మోరిస్‌ మెరుపులు.. రాజస్తాన్‌ రాయల్స్‌ విజయం‌‌‌‌‌‌‌ | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ 2021: మోరిస్‌ మెరుపులు.. రాజస్తాన్‌ రాయల్స్‌ విజయం‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Published Thu, Apr 15 2021 7:04 PM

IPL 2021: DC VS RR Match Live Updates - Sakshi

మోరిస్‌ మెరుపులు.. రాజస్తాన్‌ రాయల్స్‌ విజయం
ఐపీఎల్‌ 14వ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది. వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఆఖర్లో ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ (18 బంతుల్లో 36 పరుగులు, 4సిక్సర్లతో) చెలరేగడంతో  ఆఖరి ఓవర్‌లో నాలుగో బంతికి విజయాన్ని అందుకుంది. ఉనాద్కట్‌ 11 పరుగులతో మోరిస్‌కు అండగా నిలిచాడు. అయితే 148 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో ఒక దశలో లక్ష్యాన్ని చేధిస్తుందా అన్న అనుమానం కలిగింది.

అయితే డేవిడ్‌ మిల్లర్‌( 43 బంతుల్లో 62, 7 ఫోర్లు, 2 సిక్సర్లు)  తనదైన శైలిలో చెలరేగాడు. అయితే మిల్లర్‌ అవుటైన తర్వాత మరోసారి ఆశలు వదిలుసుకున్న రాజస్తాన్‌ను మోరిస్‌ మెరుపులతో లీగ్‌లో తొలి విజయాన్ని అందించాడు.  ఢిల్లీ బౌలర్లో ఆవేశ్‌ ఖాన్‌ 3, వోక్స్‌ 2, రబాడ 2 వికెట్లు తీశారు.అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఢిల్లీ  బ్యాటింగ్‌లో రిషబ్‌ పంత్‌ 51 పరుగులు చేయగా.. టామ్‌ కరన్‌ 21, లలిత్‌ యాదవ్‌ 20 పరుగులు సాధించారు. రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్లలో ఉనాద్కట్‌ 3, ముస్తాఫిజుర్‌ 2, మోరిస్‌ ఒక వికెట్‌ తీశాడు. 

మిల్లర్‌ అవుట్‌.. ఏడో వికెట్‌ కోల్పోయిన రాజస్తాన్‌
రాజస్తాన్‌ రాయల్స్‌ డేవిడ్‌ మిల్లర్‌ రూపంలో ఏడో వికెట్‌ కోల్పోయింది. 62 పరుగులు చేసిన అతను ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో లలిత్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 148 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్స్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోగా.. మిల్లర్‌ మాత్రం దూకుడు కనబరిచాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిన మిల్లర్‌ ఔట్‌ కావడంతో రాయల్స్‌ విజయావకాశాలు క్లిష్టంగా మారాయి. ప్రస్తుతం రాయల్స్‌ 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. 

మిల్లర్‌ అర్థశతకం.. ఆర్‌ఆర్‌ 91/6
రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మిల్లర్‌ 40 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన దశలో మిల్లర్‌ అర్థ సెంచరీ సాధించడం విశేషం. మిల్లర్‌ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం రాజస్తాన్‌ 6 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది.

తెవాటియా ఔట్‌.. మరో వికెట్‌ డౌన్‌
148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ 90 పరుగుల వద్ద రాహుల్‌ తెవాటియా రూపంలో ఆరో వికెట్‌ కోల్పోయింది. రబాడ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌ ఐదో బంతిని ఆడిన తెవాటియా లలిత్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం మిల్లర్‌ 49, మోరిస్‌ 0 క్రీజులో ఉన్నారు.

13 ఓవర్లలో రాజస్తాన్‌ 72/5
13 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్‌ రాయల్స్‌ 5 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన తర్వాత మిల్లర్‌, తెవాటియాలు ఇన్నింగ్స్‌ను పునర్మిస్తున్నారు. ప్రస్తుతం మిల్లర్‌ 46, రాహుల్‌ తెవాటియా 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.

