క‌ర్ణాట‌క బ్యాట‌ర్ సంచ‌ల‌నం.. భార‌త క్రికెట్‌లో స‌రికొత్త చ‌రిత్ర‌ | Sakshi
Sakshi News home page

46 ఫోర్లతో విధ్వంసం: క‌ర్ణాట‌క బ్యాట‌ర్ సంచ‌ల‌నం.. భార‌త క్రికెట్‌లో స‌రికొత్త చ‌రిత్ర‌

Published Mon, Jan 15 2024 5:24 PM

Karnataka Youngster Achieves Historic First In Indian Cricket 404 Not Out - Sakshi

COOCH BEHER TROPHY- Prakhar Chaturvedi: క‌ర్ణాట‌క యువ బ్యాట‌ర్ ప్ర‌ఖార్ చ‌తుర్వేది స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. కూచ్ బెహ‌ర్ ట్రోఫీ ఫైన‌ల్లో అత్య‌ధిక స్కోరు సాధించిన భార‌త క్రికెట‌ర్‌గా రికార్డుల‌కెక్కాడు. అండ‌ర్‌-19 స్థాయిలో నిర్వ‌హించే నాలుగు రోజుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఏకంగా 400కు పైగా ప‌రుగులు సాధించి ఈ ఘ‌న‌త సాధించాడు.

కూచ్ బెహ‌ర్ ట్రోఫీ 2023-24 ఫైన‌ల్లో ముంబై- క‌ర్ణాట‌క త‌ల‌ప‌డ్డాయి. కేఎస్‌సీఏ న‌వులే స్టేడియంలో జ‌న‌వ‌రి 12న మొద‌లైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన క‌ర్ణాట‌క తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ లో ముంబైని 384 ప‌రుగుల‌కు ఆలౌట్ చేసింది.

ఈ క్ర‌మంలో  సోమ‌వారం నాటి ఆట‌లో భాగంగా 256 ప‌రుగుల‌ ఓవ‌ర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ ఆరంభించిన క‌ర్ణాట‌క ఓపెన‌ర్ ప్ర‌ఖార్ చ‌తుర్వేది బ్యాట్‌తో వీర‌విహారం చేశాడు. ఏకంగా 46 ఫోర్లు, 3 సిక్స‌ర్లు బాదిన అత‌డు.. 404 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. ప్ర‌ఖార్ విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ కార‌ణంగా క‌ర్ణాట‌క రికార్డు స్థాయిలో 890 ప‌రుగులు చేసింది.

ఆట ముగిసే స‌రికి భారీ స్కోరు వ‌ద్ద తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. దీంతో క‌ర్ణాట‌క‌- ముంబై మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా ప్ర‌ఖార్ చ‌తుర్వేది మొత్తంగా 638 బంతులు ఎదుర్కొని 404 ప‌రుగులు సాధించ‌డం విశేషం. ఈ క్ర‌మంలో అత‌డిపై నెట్టింట ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

చ‌ద‌వండి: BCCI: బీసీసీఐ సెల‌క్ట‌ర్‌పై వేటు? కార‌ణం అదే! ప్ర‌క‌ట‌న విడుద‌ల‌

Advertisement
Advertisement