మీరు మారండి.. లేకపోతే మిమ్మల్నే మారుస్తాం: మెకల్లమ్‌

30 Apr, 2021 20:26 IST|Sakshi
Photo Courtesy: BCCI

అహ్మదాబాద్‌: ఢిల్లీ క్యాపిటల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ దారుణమైన ఓటమి చవిచూడటంపై ఆ జట్టు కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. కేకేఆర్‌ జట్టు సమిష్టగా విఫలం అవుతూ వరుస ఓటములు ఎదురవుతున్న తరుణంలో జట్టును పూర్తి ప్రక్షాళన చేయాల్సి వస్తుందనే సంకేతాలిచ్చాడు. టాపార్డర్‌ ఆటగాళ్లు ఘోరంగా వైఫల్యం చవిచూసి భారీ స్కోర్లను ప్రత్యర్థి జట్ల ముందు ఉంచలేకపోతున్న సమయంలో ప్రత్యామ్నాయాలను చూద్దామా అంటూ వార్నింగ్‌ ఇచ్చాడు. ఇక్కడ ఏ ఒక్క క్రికెటర్‌ గురించి ప్రస్తావన తీసుకురాకుండానే చురకలంటించాడు మెకల్లమ్‌.

దూకుడుగా ఆడటంలో విఫలం అవుతున్న నితీష్‌ రానా, శుబ్‌మన్‌ గిల్‌, త్రిపాఠిలనే టార్గెట్‌ చేసినట్లు మెకల్లమ్‌ మాటల ద్వారా అర్థం అవుతోంది. ప్రధానంగా టాప్‌-3 ఆటగాళ్లైన వీరి స్టైక్‌రేట్‌ చాలాపేలవంగా ఉండటమే మెకల్లమ్‌ అసంతృప్తికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ‘ మీరు మారండి.. లేకపోతే మిమ్మల్నే మారుస్తాం’ అంటూ హెచ్చరించాడు. మ్యాచ్‌ తర్వాత ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన మెకల్లమ్‌.. ‘ ఇది చాలా చాలా నిరూత్సాహపరిచింది. ఒక ప్లేయర్‌గా ఆలోచిస్తే నువ్వు సెలక్షన్‌కు వచ్చిన ప్రతీసారి మాపై నమ్మకం, ఫ్రీడమ్‌ గురించి మాట్లాడతావ్‌. అటువంటప్పుడు గేమ్‌ను సీరియస్‌గా తీసుకోవాలి. మ్యాచ్‌కు సిద్ధమైతే దూకుడు ఉండాలి. 

నీ జట్టు కోసం శ్రమించాలి. నేను, మా జట్టు కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌లు కావాల్సినంత స్వేచ్చ ఇస్తున్నాం. ఢిల్లీ జట్టులో పృథ్వీ షాను చూడండి. మాతో మ్యాచ్‌లో ఫెర్‌ఫెక్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆ జట్టు అతని నుంచి ఏమి ఆశించిందో అదే చేశాడు. ప్రతీ బాల్‌ సిక్స్‌, ఫోర్‌ కొట్టాలంటే కుదరదు. కానీ ముందు మీలో బంతిపై దూకుడే లేదు. మీకు ఫ్రీ లైసెన్స్‌ ఇచ్చినప్పుడు ఇలాగేనా ఆడేది. మనం షాట్లు కొట్టకపోతే స్కోరు ఎలా వస్తుంది. నా కెరీర్‌ కొనసాగించినంత కాలం నేను ఎక్కువగా ఫాలో అయ్యే ఒకే ఒక్క సామెత. మీరు మారకపోతే(పరిస్థితిని బట్టి అడ్జస్ట్‌ కాకపోతే).. ఆ మనిషినే మార్చడం’ అంటూ మార్పులు తప్పవనే సంకేతాలిచ్చాడు మెకల్లమ్‌. 

ఇక్కడ చదవండి: పెద్ద మనసు చాటుకున్న ఉనాద్కత్‌
స్వదేశానికి వెళ్లే మార్గాలను అన్వేషిస్తున్నాం: మ్యాక్సీ

మరిన్ని వార్తలు