IPL 2023 Jay Shah Tweet On Yashasvi Jaiswal Viral Goes Viral, Know His Inspirational Life Story - Sakshi
Sakshi News home page

#Yashasvi Jaiswal Biography: చిన్నపుడే అష్టకష్టాలు పడ్డాడు.. ఇప్పుడు రికార్డులు సృష్టిస్తూ! టీమిండియా ఎంట్రీ ఖాయం! జై షా ట్వీట్‌ వైరల్‌

Published Fri, May 12 2023 1:10 PM

IPL 2023 Jay Shah Tweet On Yashasvi Jaiswal Viral Know His Life Story - Sakshi

IPL 2023 KKR vs RR- Yashasvi Jaiswal: రాజస్తాన్‌ రాయల్స్‌ యువ ఓపెనర్‌, ముంబై బ్యాటర్‌ యశస్వి జైశ్వాల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగంగా అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ ఉత్తరప్రదేశ్‌ కుర్రాడిని ఆకాశానికెత్తేస్తున్నారు క్రీడా ప్రముఖులు. ఐపీఎల్‌-2023లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో 13 బంతుల్లోనే 50 పరుగుల మార్కు అందుకున్న యశస్వి బ్యాటింగ్‌కు ఫిదా అయిన టీమిండియా స్టార్లు విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ అద్భుత ఇన్నింగ్స్‌ చూశామంటూ కొనియాడారు.

జై షా ట్వీట్‌ వైరల్‌
ఈ క్రమంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా యశస్విని అభినందిస్తూ చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘యువ క్రికెటర్‌ యశస్వి జైశ్వాల్‌ ప్రత్యేకమైన ఇన్నింగ్స్‌.. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ. ఆట పట్ల అతడి అంకితభావం అమోఘం.

సరికొత్త చరిత్ర సృష్టించినందుకు అభినందనలు. భవిష్యత్తులోనూ ఈ సూపర్‌ ఫామ్‌ ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నా’’ అని జై షా పేర్కొన్నాడు. ఇక ఇందుకు స్పందించిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

రోహిత్‌ వద్దు.. అతడే ముద్దు
వన్డే ప్రపంచకప్‌-2023 ఆడే జట్టుకు యశస్విని ఎంపిక చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ‘‘ఓపెనర్‌గా రోహిత్‌ శర్మను తప్పించాల్సిన సమయం ఆసన్నమైంది. కేఎల్‌ రాహుల్‌తో కూడా పెద్దగా ఉపయోగం లేనట్లు కనిపిస్తోంది. ఇక కోహ్లి అంటే మాకు ఇష్టమే. ఓపెనర్‌గానూ అతడు రాణించగలడు. 

కానీ ఈసారి మనం వన్డే వరల్డ్‌కప్‌ గెలవాలన్నా.. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీ సాధించాలన్నా ఇలాంటి మెరికల్లాంటి కుర్రాళ్లను జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా యశస్వి ప్రతిభను గుర్తించి అతడిని భారత జట్టుకు ఎంపిక చేయండి’’ అని జై షాను కోరుతున్నారు.

గిల్‌తో పాటు యశస్వి
పుష్కర కాలం తర్వాత భారత్‌లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌ ఈవెంట్‌లో యశస్వి జైశ్వాల్‌- శుబ్‌మన్‌ గిల్‌ ఓపెనింగ్‌ జోడీగా దిగితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. యశస్వి టీమిండియాలో చోటుకు నూరుశాతం అర్హుడు అని.. ఇప్పటికే దేశవాళీ క్రికెట్‌, ఐపీఎల్‌లోనూ నిరూపించుకున్నాడని.. అతడికి ఇకనైనా న్యాయం చేయాలంటూ సోషల్‌ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. 

చిన్నపుడే అష్టకష్టాలు పడి.. ఇప్పుడు టీమిండియా ముంగిట
2001.. డిసెంబరు 28న యూపీలోని సూరియాలో సాధారణ కుటుంబంలో జన్మించిన యశస్వి.. క్రికెటర్‌ కావాలని కలలు కన్నాడు. పదేళ్ల వయసులో ముంబైకి షిఫ్ట్‌ అయిన యశస్వి.. ఆజాద్‌ మైదాన్‌లో ట్రెయినింగ్‌ చేశాడు. 

ఓ డైరీ షాపు(పాల ఉత్పత్తులు అమ్మే షాపు)లో అకామిడేషన్‌ పొందిన ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌.. సరిగా పనిచేయడం లేదన్న కారణంగా ఉన్న ఈ కాస్త ఆసరాను కోల్పోయాడు. ఈ క్రమంలో ఆజాద్‌ మైదాన్‌ గ్రౌండ్స్‌మెన్‌తో కలిసి టెంట్లలో నివాసం ఉంటూ పానీపూరీ అమ్మే వాళ్లకు సాయం చేస్తూ జీవనాధారం పొందేవాడు.

రాత మారింది
అలా కాలం వెళ్లదీస్తున్న యశస్వికి 2013లో క్రికెట్‌ కోచ్‌ జ్వాలా సింగ్‌ రూపంలో అదృష్టం తలుపు తట్టింది. యశస్వికి లీగల్‌ గార్డియన్‌గా ఉంటూ ప్రతిభను నిరూపించుకునే అవకాశం కల్పించారు జ్వాలా సింగ్‌. 

ఈ క్రమంలో జ్వాలా సింగ్‌ సహాయంతో అంచెలంచెలుగా ఎదిగిన యశస్వి జైశ్వాల్‌ 2019, జనవరిలో ముంబై తరఫున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. అదే ఏడాది సెప్టెంబరులో లిస్ట్‌ ఏ క్రికెట్‌లోనూ అడుగుపెట్టాడు. అప్పటి నుంచి అతడు వెనుదిరిగి చూసుకోలేదు.

ఐపీఎల్‌తో మరో మలుపు
లిస్ట్‌ ఏ క్రికెట్‌లో డబుల్‌ సెంచరీ బాదిన అతిపిన్న వయస్కుడైన క్రికెటర్‌(17 ఏళ్ల 292 రోజులు)గా చరిత్రకెక్కిన యశస్వి.. అండర్‌-19 ఆసియా కప్‌లో తొలిసారి భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌-2020 వేలం సందర్భంగా అతడిని కొనుగోలు చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ వరుస అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తోంది.

యశస్వి కూడా మేనేజ్‌మెంట్‌ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రికార్డుల రికార్డులు సాధిస్తూ జట్టు విజయాలకు ఉపయోగపడే ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. తాజాగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌లో 47 బంతుల్లో 98 పరుగులు చేసిన యశస్వి.. రాజస్తాన్‌ను గెలిపించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇప్పటికే ఐపీఎల్‌-2023లో ఓ సెంచరీ బాదిన అతడు మరో శతకానికి కేవలం రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: WC Qualifier 2023: జట్టును ప్రకటించిన వెస్టిండీస్‌.. విధ్వంసకర ఆటగాడికి నో ఛాన్స్‌
రనౌట్‌ విషయంలో సంజూ భాయ్‌ నాతో ఏమన్నాడంటే: యశస్వి జైశ్వాల్‌

Advertisement
Advertisement