ఈ విషయం ముందే చెప్పా.. నిర్ణయం సరైనదే

22 May, 2021 17:56 IST|Sakshi

కరాచీ: జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్ను టీమిండియా రెండో జట్టుకు టీమిండియా మాజీ ఆటగాడు రాహుల్‌ ద్రవిడ్‌ను ప్రధాన కోచ్‌గా ఎంపిక చేయడంపై అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న టీమిండియాకు కోచ్‌గా ద్రవిడ్‌ సరిగ్గా సరిపోతాడని.. అతని మార్గనిర్దేశనంలో జట్టు అదరగొడుతుందని అంతా భావిస్తు‍న్నారు. ఈ నేపథ్యంలో ద్రవిడ్‌ను కోచ్‌గా ఎంపిక చేయడంపై పాక్‌ మాజీ ఆటగాడు ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ స్పందించాడు.

''నేను ఈ విషయం ఇంతకముందే చెప్పా. కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ సరిగ్గా సరిపోతాడు. బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనదే. ద్రవిడ్‌ అండర్‌-19 గ్రూఫ్‌ నుంచి ఎందరో మెరికల్లాంటి ఆటగాళ్లను తయారు చేశాడు. శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న టీమిండియా రెండో జట్టుకు ఎంపికయ్యే ఆటగాళ్లలో చాలావరకు ద్రవిడ్‌ శిక్షణలో రాటుదేలిన వారే. వారి నుంచి ఆటను ఎలా రాబట్టాలనేది అతనికి బాగా తెలుసు. ఆటగాళ్లు కూడా ద్రవిడ్‌తో మంచి అనుబంధం ఉన్న కారణంగా ఇట్టే కలిసిపోతారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎక్స్‌పరిమెంట్స్‌ చేస్తే మంచిది. ఎందుకంటే సీనియర్లు లేని లోటు తెలియాలంటే బ్యాకప్‌ బెంచ్‌ కూడా పటిష్టంగా ఉంచుకోవాలి. బీసీసీఐ మంచి ప్రణాళికతో ముందుకెళుతుంది.. వీరిని చూసి ఇతర క్రికెట్‌ బోర్డులు అదే దారిని ఎంచుకోవాలి'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక శ్రీలంక పర్యటనకు సంబంధించి టీమిండియా జట్టును బీసీసీఐ వచ్చే నెలలో ప్రకటించనుంది. కోచ్‌ విషయంలో క్లారిటీతో  కనిపించిన  బీసీసీఐ కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి అప్పజెబుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. అయితే రేసులో శిఖర్‌ ధావన్‌, హార్దిక పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌లు కనిపిస్తున్నా.. సెలెక్టర్లు మాత్రం అనుభవం దృష్యా కెప్టెన్సీ బాధ్యతలు ధావన్‌కే అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా సీనియర్‌ జట్టు న్యూజిలాండ్‌తో జరగనున్న ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు సన్నద్దమవుతుంది. జూన్‌ 2న ఇంగ్లండ్‌ వెళ్లనున్న టీమిండియా జూన్‌ 18 నుంచి 22 వరకు కివీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడనుంది. అనంతరం ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో పాల్గొననుంది.
చదవండి: ద్రవిడ్‌ కెప్టెన్‌ కావడం వారికి ఇష్టం లేదు.. అందుకే అలా చేశారు

మరిన్ని వార్తలు