Sakshi News home page

#Rinku Singh: నేనేమైనా తక్కువా?.. ఒకే ఓవర్లో రింకూ సిక్సర్ల వర్షం

Published Thu, Apr 4 2024 11:18 AM

IPL 2024, DC Vs KKR: Rinku Singh Hits 3 Sixes In An Over Against Nortje [Watch] - Sakshi

ఐపీఎల్‌-2024.. విశాఖ సాగర తీరాన.. బుధవారం రాత్రి.. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్టేడియం.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బ్యాటర్ల పరుగుల వరదతో తడిసి ముద్దైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లపై ఏమాత్రం కనికరం లేకుండా కేకేఆర్‌ ఆటగాళ్లు విరుచుకుపడ్డారు.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న తమ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ నమ్మకాన్ని నిలబెడుతూ.. ఓపెనర్‌ సునిల్‌ నరైన్‌ మరోసారి వీర బాదుడు బాదాడు. 35 ఏళ్ల ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు.

కేవలం 39 బంతుల్లోనే 85 పరుగులు(7 ఫోర్లు, 7 సిక్సర్లు) సాధించి నరైన్‌ సత్తా చాటాడు. ఇక తన తొలి ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌లోనే వన్‌డౌన్‌ బ్యాటర్‌ అంగ్‌క్రిష్‌ రఘువంశీ(27 బంతుల్లో 54) సైతం ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు.

ఇక నాలుగో స్థానంలో వచ్చిన పవర్‌ హిట్టర్‌ ఆండ్రీ రసెల్‌ సరేసరి. 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 41 రన్స్‌ చేశాడు. మరి ఈ ముగ్గురు పరుగుల విధ్వంసం సృష్టిస్తుంటే.. తానేమీ తక్కువ కాదన్నట్లు చెలరేగిపోయాడు సిక్సర్ల కింగ్‌ రింకూ సింగ్‌.

ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ యూపీ సంచలనం.. ఈ పరుగుల విధ్వంసంలో తనదైన ముద్ర వేశాడు. కేవలం 8 బంతులు ఎదుర్కొని 26(ఒక ఫోర్‌, 3 సిక్సర్లు) పరుగులు సాధించాడు. తన ఇన్నింగ్స్‌లోని మూడు సిక్సర్లను అన్రిచ్‌ నోర్జే బౌలింగ్‌లోనే బాదడం విశేషం.

పందొమ్మిదో ఓవర్‌లో సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్‌ నోర్జే వేసిన తొలి రెండు బంతులను సిక్సర్‌గా మలిచిన రింకూ సింగ్‌.. మధ్యలో బాల్‌కు గ్యాప్‌ ఇచ్చాడు. ఆ తర్వాత నాలుగో బంతికి మరో భారీ షాట్‌తో ఆరు పరుగులు పిండుకున్నాడు. ఇక ఆ మరుసటి బంతిని బౌండరీకి తరలించాడు.

అయితే, అదే ఓవర్లో ఆఖరి బంతి(లో ఫుల్‌ టాస్‌)కి మరోసారి షాట్‌కు యత్నించిన రింకూ.. వార్నర్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఉన్నది కాసేపే అయినా.. విశాఖ స్టేడియంలోని ప్రేక్షకులకు తన వంతు వినోదం అందించాడు రింకూ!! 

ఢిల్లీకి నాలుగో ఓటమి
ఇక ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ విధించిన 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఢిల్లీ క్యాపిటల్స్‌ చతికిలపడిన విషయం తెలిసిందే. తమకు రెండో హోం గ్రౌండ్‌ అయిన విశాఖలో ఏకంగా 106 పరుగుల తేడాతో ఓడి.. ఐపీఎల్‌-2024లో నాలుగో పరాజయాన్ని నమోదు చేసింది. ఇక అంతకు ముందు ఇదే వేదికపై పంత్‌ సేన చెన్నై సూపర్‌ కింగ్స్‌పై గెలిచిన విషయం తెలిసిందే. అలా ఢిల్లీకి ఇప్పటి వరకు ఒక్క విజయం దక్కింది.

చదవండి: తొలి ఇన్నింగ్స్‌లోనే పరుగుల విధ్వంసం.. ఎవరీ అంగ్‌క్రిష్‌ రఘువంశీ? 

Advertisement
Advertisement