యో- యో టెస్టులో పాసయ్యాను.. ఫొటో షేర్‌ చేసిన కోహ్లి! స్కోరెంతంటే.. | Virat Kohli Shares Yo-Yo Test Result From Bengaluru NCA Camp - Sakshi
Sakshi News home page

Virat Kohli: యో- యో టెస్టులో పాసయ్యాను.. ఫొటో షేర్‌ చేసిన కోహ్లి! స్కోరెంతంటే..

Published Thu, Aug 24 2023 12:47 PM

Kohli Shares Yo Yo Test Result From Bengaluru Between the Dreaded Cones Viral - Sakshi

Virat Kohli shares his Yo-Yo test result: ఫిట్‌నెస్‌కు మారుపేరు అంటే టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లినే గుర్తుకువస్తాడు చాలామందికి! జిమ్‌లో వివిధ రకాల కసరత్తులు చేస్తూ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటాడు ఈ సెంచరీల కింగ్‌! అందుకే తన పదిహేనేళ్ల కెరీర్‌లో ఫిట్‌నెస్‌లేమి, గాయాల కారణంగా జట్టుకు దూరమైన సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి.

ఇక వెస్టిండీస్‌ పర్యటన తర్వాత విరాట్‌ కోహ్లి కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. విండీస్‌లో టెస్టు సందర్భంగా 76వ సెంచరీ సాధించిన ఈ రన్‌మెషీన్‌.. ఇప్పుడిక ఆసియా కప్‌-2023 మీద దృష్టి సారించాడు. ఆగష్టు 30 నుంచి ఆరంభం కానున్న ఈ వన్డే టోర్నీకి సిద్ధమవుతున్నాడు.

యో-యో టెస్టు క్లియర్‌ చేసిన కోహ్లి
ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లతో పాటు కోహ్లి బెంగళూరుకు చేరుకున్నాడు. జాతీయ క్రికెట్‌ అకాడమీలో వారం రోజుల పాటు జరుగనున్న ట్రెయినింగ్‌ క్యాంపులో భాగం కానున్నాడు. ఈ సందర్భంగా ఫిట్‌నెస్‌ టెస్టులో పాసైనట్లు కోహ్లి తాజాగా వెల్లడించాడు. ఆలూరులో నిర్వహించిన యో- యో టెస్టును క్లియర్‌ చేసినట్లు తెలిపాడు.

కోహ్లి ఫొటో వైరల్‌
ఈ మేరకు కోహ్లి తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ పెట్టాడు. టెస్టులో 17.2 స్కోర్‌ చేసినట్లు తెలిపిన కోహ్లి సంతోషంగా ఉందంటూ నవ్వుతూ ఉన్న ఫొటో పంచుకున్నాడు. కాగా కోహ్లితో పాటు విండీస్‌ టూర్‌ తర్వాత విశ్రాంతి తీసుకున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా సహా మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమీ తదితరులు కూడా ఫిట్‌నెస్‌ టెస్టుకు హాజరు కానున్నారు. 

ప్రత్యేక ఫిట్‌నెస్‌ కార్యక్రమాలు
కాగా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, స్టార్‌ బ్యాటర్లు కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ చాలా కాలంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే.  కీలక మ్యాచ్‌లకు ప్రధాన ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలో బీసీసీఐ ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌లపై మరింత దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ఎన్సీఏ ట్రైనర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది.

కోహ్లి, రోహిత్‌లు సెలవుల్లోనూ..
ఆసియా కప్‌ టోర్నీకి ముందు 13 రోజుల పాటు నిర్వహించిన సెషన్‌లో ఆగష్టు 9-22 వరకు కోహ్లి, రోహిత్‌ వంటి కీలక ఆటగాళ్లతో ప్రత్యేకంగా ఎక్సర్‌సైజులు చేయించినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనంలో పేర్కొంది. షోల్డర్‌ కేర్‌, మజిల్‌ కేర్‌ సహా యోగా, మసాజ్‌లతో పాటు వాకింగ్‌, స్విమ్మింగ్‌, రన్నింగ్‌, మంచి నిద్ర ఇందులో భాగం. ఆహారం విషయంలోనూ స్పెషల్‌ కేర్‌ తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 2న పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో టీమిండియా తమ ఆసియా కప్‌ ప్రయాణం మొదలుపెట్టనుంది.

చదవండి:  హార్దిక్‌, బుమ్రా కాదు.. టీమిండియా ఫ్యూచర్‌ కెప్టెన్‌ అతడే!

Advertisement

తప్పక చదవండి

Advertisement