Aakash Chopra: ఈరోజు మీ కథ ముగుస్తుంది.. ఆ జట్టుదే విజయం

13 Oct, 2021 10:37 IST|Sakshi

Aakash Chopra Prediction On Winner Of KKR Vs DC Match: క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌-2021 సీజన్‌ తుది అంకానికి చేరుకుంటోంది. క్వాలిఫైయర్‌-2కు అర్హత సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య బుధవారం రసవత్తరపోరు జరుగనుంది. షార్జా వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో కీలక మ్యాచ్‌లో విజేత గురించి టీమిండియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ కథ.. ఈసారి కనీసం ఫైనల్‌ చేరకుండానే ముగుస్తుందని జోస్యం చెప్పాడు.

ఈ మేరకు తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా ఆకాశ్‌ చోప్రా ఢిల్లీ ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడాడు. ‘‘ఈ మ్యాచ్‌లో కోల్‌కతా కచ్చితంగా విజయం సాధిస్తుంది. ఢిల్లీ పోరాటం నేటితో ముగిసిపోతుందనే భావిస్తున్నా. మీరు.. ఈరోజు మ్యాచ్‌ గెలవలేరు. గతంలో మాదిరే తప్పులు పునరావృతం చేస్తే... నేడే వీడ్కోలు పలకడం ఖాయం. ఏ రోజైతే మీరు 180 పరుగులు చేయలేకపోయారో.. రబడ అందుబాటులో ఉన్న నాడు కూడా మెరుగైన స్కోరును నిలబెట్టుకోలేపోయారో... ఆరోజే ఈ విషయం అర్థమైంది. షార్జా మీకు సూట్‌ అవ్వదు’’ అని ఘాటుగా విమర్శించాడు.

చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన క్వాలిఫైయర్‌-1 మ్యాచ్‌లో ఢిల్లీ సారథి పంత్‌ కెప్టెన్సీ తీరును ఈ సందర్భంగా ఆకాశ్‌ చోప్రా తప్పుబట్టాడు. ఇక నేటి(అక్టోబరు 13) మ్యాచ్‌లో స్పిన్నర్లు మెరుగ్గా రాణిస్తారని, ఇరు జట్ల నుంచి కనీసం ఐదు వికెట్లైనా పడగొడతారని ఆకాశ్‌ చోప్రా అంచనా వేశాడు. అదే విధంగా... ఎడమచేతి వాటం గల బ్యాటర్లు అత్యధిక పరుగులు సాధించే అవకాశం ఉందని, ఢిల్లీ ప్లేయర్లు శిఖర్‌ ధావన్‌, వెంకటేశ్‌ అయ్యర్‌లు మెరుగ్గా రాణిస్తారని భావిస్తున్నట్లు తెలిపాడు. కాగా క్వాలిఫైయర్‌-1 మ్యాచ్‌లో టేబుల్‌ టాపర్‌ ఢిల్లీ.. చెన్నై చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... ఆఖరి ఓవర్‌ కగిసో రబడతో వేయిస్తే... ఫలితం మరోలా ఉండేదని పలువురు మాజీలు డీసీ కెప్టెన్‌ పంత్‌ తీరును విమర్శించారు.

చదవండి: IPL 2021 Qualifier 2: మమ్మల్ని ఎవరైనా తేలికగా తీసుకుంటారా?

మరిన్ని వార్తలు