పంత్‌ సేనకు భారీ షాక్‌.. స్టార్‌ పేసర్‌కు కరోనా

14 Apr, 2021 15:47 IST|Sakshi

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌ను విజయంతో మొదలు పెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే కరోనా బారిన పడ్డాడు. లీగ్‌లో పాల్గొనేందుకు సహచరుడు కగిసో రబాడాతో కలిసి ఆలస్యంగా భారత్‌కు వచ్చిన నోర్జే.. బీసీసీఐ నిబంధనల ప్రకారం వారం రోజుల క్వారంటైన్‌లో ఉన్నాడు. అయితే క్వారంటైన్ పూర్తయిన తర్వాత నిర్వహించిన పరీక్షల్లో అతనికి పాజిటివ్‌గా తేలిందని జట్టు వర్గాలు వెల్లడించాయి.

దీంతో నోర్జే మరో 10 రోజులు ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఈ లెక్కన అతను మరో రెండు, మూడు మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అయితే, నోర్జే కరోనా బారిన పడిన విషయాన్ని ఢిల్లీ యాజమాన్యం అధికారికంగా వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. గతంలో కేకేఆర్‌ ఆటగాడు నితీశ్‌ రాణా, బెంగళూరు ఓపెనర్‌ పడిక్కల్‌  కోవిడ్‌ బారిన పడ్డ సందర్భంలో ఆయా జట్ల యాజమాన్యాలు అధికారికంగా ధృవీకరించాయి.

ఇదిలా ఉంటే దుబాయ్‌ వేదికగా జరిగిన గత సీజన్‌లో నోర్జే అద్భుతంగా రాణించాడు. అరంగేట్రం సీజన్‌లోనే ఢిల్లీను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన నోర్జే.. 8.39 ఎకానమీతో 22 వికెట్లు పడగొట్టాడు. సహచరుడు రబడా‌తో(17 మ్యాచ్‌ల్లో 30 వికెట్లు) కలిసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించి ఢిల్లీని తొలిసారి ఫైనల్‌కు చేర్చడంలో తనవంతు పాత్రను పోషించారు. కాగా, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 7 వికెట్లతో గెలుపొంది బోణీ కొట్టిన పంత్‌ సేన.. నోర్జే, రబాడా రాకతో మరింత బలపడుతుందని భావించిన తరుణంలో ఇలా జరగడం ఆ జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు