వరుసగా మూడోసారి ఒలింపిక్స్‌లో పోటీపడనున్న భారత స్టార్‌ వెయిట్‌ లిఫ్టర్‌ | Sakshi
Sakshi News home page

వరుసగా మూడోసారి ఒలింపిక్స్‌లో పోటీపడనున్న భారత స్టార్‌ వెయిట్‌ లిఫ్టర్‌

Published Tue, Apr 2 2024 9:30 AM

Mirabai Chanu Qualified For Olympics Thrice In A Row - Sakshi

బ్యాంకాక్‌: భారత స్టార్‌ మహిళా లిఫ్టర్‌ మీరాబాయి చాను పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం దాదాపు ఖరారైంది. అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్‌) ప్రపంచకప్‌లో సోమవారం జరిగిన మహిళల 49 కేజీల ఈవెంట్‌లో టోక్యో ఒలింపిక్స్‌ రజత పతక విజేత మీరాబాయి మూడో స్థానంలో నిలిచింది. 6 నెలల విరామానంతరం బరిలోకి దిగిన ఆమె గ్రూప్‌ ‘బి’లో పోటీపడి మొత్తం 184 కేజీల (81+103) బరువెత్తింది.

తద్వారా మీరా మూడో స్థానంలో నిలిచింది. ఫలితమిలా ఉన్నప్పటికీ తప్పనిసరి టోర్నీల్లో పాల్గొనడంతో పాటు, 49 కేజీల కేటగిరీలో ఆమె ఒలింపిక్‌ క్వాలిఫికేషన్‌ ర్యాంకింగ్‌లో రెండో స్థానంలో ఉంది. చైనా లిఫ్టర్‌ జియాన్‌ హుయ్‌హువా అగ్రస్థానంలో ఉండగా, ప్రతి కేటగిరీ నుంచి టాప్‌–10 లిఫ్టర్లకు పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌లు లభిస్తాయి. దీంతో 2017 ప్రపంచ చాంపియన్‌ మీరాబాయి జూలైలో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత పొందడం లాంఛనం కానుంది.

ప్రపంచకప్‌ ముగిశాక క్వాలిఫయర్ల జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు. మణిపూర్‌కు చెందిన మీరాబాయికివి వరుసగా మూడో ఒలింపిక్స్‌ క్రీడలు కానున్నాయి. రియో ఒలింపిక్స్‌లో మీరాబాయి విఫలంకాగా, టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సొంతం చేసుకుంది.  


 

Advertisement
Advertisement