మేరీ పంచ్‌ అదిరె...

26 Jul, 2021 05:19 IST|Sakshi

టోక్యో: భారత సీనియర్‌ బాక్సర్, 2012 ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత మేరీకోమ్‌ టోక్యోలో తొలి అడుగును విజయవంతంగా వేసింది. రెండో ఒలింపిక్‌ పతకాన్ని ఆశిస్తున్న భారత బాక్సింగ్‌ దిగ్గజం ఆదివారం జరిగిన 51 కేజీల విభాగం తొలి రౌండ్‌లో 4–1 తేడాతో మిగులినా హెర్నాండెజ్‌ (డొమినికన్‌ రిపబ్లిక్‌)ను ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన 38 ఏళ్ల మేరీకోమ్‌ ముందు 23 ఏళ్ల మిగులినా నిలవలేకపోయింది. తర్వాతి పోరులో కొలంబియాకు చెందిన మూడో సీడ్‌ ఇన్‌గ్రిట్‌ వలెన్సియాతో తలపడుతుంది.  

పురుషుల 63 కేజీలవిభాగంలో భారత బాక్సర్‌ మనీశ్‌ కౌశిక్‌కు చుక్కెదురైంది. తొలి పోరులోనే అతను ఓటమిపాలై నిష్క్రమించాడు. బ్రిటన్‌కు చెందిన ల్యూక్‌ మెక్‌కార్మాక్‌ 4–1తో మనీశ్‌ను ఓడించాడు. 

మరిన్ని వార్తలు