కీరన్‌ పొలార్డ్‌ ఊచకోత.. కేవలం 7 బంతుల్లోనే | Sakshi
Sakshi News home page

SA20 2024: కీరన్‌ పొలార్డ్‌ ఊచకోత.. కేవలం 7 బంతుల్లోనే

Published Fri, Feb 2 2024 12:10 PM

Kieron Pollards mammoth six hits the top of scoreboard in SA20 - Sakshi

వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ కిరాన్‌ పోలార్డ్‌ తనలో ఏ మాత్రం దూకుడు తగ్గలేదని నిరూపించుకుంటున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2024లో ఏంఐ కేప్‌టౌన్‌కు సారథ్యం వహిస్తున్న పొలార్డ్‌ ఆల్‌ రౌండ్‌ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా గురువారం ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఆరో స్ధానంలో బ్యాటింగ్‌ వచ్చి ప్రిటోరియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 7 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 27 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అంతేకాకుండా బౌలింగ్‌లో కూడా ఓ వికెట్‌ పడగొట్టాడు. ఇక ఈ మ్యచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన  ఏంఐ కేప్‌టౌన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

ఏంఐ బ్యాటర్లలో ఓపెనర్‌ రికెల్టన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 45 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 90 పరుగులు చేశాడు. అతడితో పాటు డెవాల్డ్‌ బ్రెవిస్‌( 32 బంతుల్లో66, 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. అనంతరం 249 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రిటోరియా ఆఖరి వరకు పోరాడింది.

లక్ష్య చేధనలో ప్రిటోరియా 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. దీంతో 34 పరుగుల తేడాతో  ఓటమి చవిచూసింది. కాగా ప్రిటోరియా బ్యాటర్‌ కైల్‌ వెర్రెయిన్నే విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 52 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 116 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

Advertisement
Advertisement