IPL 2023: Warner rubs it in SRH's face with insane celebration, hurls a mouthful - Sakshi
Sakshi News home page

తనను అవమానించిన సన్‌రైజర్స్‌పై ప్రతీకారం తీర్చుకున్న వార్నర్‌.. ఆ కసి చూడండి..!

Published Tue, Apr 25 2023 11:02 AM

IPL 2023: Warner Insane Celebration After DC Beat Hyderabad - Sakshi

అవమానకర రీతిలో తనను జట్టు నుంచి సాగనంపిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీపై ఢిల్లీ క్యాపిటల్స్‌ సారధి డేవిడ్‌ వార్నర్‌ ప్రతీకారం తీర్చుకున్నాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 24) జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టుపై విజయం సాధించడం​ ద్వారా ఏడాది కాలంగా లోలోపల తనను దహించివేస్తున్న మంటను చల్లార్చుకున్నాడు. విజయానంతరం వార్నర్‌ చేసుకున్న సంబరాలను చూస్తే, అతనిలో సన్‌రైజర్స్‌పై గెలవాలన్న కసి ఏ రేంజ్‌లో ఉండిందో ఇట్టే స్పష్టమవుతుంది.

డీసీ విజయం సాధించగానే, వార్నర్‌ గాల్లోకి ఎగురుతూ గంతులు వేశాడు. విజయ గర్వంతో ఊగిపోయాడు. తనతోనే డ్రింక్స్‌ మోయిస్తారా.. మీకు ఎలా బుద్ధిచెప్పానో చూడండి అన్న అర్ధం వచ్చేలా ఎక్స్‌ప్రెషన్స్‌ పెట్టాడు. తమ ఆటగాళ్లతో గ్రౌండ్‌ మొత్తం​ కలియతిరుగుతూ నానా హంగామా చేశాడు. ప్రస్తుత సీజన్‌లో వార్నర్‌ నాయకత్వంలో డీసీ గెలిచింది కేవలం రెండో మ్యాచే అయినప్పటికీ, ఏదో టైటిల్‌ సాధించానన్నట్లుగా బిల్డప్‌ ఇచ్చాడు.

తగ్గేదేలే అంటూ పుష్పలా ఫోటోలకు పోజులిచ్చాడు. వార్నర్‌ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.  వార్నర్‌ హడావుడిని కొందరు తప్పుబడుతుంటే, మరికొందరు అతను ఈ సెలబ్రేషన్స్‌కు అర్హుడేనంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, 2016లో సన్‌రైజర్స్‌కు టైటిల్‌ను అందించిన వార్నర్‌ను, ఆ జట్టు యాజమాన్యం కెప్టెన్సీ నుంచి పీకేసి, తుది జట్టులో ఆడనీయకుండా, డ్రింక్స్‌ మోపించి పలు రకాలుగా అవమానించింది. 

ఇదిలా ఉంటే, సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ.. వార్నర్‌ (21), మిచెల్‌ మార్ష్‌ (25), మనీశ్‌పాండే (34), అక్షర్‌ పటేల్‌ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ 3, భువనేశ్వర్‌ 2, నటరాజన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

కష్టసాధ్యంకాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌.. ఇషాంత్‌ శర్మ (1/18), నోర్జే (2/33), ముకేశ్‌ (0/27), అక్షర్‌ (2/21), కుల్దీప్‌ (1/22) ధాటికి చతికిలపడింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది.మయాంక్‌ అగర్వాల్‌ (49) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ముకేశ్‌ కుమార్‌ ఆఖరి ఓవర్‌ అద్భుతంగా వేసి, సన్‌రైజర్స్‌ గెలుపును అడ్డుకున్నాడు.

Advertisement
Advertisement