Mirabai Chanu: మన 'బంగారు' మీరాబాయి

31 Jul, 2022 08:07 IST|Sakshi

బర్మింగ్‌హమ్‌ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్‌ గేమ్స్‌ 2022లో భారత్‌ ఖాతాలో తొలి పసిడి పతకం వచ్చి చేరింది. టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో రజత పతకం సాధించిన మీరాబాయి చానూ కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో బంగారు పతకం ఒడిసి పట్టింది. శనివారం 49 కేజీల విభాగంలో జరిగిన వెయిట్‌లిఫ్టింగ్‌ ఫైనల్‌లో మీరాబాయి చాను స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 113 కేజీలు (మొత్తం 201 కేజీలు) ఎత్తి పసిడి ఖాయం చేసుకుంది.  

టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన తొలి భారత వెయిట్‌లిఫ్టర్‌గా చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను తన ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు సరికొత్తగా మార్చుకుంటూ వచ్చింది. అలసటను దరి చేరనీయలేదు.. ఏకాగ్రతను దూరం చేసుకోలేదు. వాస్తవానికి మీరాబాయి చానూ ఈసారి 55 కేజీల విభాగంలో పోటీ పడాల్సింది. ఈ సారి ఎక్కువ పతకాలు రావాలనే ఉద్దేశంతో భారత వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య ఆమెను 55 కేజీల విభాగానికి మారాలని సూచించింది. దీంతో మీరాబాయి తన బరువును పెంచుకుంటూనే ఎంతోగానో శ్రమించింది.

కానీ ఆఖరి క్షణంలో ఒక్క విభాగం నుంచి ఒక్కరే ఎంపికవుతారనే నిబంధన కారణంగా చాను తిరిగి 49 కేజీల విభాగానికి మారాల్సి వచ్చింది. అలా తనకు అచ్చొచ్చిన విభాగంలో పోటీ పడిన ఆమె స్నాచ్‌ విభాగంలో 90 కేజీల బరువు ఎత్తాలని టార్గెట్‌గా పెట్టుకుంది. కానీ స్నాచ్‌ మొదటి, రెండో ప్రయత్నంలో 84, 88 కేజీలు ఎత్తిన చాను మూడో ప్రయత్నంలో 90 కేజీలకు ప్రయత్నించి విఫలమైంది. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో కూడా 109, 113 కేజీల తర్వాత 115 కేజీలకు ప్రయత్నించి ఎత్తలేకపోయింది. అయితే ఓవరాల్‌గా ఆమెకు, తర్వాతి స్థానంలో నిలిచిన లిఫ్టర్‌కు మధ్య ఉన్న అంతరం (29 కేజీలు) చూస్తే ఈ పోటీల్లో చాను స్థాయి ఏమిటో అర్థమవుతుంది.

ఇక 2014 గ్లాస్కో గేమ్స్‌ రజతం.. 2018 గోల్డ్‌ కోస్ట్‌ గేమ్స్‌లో స్వర్ణం.. తాజాగా మరోసారి స్వర్ణంతో మెరిసి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. మరి వచ్చే పారిస్‌ ఒలింపిక్స్‌(2024)లో టోక్యోలో వచ్చిన రజతాన్ని స్వర్ణంగా మారుస్తుందేమో చూడాలి.

మరిన్ని వార్తలు