విషాదం.. క్రికెట్‌ దిగ్గజం కన్నుమూత | Sakshi
Sakshi News home page

విషాదం.. క్రికెట్‌ దిగ్గజం కన్నుమూత

Published Sun, Feb 18 2024 10:16 AM

Legendary South Africa All Rounder Mike Procter Dies Aged 77 - Sakshi

దక్షిణాఫ్రికా క్రికెట్‌లో విషాదం నెలకొంది. ఆ దేశ దిగ్గజ ఆటగాడు, మ్యాచ్‌ రిఫరి మైక్‌ ప్రోక్టర్‌ (77) కన్నుమూశారు. గుండె సర్జరీ అనంతరం వచ్చే సమస్యల కారణంగా ప్రోక్టర్‌ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దక్షిణాఫ్రికా క్రికెట్‌ తొలినాళ్లలో ప్రోక్టర్‌ గొప్ప ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు. సౌతాఫ్రికా తరఫున కేవలం ఏడు టెస్ట్‌ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ప్రోక్టర్‌.. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఘనమైన రికార్డు కలిగి ఉన్నాడు. ప్రోక్టర్‌ 401 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 21936 పరుగులు, 1417 వికెట్లు పడగొట్టాడు.

ప్రోక్టర్‌ ఖాతాలో 48 సెంచరీలు, 70 ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. ప్రోక్టర్‌ అంతర్జాతీయ కెరీర్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌లు (1967-70 మధ్యలో) ఆస్ట్రేలియాతోనే ఆడాడు. ఇందులో 41 వికెట్లు పడగొట్టి, 25.1 సగటున 226 పరుగులు చేశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ప్రోక్టర్‌ పేరిట ఆరు వరుస సెంచరీల రికార్డు ఉంది. 1970లో రొడేషియా తరఫున అతను ఈ ఫీట్‌ సాధించాడు.

కౌంటీల్లో 13 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు గ్లోసెస్టర్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహించిన ప్రోక్టర్‌.. 1971లో ఆ కౌంటీ తరఫున వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు సాధించాడు. టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్బజన్‌ సింగ్‌పై నిషేధం విధించిన సిడ్నీ టెస్ట్‌కు ప్రోక్టర్‌ రిఫరిగా వ్యవహరించాడు. ప్రోక్టర్‌ రిఫరి విధుల నుంచి వైదొలిగిన అనంతరం జాతీయ జట్టు చీఫ్‌ సెలక్టర్‌గా కూడా వ్యవహరించాడు.

Advertisement
Advertisement