ప్లే ఆఫ్స్‌ చేరడం సంతోషం! అతడు క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి వణికిపోవాల్సిందే! అద్భుతం..

21 May, 2023 09:12 IST|Sakshi
ఐపీఎల్‌-2023 ప్లే ఆఫ్స్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ (PC: IPL/LSG)

IPL 2023 KKR Vs LSG- LSG qualify for the playoffs: ‘‘సంతృప్తిగా ఉంది. తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయిన సమయంలోనూ మా ఆటగాళ్లు రాణించారు. మేమెప్పుడూ సానుకూల దృక్పథంతోనే ఉంటాం. క్లిష్ట పరిస్థితుల్లోనూ పోరాట పటిమ కనబరుస్తాం. నిజానికి ఒక దశలో వాళ్ల స్కోరు 61/1. 

అయినప్పటికీ.. ఇంకో 2-3 ఓవర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తే మేము పోటీలో ఉంటామని భావించాను. అదే సమయంలో స్పిన్నర్లకు కాస్త పట్టు దొరికింది. అది మాకు అనుకూలించింది’’ అని లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ కృనాల్‌ పాండ్యా సంతోషం వ్యక్తం చేశాడు. తమ జట్టు ప్లే ఆఫ్స్‌ చేరడం సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు.

వరుసగా రెండో ఏడాది ప్లే ఆఫ్స్‌లో లక్నో
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో శనివారం నాటి ఉత్కంఠ పోరులో లక్నో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా ఐపీఎల్‌-2023 ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించింది. వరుసగా రెండో ఏడాది టాప్‌-4లో నిలిచి సత్తా చాటింది. 

పూరన్‌ అర్ధ శతకంతో..
ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కోల్‌కతా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కేకేఆర్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన లక్నో నికోలస్‌ పూరన్‌ అద్భుత అర్థ శతకం కారణంగా మెరుగైన స్కోరు సాధించింది.

నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్‌కు ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌(45) శుభారంభం అందించాడు. మరో ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ (24) సైతం మెరుగ్గా రాణించాడు.

రింకూ మరోసారి
ఈ క్రమంలో వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ నితీశ్‌ రాణా (8), ఆ తర్వాతి స్థానంలో వచ్చిన రహ్మనుల్లా గుర్బాజ్‌ (10) వెంట వెంటనే అవుటయ్యారు. మిగతా బ్యాటర్లు సైతం పెవిలియన్‌కు క్యూ కట్టగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రింకూ సింగ్‌ ఒంటరి పోరాటం చేశాడు. 

ఓవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం బెరుకు లేకుండా బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. రింకూ విజృంభణ చూస్తే కేకేఆర్‌ విజయం సాధ్యమే అనిపించింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో 21 పరుగులు అవసరమైన తరుణంలో లక్నో బౌలర్‌ యశ్‌ ఠాకూర్‌ పూర్తిగా ఒత్తిడిలో కూరుకుపోయాడు.

నరాలు తెగే ఉత్కంఠ
అతడి బౌలింగ్‌లో తొలి బంతికి 1 పరుగు రాగా, రెండో బంతి వైడ్‌ వెళ్లగా ఆ తర్వాతి రెండు బంతుల్లో పరుగులు రాలేదు. కానీ యశ్‌ మరోసారి వైడ్‌ వేశాడు. దీంతో ఆఖరి మూడు బంతుల్లో 18 పరుగులు చేయాల్సి ఉండగా.. రింకూ వరుసగా సిక్స్‌, ఫోర్‌, సిక్స్‌ కొట్టాడు. కానీ కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయాడు. గెలుపునకు ఒక్క అడుగు దూరంలో కేకేఆర్‌ నిలిచిపోగా.. లక్నో ప్లే ఆఫ్స్‌నకు దూసుకెళ్లింది.

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం లక్నో సారథి కృనాల్‌ పాండ్యా మాట్లాడుతూ.. రింకూను ప్రశంసించాడు. ‘‘ఈ ఏడాది రింకూకు స్పెషల్‌. ప్రతీ మ్యాచ్‌లోనూ అతడు అద్భుతంగా ఆడాడు. అతడు క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి అలర్ట్‌ కావాల్సిందే.

కావాలనే అతడికి బంతినిచ్చా
ఈరోజు కూడా రింకూ మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టాడు’’ అని పేర్కొన్నాడు. ఇక ఆఖరి ఓవరల్లో యశ్‌ ఠాకూర్‌కు బంతినివ్వడాన్ని సమర్థించుకున్న కృనాల్‌.. ‘‘డెత్‌ ఓవర్లలో మప ప్రణాళికలు పక్కాగా అమలు చేయాలని ముందే బౌలర్లకు చెప్పాను. ప్రతీ బంతికి వాళ్లతో చర్చించాను. 

ఇక ఆఖర్లో యశ్‌ ఠాకూర్‌కు బంతినివ్వాలని నేను నిర్ణయం తీసుకున్నా. గత మ్యాచ్‌లో రివర్స్‌ సింగ్‌ ఎక్కువగా ఉంది కాబట్టి మొహిసిన్‌ను రంగంలోకి దింపాను. కోల్‌కతా వికెట్‌ కాస్త స్లోగా ఉంది. అందుకే ఏదైతే అది అయిందని రిస్క్‌ చేసి మరీ యశ్‌కు బంతినిచ్చాను’’ అని తెలిపాడు. 

చదవండి: నిలకడకు నిలువుటద్దం.. ఆడిన 14 సీజన్లలో 12సార్లు ప్లేఆఫ్స్‌కు
జడేజాపై సీరియస్‌ అయిన ధోని!
ఇది క్రికెట్‌ షోనా? లేదంటే.. అర్ధ నగ్న ఫొటోలు చూపిస్తూ..! సిగ్గుండాలి!

మరిన్ని వార్తలు