Sakshi News home page

IPL 2024: చెన్నై చెలరేగింది

Published Tue, Apr 9 2024 5:13 AM

IPL 2024: Chennai Super Kings won by 7 wickets against Kolkata Knight Riders - Sakshi

కూల్చేసిన తుషార్, జడేజా

రాణించిన రుతురాజ్‌

7 వికెట్లతో కోల్‌కతాపై జయభేరి  

చెన్నై: ఈ సీజన్‌లో భారీ స్కోర్లతో, హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకెళ్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై చెన్నై సూపర్‌కింగ్స్‌ చెలరేగింది. సోమవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో చెన్నై ఆల్‌రౌండ్‌ షో ముందు నైట్‌రైడర్స్‌ చేతులెత్తేసింది. దీంతో సూపర్‌కింగ్స్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది.

కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (33 బంతుల్లో 34; 3 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌! సూపర్‌కింగ్స్‌ బౌలర్లు రవీంద్ర జడేజా (3/18), తుషార్‌ దేశ్‌పాండే (3/33), ముస్తఫిజుర్‌ (2/22) మూకుమ్మడిగా వికెట్లను పడేశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసి గెలిచింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (58 బంతుల్లో 67 నాటౌట్‌; 9 ఫోర్లు) రాణించగా, శివమ్‌ దూబే (18 బంతుల్లో 28; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరిపించాడు.  

కోల్‌కతా విలవిల...
నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి ఆఖరిదాకా కష్టాలతోనే సాగింది. తుషార్‌ ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌ తొలి బంతికే ఫిల్‌ సాల్ట్‌ (0) డకౌటయ్యాడు. ఓపెనర్‌గా చెలరేగిపోతున్న సునీల్‌ నరైన్‌ (20 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రఘువంశీ (18 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి కాసేపు ధాటిగా ఆడారంతే! పవర్‌ప్లేలో జట్టు 56/1 స్కోరు చేసింది. ఇక్కడిదాకా బాగానే ఉన్నా... జడేజా బౌలింగ్‌కు దిగడంతో కోల్‌కతా కష్టాల పాలైంది.

తన తొలి ఓవర్లో (ఇన్నింగ్స్‌ 7వ) వాళ్లిద్దర్నీ అవుట్‌ చేసిన జడేజా మరుసటి ఓవర్లో వెంకటేశ్‌ అయ్యర్‌ (3)ను పెవిలియన్‌ చేర్చాడు. 64 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. రమణ్‌దీప్‌ (13) ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. శ్రేయస్‌ చేసిన ఆమాత్రం స్కోరుతో కష్టంగా వంద పరుగులు దాటింది. తర్వాత తుషార్‌ దెబ్బకు కోల్‌కతా కుదేలైంది. హిట్టర్లు రింకూ సింగ్‌ (9), రసెల్‌ (10)లను అవుట్‌ చేయడంతో స్కోరులో జోరుకు ఆస్కారమే
లేకపోయింది.

రుతురాజ్‌ అర్ధసెంచరీ
సులువైన లక్ష్యం కావడంతో హిట్టింగ్‌ ఓపెనర్‌ రచిన్‌ రవీంద్ర (8 బంతుల్లో 15; 3 ఫోర్లు) ఆరంభంలోనే అవుటైనా చెన్నై దూకుడుకు ఢోకా లేకపోయింది. రుతురాజ్, మిచెల్‌ (19 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్‌)తో కలిసి ఇన్నింగ్స్‌ను సాఫీగా నడిపించారు. తొలి సగం (10) ఓవర్లలో 81/1 స్కోరు చేసింది. రుతురాజ్‌ 45 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, మిచెల్‌ను అవుట్‌ చేయడం ద్వారా నరైన్‌ ఈ జోడీని విడగొట్టాడు. దీంతో రెండో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా క్రీజులోకి వచ్చిన శివమ్‌ దూబే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. లక్ష్యానికి చేరువలో దూబే బౌల్డవగా లాంఛనాన్ని ధోని (1 నాటౌట్‌), రుతురాజ్‌ ముగించారు.  

స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) జడేజా (బి) తుషార్‌ 0; నరైన్‌ (సి) తీక్షణ (బి) జడేజా 27; రఘువంశీ (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 24; శ్రేయస్‌ (సి) జడేజా (బి) ముస్తఫిజుర్‌ 34; వెంకటేశ్‌ (సి) మిచెల్‌ (బి) జడేజా 3; రమణ్‌దీప్‌ (బి) తీక్షణ 13; రింకూ (బి) తుషార్‌ 9; రసెల్‌ (సి) మిచెల్‌ (బి) తుషార్‌ 10; అనుకుల్‌ (నాటౌట్‌) 3; స్టార్క్‌ (సి) రవీంద్ర (బి) ముస్తఫిజుర్‌ 0; వైభవ్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 137.
వికెట్ల పతనం: 1–0, 2–56, 3–60, 4–64, 5–85, 6–112, 7–127, 8–135, 9–135.
బౌలింగ్‌ : తుషార్‌ 4–0–33–3, ముస్తఫిజుర్‌ 4–0 –22–2, శార్దుల్‌ 3–0–27–0, తీక్షణ 4–0–28–1, జడేజా 4–0–18–3, రచిన్‌ 1–0–4–0.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రచిన్‌ (సి) వరుణ్‌ (బి) వైభవ్‌ 15; రుతురాజ్‌ (నాటౌట్‌) 67; మిచెల్‌ (బి) నరైన్‌ 25; దూబే (బి) వైభవ్‌ 28; ధోని (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (17.4 ఓవర్లలో 3 వికెట్లకు) 141.
వికెట్ల పతనం: 1–27, 2–97, 3–135.
బౌలింగ్‌: స్టార్క్‌ 3–0–29–0, వైభవ్‌   4–0–28–2, అనుకుల్‌ 1.4–0– 18–0,  నరైన్‌ 4–0–30–1, వరుణ్‌ చక్రవర్తి 4–0– 26–0, రసెల్‌ 1–0–8–0.

Advertisement
Advertisement