42 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆర్‌ఆర్
148 పరగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్‌ఆర్‌ జట్టు 42 పరుగలకే సగం వికెట్లు కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆవేశ్‌ ఖాన్‌ వేసిన 9.2 ఓవర్‌కు ధవన్‌ క్యాచ్‌ పట్టడంతో రియాన్‌ పరాగ్(5 బంతుల్లో 2)‌ పెవిలియన్‌ బాటపట్టాడు. 9.2 ఓవర్ల తర్వాత ఆర్‌ఆర్‌ స్కోర్‌ 42/5. క్రీజ్‌లో మిల్లర్‌(21), తెవాతియా(1) ఉన్నారు. 

రాజస్థాన్‌ నాలుగో వికెట్‌ డౌన్‌.. దూబే(2) ఔట్
రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. స్కోర్‌ 40 పరుగులు కూడా దాటకముందే నాలుగు వికెట్లు కోల్పోయి ఓటమి బాట పట్టేలా కనిపిస్తున్నారు. జట్టు స్కోర్‌ 36 పరుగుల వద్దనుండగా ఆవేశ్‌ ఖాన్‌... దూబేను(7 బంతుల్లో 2) బోల్తా కొట్టించాడు. స్లిప్‌లో ధవన్‌ అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో దూబే పెవిలియన్‌ బాటపట్టాడు. దీంతో 7.4 ఓవర్ల తర్వాత ఆర్‌ఆర్‌ స్కోర్‌ 36/4. క్రీజ్‌లో మిల్లర్‌(17) ,పరాగ్‌(0) ఉన్నారు.

ఆర్‌ఆర్‌కు షాక్‌.. సామ్సన్‌(4) ఔట్‌‌‌
13 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న రాజస్థాన్‌కు మరో షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ సామ్సన్‌ను రబాడ బోల్తా కొట్టించాడు. దీంతో నాలుగు పరుగుల వ్యవధిలో ఆర్‌ఆర్‌ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. 4వ ఓవర్‌ మూడో బంతికి ఫోర్‌ కొట్టి ఊపుమీదున్నట్లు కనిపించిన సామ్సన్‌(3 బంతుల్లో 4; ఫోర్‌) స్లిప్‌లో ఉన్న ధవన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాటపట్టాడు. 3.3 ఓవర్ల తర్వాత ఆర్‌ఆర్‌ స్కోర్‌ 17/3. క్రీజ్‌లో మిల్లర్‌(1), దూబే(0) ఉన్నారు.

బట్లర్‌(2) ఔట్..ఆర్‌ఆర్‌ రెండో వికెట్‌ డౌన్‌‌
2వ ఓవర్‌ నాలుగో బంతికి వోహ్రా వికెట్‌ పడగొట్టిన వోక్స్‌..ఆఖరి బంతికి బట్లర్‌ను(7 బంతుల్లో 2) కూడా పెవిలియన్‌కు పంపాడు. వోక్స్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ పంత్‌ అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో 13 పరుగుల వద్దే రాజస్థాన్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది. క్రీజ్‌లో సామ్సన్‌(0), మిల్లర్‌(0) ఉన్నారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన ఆర్‌ఆర్‌.. వోహ్రా(9) ఔట్
క్రిస్‌ వోక్స్‌ బౌలింగ్‌లో లాంగ్‌ ఆన్‌ ఫీల్డర్‌ రబాడ ​క్యాచ్‌ అందుకోవడంతో వోహ్రా(11 బంతుల్లో 9; 2 ఫోర్లు) పెవిలియన్‌ బాటపట్టాడు. 2.4 ఓవర్ల తర్వాత ఆర్‌ఆర్‌ స్కోర్‌ 13/1. క్రీజ్‌లో బట్లర్‌(2), సామ్సన్‌(0) ఉన్నారు.

ఢిల్లీ 147/8.. రాజస్థాన్‌ టార్గెట్‌ 148
చేతన్‌ సకారియా వేసిన ఆఖరి ఓవర్‌లో 11 పరుగులు రావడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోర్‌ను(147/8) సాధించగలిగింది. వోక్స్‌(11 బంతుల్లో 15; 2 ఫోర్లు), రబాడ(4 బంతుల్లో 9; ఫోర్‌) నాటౌట్‌గా నిలిచారు. రాజస్థాన్‌ బౌలర్లలో ఉనద్కత్‌ 3 వికెట్లు, ముస్తాఫిజుర్‌ 2, క్రిస్‌ మోరిస్‌ ఒక వికెట్‌ దక్కించుకోగా, ఇద్దరు రనౌటయ్యారు. 

అశ్విన్‌ రనౌట్‌‌(7).. ఢిల్లీ 136/8
19వ ఓవర్‌ ఆఖరి బంతికి అశ్విన్‌(4 బంతుల్లో 7; ఫోర్‌) రనౌట్‌గా వెనుదిరగడంతో ఢిల్లీ జట్టు ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది. 19 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్‌ 136/8. క్రీజ్‌లో వోక్స్‌(13), రబాడ(0) ఉన్నారు.

టామ్‌ కర్రన్‌ క్లీన్‌ బౌల్డ్‌(21).. ఢిల్లీ 128/7
ఫోర్‌ కొట్టి ఊపుమీదున్నట్టు కనిపించిన టామ్‌ కర్రన్‌ను‌(16 బంతుల్లో 21; 2 ఫోర్లు) ముస్తాఫిజుర్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 18.2 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్‌ 128/7. క్రీజ్‌లో వోక్స్‌(13), అశ్విన్‌(0) ఉన్నారు.‌‌‌‌‌

ఆరో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ.. లలిత్‌ యాదవ్‌(20) ఔట్‌‌‌‌‌
గౌరవప్రదమైన స్కోర్‌ సాధించాలనుకున్న ఢిల్లీ ఆశలు అడియాశలయ్యేలా కనిపిస్తున్నాయి. జట్టు స్కోర్‌ 100 పరుగులుండగా నిలకడగా ఆడుతున్న లలిత్‌ యాదవ్‌(24 బంతుల్లో 20; 3 ఫోర్లు) కూడా పెవిలియన్‌ బాటపట్టాడు. క్రిస్‌ మోరిస్‌ బౌలింగ్‌లో తెవాతియా క్యాచ్‌ అందుకోవడంతో లలిత్‌ యాదవ్‌ ఔటయ్యాడు. 14.5 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్‌ 100/6. క్రీజ్‌లో టామ్‌ కర్రన్‌(5 బంతుల్లో 8; ఫోర్‌), వోక్స్‌(0) ఉన్నారు.

పంత్‌‌(51) రనౌట్..ఢిల్లీ 88/5‌‌‌‌
హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన వెంటనే లేని పరుగు కోసం యత్నించిన పంత్‌(32 బంతుల్లో 51; 9 ఫోర్లు) తగిన మూల్యం చెల్లించుకున్నాడు. 12వ ఓవర్‌ నాలుగో బంతికి సింగల్‌ తీసేందుకు ప్రయత్నించిగా, రియాన్‌ పరాగ్‌ అద్భుతమైన త్రోతో వికెట్లకు గిరాటు వేయడంతో అతను పెవిలియన్‌ బాట పట్టాడు.‌‌‌‌ 12.4 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్‌ 88/5. క్రీజ్‌లో లలిత్‌ యాదవ్‌(19 బంతుల్లో 17; 3 ఫోర్లు), టామ్‌ కర్రన్‌(0) ఉన్నారు.

బౌండరీతో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న పంత్‌‌ ‌‌‌
కష్టాల్లో ఉన్న ఢిల్లీని ఆ జట్టు కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌(30 బంతుల్లో 50; 9 ఫోర్లు) హాఫ్‌ సెంచరీతో ఆదుకున్నాడు. బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేస్తూ ఆ జట్టు గౌరవప్రదమైన స్కోర్‌ సాధించేందకు కృషి చేస్తున్నాడు. అతనికి కొత్త కుర్రాడు లలిత్‌ యాదవ్‌(13 బంతుల్లో 12; 2 ఫోర్లు) తోడ్పాటునందించడంతో  12 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్‌ 85/4.

