IPL 2024: బ్యాటర్ల ఊచకోత.. ముంబైను చిత్తు చేసిన సన్‌రైజర్స్‌ | IPL 2024: Sunrisers Hyderabad Beat Mumbai Indians By 32 Runs In High Scoring Game, Scores Inside - Sakshi
Sakshi News home page

IPL 2024 SRH Vs MI: బ్యాటర్ల ఊచకోత.. ముంబైను చిత్తు చేసిన సన్‌రైజర్స్‌

Published Wed, Mar 27 2024 11:49 PM

IPL 2024: Sunrisers Hyderabad Beat Mumbai Indians By 32 Runs In High Scoring Game - Sakshi

ఐపీఎల్‌ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మార్చి 27) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బ్యాటర్లు వీరంగం సృష్టించారు. ఫలితంగా ఆరెంజ్‌ ఆర్మీ 31 పరుగుల తేడాతో ముంబైను చిత్తు చేయడంతో పాటు లీగ్‌ చరిత్రలోనే అ‍త్యధిక టీమ్‌ స్కోర్‌ నమోదు చేసింది. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌.. ట్రవిస్‌ హెడ్‌ (24 బంతుల్లో 62; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్‌ శర్మ (23 బంతుల్లో 63; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), హెన్రిచ్‌ క్లాసెన్‌ (34 బంతుల్లో 80 నాటౌట్‌; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు అర్దశతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. 

ఈ ముగ్గురి వీర బాదుడుకు ఎయిడెన్‌ మార్క్రమ్‌ (28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 42 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ కూడా తోడైంది. సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో మయాంక్‌ అగర్వాల్‌ (11) ఒక్కడే తక్కువ స్కోర్‌కు ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో హెడ్‌ 18 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేయగా.. అభిషేక్‌ శర్మ 16, క్లాసెన్‌ 23 బంతుల్లో హాఫ్‌ సెంచరీలు పూర్తి చేశారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరఫున అభిషేక్‌ శర్మ ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు.

సన్‌రైజర్స్‌ బ్యాటర్ల విధ్వంసం ధాటి​కి ముంబై బౌలింగ్‌ లైనప్‌ కకావికలమైంది. బుమ్రా ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు. హార్దిక్‌, కొయెట్జీ, పియుశ్‌ చావ్లా తలో వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై తొలి 12 ఓవర్లలో సన్‌రైజర్స్‌కు దడ పుట్టించింది. ఓ దశలో ముంబై సన్‌రైజర్స్‌కు షాకిచ్చేలా కనిపించింది. ఇషాన్‌ కిషన్‌ (13 బంతుల్లో 34; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (12 బంతుల్లో 26; ఫోర్‌, 2 సిక్సర్లు), నమన్‌ ధిర్‌ (14 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్‌ వర్మ (34 బంతుల్లో 64; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), టిమ్‌ డేవిడ్‌ (22 బంతుల్లో 42 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సన్‌రైజర్స్‌ శిబిరంలో కలకలం సృష్టించారు. ముంబై ఇన్నింగ్స్‌లో హార్దిక్‌ పాండ్యా (20 బంతుల్లో 24; ఫోర్‌, సిక్స్‌) 12వ ఓవర్‌ తర్వాత నెమ్మదించడంతో ముంబై ఓటమి ఖారారైపోయింది.

ఆఖర్లో టిమ్‌ డేవిడ్‌తో కలిసి రొమారియో షెపర్డ్‌ (6 బంతుల్లో 12 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌) భారీ షాట్లు ఆడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముంబై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసి లక్ష్యానికి 32 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. సన్‌రైజర్స్‌ బౌలర్లు సైతం ముంబై బ్యాటర్ల విధ్వంసానికి బలయ్యారు. కమిన్స్‌ (4-0-35-2) ఒక్కడే పర్వాలేదనిపించాడు. ఉనద్కత్‌ (2/47), షాబాజ్‌ అహ్మద్‌ (1/39) వికెట్లు తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అభిషేక్‌ శర్మకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement