మళ్లీ అదే నవ్వు.. అర్థంపర్థం లేని వాగుడు: సౌతాఫ్రికా స్టార్‌ పోస్ట్‌ వైరల్‌ | Sakshi
Sakshi News home page

ఓడినా.. మళ్లీ అదే నవ్వు.. అర్థంపర్థం లేని వాగుడు: సౌతాఫ్రికా స్టార్‌ పోస్ట్‌ వైరల్‌

Published Tue, Apr 23 2024 10:59 AM

Lose Smile Repeat Nonsense: Did Dale Steyn Tear Into Hardik Without Naming Him - Sakshi

ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ ఐదో పరాజయాన్ని నమోదు చేసింది. రాజస్తాన్‌ రాయల్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయి పరాభవాన్ని మూటగట్టుకుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ మూడు విభాగాల్లోనూ విఫలమై ఓటమిని చవిచూసింది.

ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాటర్‌గా వైఫల్యం.. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను కాదని తానే బౌలింగ్‌ అటాక్‌ ఆరంభించడం.. ప్రత్యర్థి పరుగులు రాబడుతూ బౌలర్లపై ఒత్తిడి పెంచుతున్నపుడైనా బుమ్రాను బరిలోకి దించకపోవడం వంటివి ఇందుకు కారణం.

ఇదంతా ఒక ఎత్తైతే రాజస్తాన్‌ చేతిలో ఓటమి తర్వాత విషయాన్ని తేలిక చేసేలా హార్దిక్‌ పాండ్యా నవ్వుతూ మాట్లాడటం ముంబై ఇండియన్స్‌ ఫ్యాన్స్‌కు కూడా చిరాకు తెప్పించింది. తమ జట్టులోని ఆటగాళ్లంతా ప్రొఫెషనల్స్‌ అని.. వారికి తానేమీ కొత్త నేర్పించాల్సిన అవసరం లేదనడం.. ఆటగాళ్లకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని పేర్కొనడం.. తానేదో కెప్టెన్‌గా అంతా సరిగ్గానే చేశానన్నట్లుగా మాట్లాడటం ఒకింత ఆగ్రహం కూడా తెప్పించాయి.

ఓడినా.. మళ్లీ అదే నవ్వు.. అర్థంపర్థం లేని వాగుడు
ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘తమ మనసులో ఏముందో దానిని మాత్రమే ఉన్నది ఉన్నట్లుగా ఆటగాళ్లు బయటికి చెప్పే రోజు కోసం ఎదురుచూస్తూ ఉన్నా.

మౌనంగా ఉంటూ.. అంతా బాగానే ఉందనే భావన కల్పించేలా రక్షణాత్మక ధోరణి అవలంభించకుండా కుండబద్దలు కొట్టాలి. తదుపరి ఓటమి. మళ్లీ అదే నవ్వు.. అర్థంపర్థంలేని వాగుడు’’ అంటూ డేల్‌ స్టెయిన్‌ ఘాటు విమర్శలు చేశాడు. 

తన పోస్ట్‌లో నేరుగా హార్దిక్‌ పాండ్యా పేరు ప్రస్తావించకపోయినా ఈ సౌతాఫ్రికా స్టార్‌ అతడిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముంబై ఇండియన్స్‌ ఓటమి నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యా మాట్లాడిన తర్వాత డేల్‌ స్టెయిన్‌ ఈ మేరకు ట్వీట్‌ చేయడం ఇందుకు కారణం.

ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ స్కోర్లు:
►వేదిక: సవాయి మాన్‌సింగ్‌ స్టేడియం, జైపూర్‌
►టాస్‌: ముంబై.. బ్యాటింగ్‌

►ముంబై స్కోరు: 179/9 (20)
►రాజస్తాన్‌ స్కోరు: 183/1 (18.4)

►ఫలితం: తొమ్మిది వికెట్ల తేడాతో ముంబైపై రాజస్తాన్‌ విజయం
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: సందీప్‌ శర్మ(5/18)- రాజస్తాన్‌
►టాప్‌ స్కోరర్‌: యశస్వి జైస్వాల్‌(60 బంతుల్లో 104 నాటౌట్‌)- రాజస్తాన్‌.

Advertisement

తప్పక చదవండి

Advertisement