10 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్‌ 57/4
వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఢిల్లీ జట్టు మరో పొరపాటు చేయకుండా ఆచితూచి ఆడుతుంది. ఆ జట్టు కెప్టెన్‌ పంత్‌(19 బంతుల్లో 24; 4 ఫోర్లు), కొత్త కుర్రాడు లలిత్‌ యాదవ్‌(11 బంతుల్లో 10; 2 ఫోర్లు)లు సింగల్స్‌ తీస్తూ స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ స్కోర్‌ బోర్డును ముందుకు కదిలిస్తున్నారు. దీంతో 10 ఓవర్ల తర్వాత ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది.

స్టొయినిస్‌ డకౌట్‌.. ఢిల్లీ 37/4
ఢిల్లీ జట్టుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆదుకుంటాడనుకున్న ఆల్‌రౌండర్‌ స్టొయినిస్‌ డకౌట్‌గా వెనుదిరగడంతో ఢిల్లీకి కోలుకోలేని దెబ్బతగిలింది. ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో బట్లర్‌ అద్భుతమైన రన్నింగ్‌ క్యాచ్‌ అందుకోవడంతో స్టొయినిస్‌ పెవిలియన్‌ బాట పట్టాడు.  7 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్‌ 37/4. క్రీజ్‌లో పంత్‌(12 బంతుల్లో 16; 3 ఫోర్లు), లలిత్‌ యాదవ్‌(0) ఉన్నారు.

ఉనద్కత్‌కు మూడో వికెట్‌.. రహానే(8) ఔట్‌
ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఢిల్లీని ఉనద్కత్‌ మరో దెబ్బకొట్టాడు. నిలకడగా ఆడతాడనుకున్న రహానేని(8 బంతుల్లో 8; ఫోర్‌) పెవిలియన్‌కు పంపాడు. ఉనద్కత్‌ బౌలింగ్‌లో అతనే రివర్స్‌ క్యాచ్‌ అందుకోడంతో రహానే ఇన్నింగ్స్‌కు తెరపడింది. 6 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్‌ 36/3. క్రీజ్‌లో పంత్‌(11 బంతుల్లో 15; 3 ఫోర్లు), స్టొయినిస్‌(0) ఉన్నారు.

ఢిల్లీ రెండో వికెట్‌ డౌన్‌.. ధవన్‌(9) ఔట్‌
రెండో ఓవర్‌ ఆఖరి బంతికి పృథ్వీషాను పెవిలియన్‌కు పంపిన ఉనద్కత్‌ తాను వేసిన మరుసటి ఓవర్‌(4వ ఓవర్‌) తొలి బంతికే ధవన్‌ను కూడా బోల్తా కొట్టించాడు.‌ రివర్స్‌ స్కూప్‌ షాట్‌ ఆడే క్రమంలో వికెట్‌ కీపర్‌ సామ్సన్‌ అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో ధవన్‌ పెవిలియన్‌ బాటపట్టాడు. 4 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్‌ 20/2. క్రీజ్‌లో పంత్‌(5 బంతుల్లో 4; ఫోర్‌), రహానే(3 బంతుల్లో 5; ఫోర్‌) ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ.. పృథ్వీషా(2) ఔట్
తొలి మ్యాచ్‌లో మెరుపు అర్ధశతకం సాధించిన పృథ్వీషా(5 బంతుల్లో 2).. ఈ మ్యాచ్‌లో రెండు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. 2వ ఓవర్‌ ఆఖరి బంతికి ఉనద్కత్‌ బౌలింగ్‌లో లీడింగ్‌ ఎడ్జ్‌ తీసుకోవడంతో మిల్లర్‌కు సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 2 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్‌ 5/1. క్రీజ్‌లో ధవన్‌(7 బంతుల్లో 3), రహానే(0) ఉన్నారు.

ముంబై: ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా గురువారం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు హోరాహోరిపోరుకు సిద్ధమయ్యాయి. తమ తొలి మ్యాచ్‌‌లో చెన్నై సూపర్ కింగ్స్ లాంటి పటిష్ట జట్టుని చిత్తు చేసి ఊపుమీదున్న ఢిల్లీ.. ఈ మ్యాచ్‌లో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. క్వారంటైన్ కారణంగా తొలి మ్యాచ్‌కి దూరమైన దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రావడం ఢిల్లీకి కలిసొచ్చే అంశం. మరోవైపు పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో గెలుపు వాకిట నిలిచిపోయిన రాజస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమవ్వడం, ఆ జట్టు విజయావకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే ఇరు జట్లలో టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్‌లు ఉండటం, వాంఖడే బౌండరీ మరీ చిన్నదిగా ఉండడంతో ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.

ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ ఢిల్లీ, రాజస్థాన్ జట్లు 22 మ్యాచ్‌ల్లో తలపడగా.. చెరో 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. అయితే.. 2019 నుంచి రాజస్థాన్‌తో నాలుగు మ్యాచ్‌ల్లో తలపడిన ఢిల్లీ.. నాలిగింటిలోనూ గెలుపొందడం విశేషం. ఢిల్లీపై రాజస్థాన్ అత్యధిక స్కోరు 201 పరుగులుకాగా.. రాజస్థాన్‌పై ఢిల్లీ చేసిన అత్యధిక స్కోరు 196 పరుగులు. ఇక జట్ల బలాబలాల విషయానికొస్తే... ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓపెనర్లు శిఖర్ ధవన్, పృథ్వీ షా సూపర్ ఫామ్‌లో ఉండగా.. షిమ్రోన్‌ హెట్మేయర్, రిషబ్ పంత్‌లకు తొలి మ్యాచ్‌లో పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ రహానే, ఆల్‌రౌండర్‌ స్టొయినిస్ కూడా మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. బౌలింగ్ విభాగానికొస్తే.. క్రిస్‌వోక్స్, అవేష్ ఖాన్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొడుతుండగా, సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, అమిత్ మిశ్రాలు తొలి మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం ఆ జట్టును కలవరపెడుతోంది. క్వారంటైన్ కారణంగా తొలి మ్యాచ్‌కి దూరమైన రబాడ.. ఈ మ్యాచ్‌లో రీఎంట్రీ ఇస్తే, టామ్ కర్రన్‌పై వేటు పడే అవకాశం ఉంది.

మరోవైపు రాజస్థాన్ జట్టులో కెప్టెన్ సంజు సామ్సన్ తొలి మ్యాచ్‌లో సెంచరీ సాధించి మంచి జోష్‌మీదున్నాడు. తొలి మ్యాచ్‌లో డకౌటైన బెన్‌స్టోక్స్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమవగా, అతని స్థానంలో జోస్ బట్లర్ ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది. యువ హిట్టర్ రియాన్ పరాగ్ బెరుకు లేకుండా హిట్టింగ్ చేస్తుండటం ఆ జట్టుకి కలిసొచ్చే అంశం. ఇక మనన్ వోహ్రా, శివమ్ దూబే, రాహుల్ తెవాతియా నిలకడగా పరుగులు సాధిస్తే ప్రత్యర్ధికి కష్టాలు తప్పకపోవచ్చు. బౌలింగ్ విభాగంలో యువ పేసర్ సకారియా తొలి మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టి మంచి ఫామ్‌లో ఉండగా, ఆల్‌రౌండర్ క్రిస్‌ మోరీస్, ముస్తాఫిజుర్, శ్రేయాస్ గోపాల్‌లు అంచనాల్ని అందుకోలేకపోయారు. 

జట్ల వివరాలు:

ఢిల్లీ క్యాపిటల్స్‌: రిషబ్‌ పంత్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), శిఖర్ ధవన్, పృథ్వీ షా, అజింక్య రహానె, మార్కస్ స్టోయినిస్, క్రిస్ వోక్స్, రవిచంద్రన్ అశ్విన్, టామ్‌ కరన్‌, రబాడ, లలిత్‌ యాదవ్‌, అవేష్ ఖాన్

రాజస్తాన్‌ రాయల్స్‌: జోస్‌ బట్లర్‌, మనన్‌ వోహ్రా, డేవిడ్‌ మిల్లర్‌‌, సంజూ సామ్సన్‌(కెప్టెన్‌)‌, రియాన్‌ పరాగ్‌, శివమ్‌ దూబే, రాహుల్‌ తెవాతియా, క్రిస్‌ మోరిస్‌, ఉనద్కత్‌‌, చేతన్‌ సకారియా, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement