నరాలు తెగే ఉత్కంఠ: ఆఖరి ఓవర్‌లో ‘భయపెట్టిన’ ఉనాద్కట్‌! వీడియో | Sakshi
Sakshi News home page

#SRHvsPBKS: నరాలు తెగే ఉత్కంఠ: ఆఖరి బంతి వరకు ‘భయపెట్టిన’ ఉనాద్కట్‌!

Published Wed, Apr 10 2024 8:46 AM

IPL 2024 Dropped 26 runs Relive SRH Unadkat Dramatic Last Thrilling Over Video - Sakshi

ఆఖరి ఓవర్‌.. మ్యాచ్‌ గెలవాలంటే ఆరు బంతుల్లో 29 పరుగులు కావాలి.. ఇదీ సమీకరణం.. ఇంతలో బరిలోకి దిగిన ప్రత్యర్థి జట్టు బౌలర్‌.. విజయావకాశం మీకే అన్నట్లుగా.. మొదటి బంతికే సిక్సర్‌.. 

ఆ తర్వాత వైడ్‌.. మళ్లీ వైడ్‌.. ఇప్పుడు గెలుపు సమీకరణం ఐదు బంతుల్లో 21 పరుగులు... ఫీల్డర్‌ తప్పిదం కారణంగా మళ్లీ సిక్సర్‌.. ఆ తర్వాత బంతికి రెండు పరుగులు... ఫలితంగా గెలుపు సమీకరణం మూడు బంతుల్లో 13 పరుగులు...

ఆ తర్వాతి బంతికి రెండు పరుగులు.. మిగిలినవి ఆఖరి రెండు బంతులు.. ఇందులో మొదటిది వైడ్‌... రెండో బంతికి ఒక్క పరుగు.. ఇప్పటిదాకా డ్రామా నడిపించిన బ్యాటర్‌ కథ అప్పుడే ముగిసిపోవాల్సింది.. కానీ ప్రత్యర్థి జట్టు ఫీల్డర్‌ క్యాచ్‌ డ్రాప్‌ చేయడంతో అతడు బతికిపోయాడు.

గెలవడానికి ఒక్క బంతికి తొమ్మిది పరుగులు కావాలి.. ఏమో మళ్లీ వైడ్‌ బాల్స్‌ పడతాయేమోనన్న ఉత్కంఠ.. కానీ ఈసారి అలా జరుగలేదు.. ఆఖరి బంతికి సిక్స్‌ బాదడంతో ఆ జట్టు ఇన్నింగ్స్‌ ముగిసింది. రెండు పరుగుల తేడాతో ప్రత్యర్థి విజయం సాధించింది.

ఓడిపోతామేమో.. భయపెట్టిన ఉనాద్కట్‌..  
ఐపీఎల్‌-2024లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- పంజాబ్‌ కింగ్స్‌ మధ్య ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌. నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన ఈ హోరాహోరీ పోరులో విజయం ఇరు జట్ల మధ్య ఊగిసలాడింది.

ఆఖరి ఓవర్‌లో రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌.. జయదేవ్‌ ఉనాద్కట్‌ చేతికి బంతినివ్వగా.. పంజాబ్‌ బ్యాటర్‌ అశుతోశ్‌ శర్మ వరుసగా.. 6, వైడ్‌, వైడ్‌, 6, 2, 2, వైడ్‌, 1.. ఇలా 20 పరుగులు రాబట్టాడు. చివరి బంతికి శశాంక్‌ సింగ్‌ సిక్స్‌ బాది స్కోరుకు మరో ఆరు పరుగులు జత చేశాడు.

మధ్యలో రాహుల్‌ త్రిపాఠి ఓసారి క్యాచ్‌ జారవిడిచాడు. ఇలా సన్‌రైజర్స్‌  బౌలర్‌, ఫీల్డర్‌ తప్పిదాలు చేసినా ఆఖరికి విజయం వారినే వరించింది. ఫలితంగా తాజా ఎడిషన్‌లో హైదరాబాద్‌ జట్టు ఖాతాలో మూడో గెలుపు చేరింది.

అదరగొట్టిన నితీశ్‌ రెడ్డి, అబ్దుల్‌ సమద్‌
కాగా ముల్లన్‌పూర్‌లో మంగళవారం జరిగిన పంజాబ్‌- సన్‌రైజర్స్‌ మ్యాచ్‌ ఆద్యంతం ఆసక్తి రేపింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ తెలుగు కుర్రాడు నితీశ్‌ రెడ్డి (37 బంతుల్లో 64), అబ్దుల్‌ సమద్‌(12 బంతుల్లో 25) మెరుపు ఇన్నింగ్స్‌ కారణంగా.. నిర్ణీత 20 ఓవర్లలో 189 రన్స్‌ స్కోరు చేసింది. 

ఇక లక్ష్య ఛేదనలో ఆఖరి బంతి వరకు పోరాడిన పంజాబ్‌ రెండు పరుగుల స్వల్ప తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో పాటు ఒక వికెట్‌ తీసిన నితీశ్‌ రెడ్డిని ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది. ఇక అభిమానులకు అసలైన టీ20 మజా అందించిన పంజాబ్‌- సన్‌రైజర్స్‌  ఆఖరి ఓవర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement
Advertisement