Kane Williamson Is The Only Cricketer To Score Centuries Against All Test Playing Nations Before 2018 - Sakshi
Sakshi News home page

కేన్‌ విలియమ్స్‌ ఒక్కడే.. స్మిత్‌, రూట్‌, విరాట్‌ల కంటే ముందే..!

Published Tue, Aug 8 2023 3:11 PM

Kane Williamson Is The Only Cricketer In Modern Era To Score Centuries Against All Test Playing Nations Before 2018 - Sakshi

2023 ఆగస్ట్‌ 8న 33వ పుట్టిన రోజు జరుపుకుంటున్న న్యూజిలాండ్‌ వన్డే జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌కు యావత్‌ క్రికెట్‌ ప్రపంచ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది. విలియమ్సన్‌ బర్త్‌ డే విషెస్‌తో ఇవాళ సోషల్‌మీడియా మొత్తం హోరెత్తిపోతుంది. 13 ఏళ్ల కెరీర్‌లో కేన్‌ మామ సాధించిన ఘనతలను ప్రస్తావిస్తూ అభిమానులు రకరకాల పోస్ట్‌లు పెడుతున్నారు. ఆ దేశం ఈ దేశం అన్న తేడా లేకుండా యావత్‌ క్రికెట్‌ ప్రపంచం మొత్తం కేన్‌ను కీర్తిస్తుంది. ఈ క్రమంలో అతనికి సంబంధించిన పలు ఆసక్తికర గణాంకాలు, రికార్డులు తెరపైకి వచ్చాయి.

ప్రస్తుత తరం క్రికెటర్లలో అత్యుత్తముల్లో ఒకడిగా, ఫాబ్‌-4 క్రికెటర్లలో ముఖ్యుడిగా, ఈ తరం క్రికెటర్లలో అత్యంత నెమ్మదస్తుడిగా పేరున్న కేన్‌ మామ.. 

అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్లలో కలిపి) 17000కు పైగా పరుగులు సాధించి, న్యూజిలాండ్‌ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా చలామణి అవుతున్నాడు.

2019 వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌ను దాదాపు గెలిపించినంత పని చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ అవార్డు అందుకున్నాడు. ఈ వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌ను అదృష్టం వరించి ఛాంపియన్‌గా నిలిచింది.

ఇనాగురల్‌ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో (2019-2021) న్యూజిలాండ్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. 

అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్‌ తరఫున అత్యధిక సెంచరీలు (41), ప్రస్తుత తరం క్రికెటర్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో ఆటగాడు (17142), బ్యాటర్‌గా, కెప్టెన్‌గా అద్భుతమైన ట్రాక్‌ రికార్డు.. ఇలా కేన్‌ మామ తన ప్రతిభ, ప్రవర్తనలతో క్రికెట్‌ ప్రపంచం మొత్తానికి ఆరాధ్యుడిగా నిలిచాడు.

పరిమిత ఓవర్ల ఫార్మాట్లతో పోలిస్తే టెస్ట్‌ల్లో ఘనమైన రికార్డు కలిగిన కేన్‌ (28 టెస్ట్‌ సెంచరీలు), ఫాబ్‌ ఫోర్‌గా పిలువబడే స్టీవ్‌ స్మిత్‌ (32 సెంచరీలు), జో రూట్‌ (30), విరాట్‌ కోహ్లి (29)ల కంటే ఒకటి, రెండు సెంచరీలు తక్కువగా చేసినా, వీరందరి కంటే ముందే ఓ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

స్మిత్‌, రూట్‌,కోహ్లిలతో పాటు ప్రస్తుత తరం క్రికెటర్లలో అందరికంటే ముందే అన్ని టెస్ట్‌ ప్లేయింగ్‌ దేశాలపై సెంచరీలు సాధించి, తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కేన్‌ మామ 2018కి ముందే అప్పటికి టెస్ట్‌ క్రికెట్‌ ఆడే దేశాలన్నిటిపై సెంచరీలు సాధించాడు. అప్పటికి స్మిత్‌, కోహ్లి, రూట్‌లు ఈ ఘనత సాధించలేదు. కేన్‌ ఈ ఘనత సాధించిన సమయానికి దిగ్గజాలు మర్వన్‌ ఆటపట్టు, రాహుల్‌ ద్రవిడ్‌, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, జయవర్ధనే, కలిస్‌, కిర్‌స్టెన్‌, లారా, పాంటింగ్‌, సంగక్కర, యూనిస్‌ ఖాన్‌, సచిన్‌, స్టీవ్‌ వాలు మాత్రమే ఈ ఘనత సాధించారు. 

కేన్‌ విలియమ్సన్‌ గణంకాలు..

  • 54.9 సగటుతో 8124 టెస్ట్‌ పరుగులు (28 సెంచరీలు, 33 హాఫ్‌ సెంచరీలు) 
  • 47.8 సగటుతో 6555 వన్డే పరుగులు (13 సెంచరీలు, 42 హాఫ్‌ సెంచరీలు)
  • 123 స్ట్రయిక్‌రేట్‌తో 2464 టీ20 పరుగులు (17 హాఫ్‌ సెంచరీలు)
  • 126 స్ట్రయిక్‌రేట్‌తో 2101 ఐపీఎల్‌ పరుగులు (18 హాఫ్‌ సెంచరీలు)
  • 2018 ఐపీఎల్‌ ఆరెంజ్‌ క్యాప్‌

Advertisement
Advertisement