒక్కసారైనా చూస్తానా అని అనుకునేదానిని. సిటీలో స్ట్రీట్‌ సర్క్యూట్‌ రేసింగ్‌ జరుగుతుందని తెలిసినప్పటి నుంచి వేచి చూశాను. ఇలాంటి ఇండియన్‌ రేసింగ్‌ ఈవెంట్స్‌ మరెన్నో నగరంలో జరగాలని కోరుకుంటున్నాను. మన రోడ్లపై రేసింగ్‌ కార్లు దూసుకుపోతుంటే ఏదో కొత్త కళ వచ్చింది. దేశ్యవాప్తంగా పాల్గొన్న రేసర్లను దగ్గరగా చూడటం మంచి అనుభూతి. 
 – ఐశ్వర్య, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి 
 

చదవండి: Indian Racing League: రెడీ టూ రైడ్‌.. ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌కు సర్వం సిద్దం

Advertisement

What’s your opinion

Advertisement